Russia: రష్యా అధ్యక్ష ఎన్నికలు.. సైనిక చర్య విమర్శకుడి అభ్యర్థిత్వం తిరస్కరణ!

ఉక్రెయిన్‌పై సైనిక చర్యను వ్యతిరేకిస్తోన్న బోరిస్‌ నాదెజ్దిన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వ దరఖాస్తును రష్యా ఎన్నికల సంఘం తిరస్కరించింది.

Published : 09 Feb 2024 01:35 IST

మాస్కో: వచ్చే నెలలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు (Russia Presidential Election) నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై సైనిక చర్యను వ్యతిరేకిస్తోన్న బోరిస్‌ నాదెజ్దిన్‌ (Boris Nadezhdin) అధ్యక్ష అభ్యర్థిత్వ దరఖాస్తును రష్యా ఎన్నికల కమిషన్‌ తిరస్కరించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే స్థానిక చట్టాల ప్రకారం అభ్యర్థులు తమకు మద్దతుగా కనీసం లక్ష సంతకాలు సేకరించాలి. వాటిలో ఐదు శాతానికిపైగా తిరస్కరణకు గురికావొద్దు. అయితే, ఆయన సమర్పించిన 1.05 లక్షల సంతకాల్లో 9 వేలకుపైగా చెల్లనివి ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో పుతిన్‌కు మార్గం మరింత సుగమమైంది.

తన అనర్హతపై రష్యా సుప్రీం కోర్టులో సవాలు చేస్తానని నాదెజ్దిన్‌ చెప్పారు. ‘‘నేను ఒంటరిని కాదు. నా కోసం సంతకాలు పెట్టిన లక్షలాది మంది రష్యన్ పౌరులు నా వెనుక ఉన్నారు’’ అని అన్నారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను నిలిపేయాలని, పశ్చిమ దేశాలతో చర్చలు ప్రారంభించాలని ఆయన గతంలో బహిరంగంగా పిలుపునిచ్చారు. ఆయన ప్రచారానికి పుతిన్‌ విమర్శకుడు అలెక్సీ నావల్నీ మద్దతు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. దేశ రాజకీయ వ్యవస్థపై తనకున్న గట్టి పట్టు కారణంగా ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మళ్లీ ఎన్నికల్లో గెలుపొందడం దాదాపు ఖాయమేనని కథనాలు వెలువడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని