Ukraine Crisis: పిట్టల్లా రాలుతోన్న రష్యా జనరళ్లు.. కారణం అదేనా..?

ఉక్రెయిన్‌ సేనలు జరుపుతోన్న ప్రతిదాడుల్లో పదుల సంఖ్యలో రష్యా జనరళ్లు వరుసగా ప్రాణాలు కోల్పోవడం పుతిన్‌ సేనలకు మింగుడు పడడం లేదు.

Published : 06 May 2022 02:06 IST

అమెరికా మీడియాలో కథనాలు

మాస్కో: ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతోన్న రష్యా.. అదే స్థాయిలో తన సొంత బలగాలను కోల్పోతోంది. ఉక్రెయిన్‌ సేనలు జరుపుతోన్న ప్రతిదాడుల్లో పదుల సంఖ్యలో రష్యా జనరళ్లు వరుసగా ప్రాణాలు కోల్పోవడం పుతిన్‌ సేనలకు మింగుడు పడటం లేదు. గతంలో జరిపిన యుద్ధాల్లో ఎన్నడూ ఈ స్థాయిలో జనరళ్లను రష్యా కోల్పోలేదు. ఇంత కచ్చితంగా సైనిక నాయకత్వాన్ని ఉక్రెయిన్‌ సేనలు లక్ష్యంగా చేసుకోవడానికి అమెరికా నిఘా వర్గాలు సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అమెరికా వార్తా పత్రికల్లో కథనాలు వెల్లడయ్యాయి.

ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోన్న వేళ వారు దండయాత్ర చేసే మార్గాలను ముందుగానే గుర్తించడం ఉక్రెయిన్‌ సేనలకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రష్యా బలగాల కదలికలు, తాత్కాలిక స్థావరాలతోపాటు మొబైల్‌ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్‌ సేనలకు అమెరికా నిఘావిభాగం ఎప్పటికప్పుడు అందించినట్లు సమాచారం. అమెరికా ఇచ్చిన సమాచారంతోపాటు తమ సొంత నిఘా వ్యవస్థను ఉపయోగించుకొని రష్యా జనరళ్లపై ఉక్రెయిన్‌ సేనలు ప్రతిదాడులు జరిపాయి. తద్వారా భారీ స్థాయిలో రష్యా సైన్యంతోపాటు వారి జనరళ్లను మట్టుబెట్టడం సాధ్యమయ్యిందని ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా బహిరంగంగా వెల్లడించినప్పటికీ అక్కడి నిఘా విభాగం అధికారులు నుంచి విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొంది.

ఇదిలాఉంటే రష్యా చేస్తోన్న భీకర యుద్ధాన్ని దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ సేనలు భారీ స్థాయిలో రష్యా సైన్యాన్ని మట్టుబెడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు 12 మంది జనరళ్లను చంపేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, అమెరికా నిఘావ్యవస్థ సహకారంతో ఎంతమంది రష్యన్‌ జనరళ్లను చంపారనే విషయంపై అమెరికా, ఉక్రెయిన్‌ అధికారులు స్పందించలేదు. తాము జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటి వరకు 24వేల మంది రష్యన్‌ సైనికులు మరణించగా, వందల సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, వెయ్యికిపైగా యుద్ధట్యాంకులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని