Ukraine Crisis: పుతిన్‌తో భేటీ కావాలనుకుంటున్నా..: పోప్‌

ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఇవ్వాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ మంగళవారం కోరారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతు ఇచ్చిన రష్యాలోని ఆర్థోడాక్స్‌ చర్చరి పుతిన్‌కు ఆల్టర్‌ బాయ్‌ వలే

Updated : 03 May 2022 20:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఇవ్వాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ మంగళవారం కోరారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతు ఇచ్చిన రష్యాలోని ఆర్థడాక్స్‌ చర్చిని పుతిన్‌కు ఆల్టర్‌ బాయ్‌ వలే పనిచేయకూడదని హితవు పలికారు. కొరియర్‌ డెల్లాసెరా అనే న్యూస్‌పేపర్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మొదలుకాగానే పోప్‌ ఫ్రాన్సిస్‌ రష్యా దౌత్యకార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అదే సమయంలో తాను మాస్కోకు రావాలనుకుంటున్న విషయాన్ని క్రెమ్లిన్‌ నేతకు తెలియజేయాలనే సందేశం పంపాన్నారు. కానీ, ఇప్పటి వరకు దానికి ఎటువంటి ప్రతిస్పందన రాలేదని పేర్కొన్నారు.  పుతిన్‌ అసలు తనతో భేటీ కావాలని కోరుకోవడంలేదన్న భయం తనలో ఉందని వెల్లడించారు.

ఇక ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు పర్యటనపై కూడా పోప్‌ స్పందించారు. ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. ‘‘ముందు మాస్కోకు వెళ్లనివ్వండి. పుతిన్‌తో భేటీ కానివ్వండి. తొలుత నేను ఏమి చేయగలనో అవి చేయనీయండి. పుతిన్‌ మాత్రమే దీని పరిష్కారానికి అవకాశం ఇవ్వగలరు’’ అని పేర్కొన్నారు. వాస్తవానికి గత నెలలో పోప్‌ మాట్లాడుతూ కీవ్‌కు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైన తర్వాత పోప్‌ ఫ్రాన్సిస్‌  ఎన్నడూ రష్యా లేదా పుతిన్‌ గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల పోప్‌ రష్యాలోని ఆర్థడాక్స్‌ చర్చ్‌ అధిపతి పాట్రియార్క్‌ కిరిల్‌తో దాదాపు 20 నిమిషాలపాటు  జూమ్‌ కాల్‌లో మాట్లాడారు. కిరిల్‌ రష్యా యుద్ధానికి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. పుతిన్‌ ఆల్టర్‌ బాయ్‌ వలే కిరల్‌ మారకూడదని ఈ సందర్భంగా పోప్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని