Avdiivka: సైనిక చర్యకు రెండేళ్లు.. ఉక్రెయిన్‌కు ఎదురుదెబ్బ..!

రష్యా సైనిక చర్యకు రెండేళ్లు సమీపిస్తోన్న వేళ.. ఉక్రెయిన్‌లోని అవ్‌దివ్కా నగరం నుంచి జెలెన్‌స్కీ సేనలు వెనక్కి వెళ్లిపోయాయి.

Published : 17 Feb 2024 22:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆయుధాల కొరతతో సతమతమవుతోన్న ఉక్రెయిన్‌ (Ukraine).. యుద్ధక్షేత్రంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రష్యా బలగాలతో నాలుగు నెలలుగా పోరాటం సాగిస్తున్న తూర్పు ఉక్రెయిన్‌లోని కీలక అవ్‌దివ్కా (Avdiivka) నగరం నుంచి కీవ్‌ సేనలు తాజాగా వెనక్కి వచ్చేస్తున్నట్లు ఆ దేశ సైన్యాధిపతి ఒలెక్సాండర్‌ సిర్‌స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. సైనిక చర్యకు దాదాపు రెండేళ్లు కావస్తుండటం.. మరోవైపు మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికల వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

సైనికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని.. పుతిన్‌ సేనలు తమను చుట్టుముట్టడాన్ని నివారించేందుకు ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్రెయిన్‌ ఆర్మీ చీఫ్‌ తెలిపారు. ఈ క్రమంలోనే కొంతమంది సైనికులను మాస్కో అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే నూతన సైన్యాధిపతిగా నియమితులైన సిర్‌స్కీకి ప్రస్తుత పరిస్థితులు సవాల్‌గా మారాయని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. గతంలో క్షేత్రస్థాయి దళాల కమాండర్‌గా బఖ్‌ముత్‌ ప్రాంతంలో సుదీర్ఘ పోరు కొనసాగించినట్లు ఆయనపై విమర్శలు ఉన్నాయి.

‘నావల్నీ మృతికి పుతినే బాధ్యుడు’: బైడెన్‌

ఆయుధ సంపత్తి విషయంలో తమ దేశం ప్రస్తుతం కృత్రిమ లోటును ఎదుర్కొంటోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇది రష్యాకు అనుకూలిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. జర్మనీలో నిర్వహించిన ‘మ్యూనిక్‌ భద్రత సదస్సు’లో పాల్గొని ప్రసంగించారు. సైనికుల జీవితాలను దృష్టిలో ఉంచుకుని.. అవ్‌దివ్కా నుంచి బలగాల ఉపసంహరణ సరైన నిర్ణయమేనని చెప్పారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తమను అడగొద్దని, సైనిక చర్యను పుతిన్‌ ఇంకా ఎలా కొనసాగించగలుగుతున్నారో తమను తాము ప్రశ్నించుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని