Taiwan: గత ఏడాదంతా 15 వేల కేసులొస్తే.. ఇప్పుడు రోజుకు 80 వేల కేసులు..!

2021 ఏడాదంతా అక్కడ స్థానికంగా 15 వేల దిగువనే కరోనా కేసులు వచ్చాయి.. ఇప్పుడు రోజు 80 వేల మంది కొవిడ్ బారినపడుతున్నారు. 2020 నుంచి 2021 వరకు 838 మరణాలు సంభవిస్తే.. ఇప్పుడు నిత్యం 40 నుంచి 50 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Published : 25 May 2022 01:57 IST

అయినా కరోనా ఆంక్షలు సడలిస్తోన్న తైవాన్ 

తైపీ: 2021 ఏడాదంతా అక్కడ స్థానికంగా 15 వేల దిగువనే కరోనా కేసులు వచ్చాయి.. ఇప్పుడు రోజు 80 వేల మంది కొవిడ్ బారినపడుతున్నారు. 2020 నుంచి 2021 వరకు 838 మరణాలు సంభవిస్తే.. ఇప్పుడు నిత్యం 40 నుంచి 50 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది తైవాన్ ఎదుర్కొంటోన్న కరోనా పరిస్థితి. కొవిడ్ విషయంలో ముందుజాగ్రత్తగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్న తైవాన్‌.. ఆంక్షలు సడలించడంతో భారీ స్థాయిలో కొత్త కేసుల్ని చవిచూస్తోంది. 

‘వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ వైరస్‌తో మేము జీరో కొవిడ్ లక్ష్యాన్ని సాధించలేము. ఇప్పటివరకూ వెలుగుచూసిన కేసుల్లో అధికంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌నే గుర్తించాం. దీని బారినపడిన 99.7 శాతం మంది అతి స్వల్ప లక్షణాలు కలిగిఉన్నారు లేక లక్షణ రహితంగా ఉన్నారు. ఇది ఒక సంక్షోభం. అలాగే ఒక అవకాశం కూడా. ఇది మమ్మల్ని కొవిడ్ నీడ నుంచి త్వరగా బయటపడేస్తుంది’ అంటూ తైవాన్ అంటువ్యాధుల నిపుణుడు చెన్‌ చియెన్‌ జెన్ అన్నారు. రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ.. ఆ దేశం ఆంక్షలను సడలిస్తోంది. ఇది ‘న్యూ తైవాన్ మోడల్‌’ అని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త విధానం కింద ప్రజలు క్రమంగా వైరస్‌తో కలిసి జీవించేలా, ఆర్థిక వ్యవస్థను మూసివేయకుండా ప్రయత్నిస్తోంది. పర్యాటకులను ఆహ్వానించేందుకు కూడా ఆ దేశం సిద్ధంగా ఉంది. 75 నుంచి 80 శాతం మంది మూడో డోసు తీసుకున్న తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం 64 శాతం మంది మూడో డోసు తీసుకున్నారని తెలిపింది.

ప్రస్తుతం తైవాన్‌లో నిత్యం 40 నుంచి 50 మరణాలు వస్తున్నాయి. 23.5 మిలియన్ల జనాభా కలిగిన తైవాన్‌లో.. గత ఏడాది 625 మరణాలు సంభవించాయి. 2020 నుంచి గత ఏడాది చివరకు 838 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మరణాల రేటును 0.1 శాతానికి పరిమితం చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆ రేటు 0.06 శాతంగా ఉంది. ఇక, వైరస్ కట్టడి, చిన్నారులకు టీకా ఇచ్చే విషయంలో అక్కడి అధికార పక్షంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని