North Korea: అణుయుద్ధం అంచుల్లో ఉన్నాం: ఉత్తర కొరియా

తన దేశ సరిహద్దులో అమెరికా, ద.కొరియా కొద్దికాలంగా నిర్వహిస్తోన్న సైనిక విన్యాసాలపై ఉ.కొరియా(North Korea) ఆగ్రహంగా ఉంది. దాంతో ఆ దేశాలకు తీవ్ర హెచ్చరికలు పంపుతోంది. 

Updated : 06 Apr 2023 18:29 IST

ప్యాంగ్యాంగ్‌: అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియా ద్వీపకల్ప వాతావరణం గరంగరంగా ఉంటోంది. వీటిని ఎప్పటికప్పుడు ఉత్తర కొరియా(North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్(Kim Jong-un) ఖండిస్తూనే ఉన్నారు. దీనికి తోడు ప్రతిగా క్షిపణి ప్రయోగాలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఉత్తరకొరియా తీవ్ర హెచ్చరికలు చేసింది. అమెరికా-దక్షిణ కొరియా విన్యాసాల ద్వారా ఉద్రిక్తతలు పెంచుతున్నాయని, అణుయుద్ధం అంచుకు నెడుతున్నాయని మండిపడింది. ఈ రెచ్చగొట్టే చర్యలకు తగినస్థాయిలో సమాధానం ఉంటుందని ఉ.కొరియా స్పందించింది. ఈ మేరకు అక్కడి మీడియా సంస్థ కేసీఎన్‌ఏ కథనాన్ని ప్రచురించింది.

‘ఉ.కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్రదేశాల నిర్లక్ష్య సైనిక ఘర్షణలు.. కొరియా ద్వీపకల్ప ప్రాంతాన్ని వినాశకర అణు యుద్ధం అంచుకు నడిపిస్తున్నాయి. ఈ ప్రాంతంపై వేలాడుతున్న అణుయుద్ధ మేఘాలు సాధ్యమైనంత త్వరగా తొలగిపోవాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. యుద్ధ విన్యాసాల వల్ల ఈ ప్రాంతం ఆయుధ సామాగ్రితో నిండిపోయింది. అది ఏ క్షణమైనా పేలిపోతుంది’ అని వ్యాఖ్యానించింది. వాటిని దురాక్రమణకు సన్నాహాలుగా అభివర్ణించింది. యూఎస్‌, ద.కొరియా భారీ సైనిక విన్యాసాలపై కిమ్(Kim) పదునైన వ్యాఖ్యలతో అలజడి సృష్టించారు. అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యాన్ని ఆదేశించారు. ఇరు దేశాల మధ్య యుద్ధ క్షేత్ర సమన్వయాన్ని మెరుగుపర్చుకోవడం, అమెరికా తన మిత్రపక్షాల రక్షణకు ఎంత అండగా ఉండనుందో చాటిచెప్పడానికే ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు ద.కొరియా గతంలో వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని