Donald Trump: అధ్యక్ష రేసులో ట్రంప్‌ హవా.. రిపబ్లికన్‌ తొలి పోరులో ఘన విజయం

Donald Trump: రిపబ్లికన్‌ పార్టీ తొలి ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ఈ గెలుపు ఆయనకు కీలకం కానుంది.

Updated : 16 Jan 2024 10:45 IST

అయోవా: అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ (Republican Party) తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీ (Primary)లో కీలకమైన అయోవా కాకసస్ (Iowa caucuses) ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో ఇది మొదటిది. ఇందులో ట్రంప్‌ అత్యధిక మెజార్టీ సాధించారు.

ఈ ఎన్నికల్లో ట్రంప్‌నకు 51 శాతం ఓట్లు రాగా.. 21.2 శాతం ఓట్లతో ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌ రెండో స్థానంలో నిలిచారు. 19.1శాతం ఓట్లతో ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మూడో స్థానం దక్కించుకున్నారు. ఇక, రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నేత వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) ప్రైమరీ తొలి పోరులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 7.7శాతం ఓట్లు వచ్చాయి. అయోవాలో ప్రస్తుతం విపరీతమైన మంచు కురుస్తోంది. అయినప్పటికీ ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పశ్చిమాసియా గడ్డపై మరో ఘర్షణ.. ఇరాక్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవా కాకసస్‌తో ఈ ప్రక్రియ మొదలైంది. జనవరి 23న న్యూ హాంప్‌షైర్‌లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి నుంచి పలు రాష్ట్రాల్లో ఈ పోలింగ్‌ నిర్వహించి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకొంటారు. తొలి పోలింగ్‌లో ట్రంప్‌ ఘన విజయంతో.. రిపబ్లికన్‌ పార్టీపై ఆయన ఏ మాత్రం పట్టు కోల్పోలేదని స్పష్టమవుతోంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్‌పై రెండు రాష్ట్రాలు వేటు వేసిన విషయం తెలిసిందే. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో, మైన్‌ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా.. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌ పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి. 2016లో అధ్యక్ష పదవి చేపట్టిన ఆయన.. 2020లో డెమోక్రటిక్‌ నేత జో బైడెన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. తాజా ప్రైమరీ పోరులో మరోసారి ట్రంప్‌ గెలిచి.. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడతారనే అంచనాలు వెలువడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని