
Omicron: ఒమిక్రాన్ ప్రాణాంతకమే.. మనుషుల్ని చంపేస్తోంది..!
ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేం.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా కొత్త రకం ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రత గత వేరియంట్ల కంటే తక్కువగా ఉందంటూ వస్తోన్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరోసారి తీవ్రంగా స్పందించింది. ఒమిక్రాన్‌ను తేలికపాటి వ్యాధి అని చెప్పడంలో అర్థం లేదని.. ఇది కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని హెచ్చరించింది. ఒమిక్రాన్ బాధితులూ ఆసుపత్రుల్లో చేరుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ తెలిపారు.
‘‘డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు (ముఖ్యంగా టీకాలు వేసుకున్న వారిలో) కన్పిస్తున్నప్పటికీ.. దీన్ని తేలికపాటి వ్యాధిగా పరిగణించడం సరైంది కాదు. ఇప్పటికే చాలా దేశాల్లో డెల్టా కంటే ఎక్కువ వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఫలితంగా కొన్ని దేశాల్లో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గత వేరియంట్లలాగే ఒమిక్రాన్ బాధితులు కూడా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇది కూడా మనుషుల్ని చంపేస్తోంది. నిజం చెప్పాలంటే కేసులు సునామీలా విరుచుకుపడుతున్నాయి. ఇవి యావత్ ప్రపంచంలోని ఆరోగ్య వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి’’ అని టెడ్రోస్ ప్రపంచాన్ని హెచ్చరించారు.
టీకా అసమానతల వల్లే..
వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతల వల్లే ఎన్నో ప్రాణాలు మహమ్మారికి బలవుతున్నాయని టెడ్రోస్ విచారం వ్యక్తం చేశారు. ‘‘టీకాల వినియోగంలో సంపన్న దేశాల స్వార్థపూరిత చర్యల వల్లే కొత్త వైరస్ వేరియంట్లు ఉద్భవించేందుకు ఆస్కారం కలిగింది. టీకాల అసమానతలే ప్రజల మరణాలకు కారణమవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను బలహీనపరుస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలకు కనీస వ్యాక్సిన్ల రక్షణ(ఒక్క డోసు కూడా ఇవ్వకుండా) లేకుండా.. కొన్ని దేశాలు తమ ప్రజలకు బూస్టర్ల మీద బూస్టర్లు ఇచ్చినంత మాత్రాన మహమ్మారిని అంతం చేయలేం. కనీసం 2022లో అయినా దేశాలు పారదర్శకంగా వ్యవహరించాలి. టీకాలను పంచుకోవడంలో సమతుల్యం పాటించాలి. అప్పుడే ఈ వినాశకర కొవిడ్‌ను ఆపగలం. 2022 మధ్య నాటికి ప్రతి దేశం కనీసం 70శాతం ప్రజలకు టీకాలు అందించాలి’’ అని టెడ్రోస్ సూచించారు.
ఒమిక్రానే చివరిది కాదు..!
ఇక ఒమిక్రాన్.. ఆందోళనకర రకాల్లో చివరి వేరియంట్ అని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్‌వో కొవిడ్ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వేరియంట్‌లు వస్తాయో ఊహించలేమని అన్నారు. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, వైరస్ నుంచి రక్షణకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. ముఖానికి మాస్క్‌లు అంటే ముక్కు, నోరు కప్పి ఉంచేలా పెట్టుకోవాలని అన్నారు. అంతేగాని, గడ్డం కిందకు మాస్క్‌ను వేలాడదీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని తెలిపారు.