Israel: అంతర్జాతీయ శాంతిభద్రతలకు ఇజ్రాయెల్‌ ముప్పు: ఇరాన్‌ అధ్యక్షుడు

గాజాలో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇజ్రాయెలే కారణమని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఆరోపించారు. గాజా అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు అని విమర్శించారు.

Updated : 22 Nov 2023 05:02 IST

టెహ్రాన్‌: గాజా (Gaza) సమస్య.. మానవత్వానికి, న్యాయానికి సంబంధించిన అంశమని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) అన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas) యుద్ధం నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్రిక్స్‌ సమావేశంలో ఇబ్రహీం వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గాజాలో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇజ్రాయెలే కారణమని ఆరోపించారు.

‘‘ఇజ్రాయెల్‌, ఆ దేశానికి మద్దతిస్తున్నవారంతా మానవత్వాన్ని, విలువల్ని, హక్కులను ఉల్లంఘిస్తున్నారు. గాజాలో వాస్తవ పరిస్థితుల్ని దాచిపెట్టి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల అభిప్రాయాలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాజాలో మారణకాండకు అమెరికా మద్దతున్న ఇజ్రాయెలే బాధ్యత వహించాలి’’అని ఇబ్రహీం ధ్వజమెత్తారు. గాజాలోని ఆస్పత్రుల్లో దాడులు చేస్తూ మహిళలు, చిన్నారులు, వైద్యులు, పాత్రికేయుల్ని కూడా హతమారుస్తున్న ఇజ్రాయెల్‌ను ఉగ్రవాద దేశంగా, సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాల్సిన అవసరముందన్నారు. 

అణ్వస్త్రాలు, రసాయన ఆయుధాలు కలిగి ఉన్న ఇజ్రాయెల్‌ ప్రాంతీయంగానే కాదు.. అంతర్జాతీయ శాంతి భద్రతలకూ ముప్పేనని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధాన్ని నిలువరించడంలో ఐరాస భద్రత మండలి విఫలమైందని, బ్రిక్స్‌ దేశాలన్నీ కలిసికట్టుగా గాజాపై దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని