Israel Hamas: గాజాపై ఇజ్రాయెల్‌ చర్యలు.. ఆ దేశానికే బెడిసికొట్టొచ్చు: ఒబామా

హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌ తీసుకుంటున్న కొన్ని చర్యలు.. ఆ దేశానికే ఎదురుతగిలే అవకాశం ఉందని బరాక్‌ ఒబామా హెచ్చరించారు.

Updated : 24 Oct 2023 12:49 IST

వాషింగ్టన్‌: హమాస్‌ ఉగ్ర నెట్‌వర్క్‌ లక్ష్యంగా గాజాలో సాగిస్తోన్న పోరులో భాగంగా ఇజ్రాయెల్‌ (Israel) తీసుకుంటున్న కొన్ని చర్యలు.. చివరకు ఆ దేశానికే బెడిసి కొట్టే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (Barack Obama) హెచ్చరించారు. గాజాను దిగ్బంధించి ఆహారం, నీటి సరఫరా నిలిపివేత వంటి ఆంక్షల.. ఇజ్రాయెల్‌ విషయంలో పాలస్తీనీయుల ఆగ్రహాన్ని మరింత పెంచవచ్చన్నారు. పైగా ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ మద్దతునూ బలహీనపరుస్తాయని చెప్పారు. ఒకవైపు హమాస్‌ దాడులను ఖండిస్తూనే.. మరోవైపు యుద్ధంలో ప్రాణనష్టాన్ని పట్టించుకోని ఇజ్రాయెల్ సైనిక వ్యూహాలు.. చివరకు వారికే ఎదురుతగిలే ప్రమాదం ఉందని ఒబామా హెచ్చరించారు.

‘‘గాజాకు ఆహారం, నీరు, విద్యుత్తును నిలిపివేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మానవతా సంక్షోభాన్ని దిగజార్చడమే కాకుండా, పాలస్తీనీయుల ఆగ్రహాన్ని మరింత ఎగదోస్తుంది. ఇజ్రాయెల్‌కు ప్రపంచ మద్దతును దెబ్బతీసే అవకాశం ఉంది. ఆ దేశ శత్రువులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు స్థానికంగా శాంతి, స్థిరత్వాలను సాధించేందుకు చేస్తున్న దీర్ఘకాలిక ప్రయత్నాలను బలహీనపరుస్తుంది’’ అని ఒబామా వ్యాఖ్యానించారు. అయితే, హమాస్ దాడులను ఖండిస్తూ.. తనను తాను రక్షించుకునే విషయంలో ఇజ్రాయెల్‌కు తన మద్దతును పునరుద్ఘాటించారు. అదే సమయంలో దాడుల్లో పౌర ప్రాణనష్టంపై హెచ్చరించారు.

మరో ఇద్దరు బందీలను విడిచిపెట్టిన హమాస్‌..

ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. హమాస్‌- ఇజ్రాయెల్‌ విభేదాలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కుకు ఆయన మద్దతు ఇచ్చారు. అయితే, వైమానిక దాడుల కారణంగా పాలస్తీనీయుల ప్రాణనష్టం పెరగడంతో.. సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు మధ్యవర్తిత్వానికి ప్రయత్నించినప్పటికీ.. ఒబామా యంత్రాంగం విఫలమైంది. ఒబామా తన పాలనలో ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపడం.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్ ఇద్దరి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని