Joe Biden: ‘నావల్నీ మృతికి పుతినే బాధ్యుడు’: తీవ్రంగా స్పందించిన బైడెన్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin)కు బద్ధశత్రువుగా పేరున్న విపక్ష అగ్రనేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Updated : 17 Feb 2024 11:12 IST

వాషింగ్టన్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) స్పందించారు. ఆయన మరణం తనను ఆశ్చర్యపర్చలేదు కానీ.. ఆ వార్త విన్న తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని అన్నారు. ‘‘పుతిన్ ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, హింస, అవినీతికి వ్యతిరేకంగా నావల్నీ ధైర్యంగా గళం వినిపించారు. ఆయన మృతికి పుతినే బాధ్యుడు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని వైట్‌హౌస్‌ ప్రతినిధులు తెలిపారు.

ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తరాన ఉన్న రష్యన్ పీనల్‌ కాలనీలో నావల్నీ మృతి చెందారు. రెండు నెలల క్రితమే జైలు అధికారులు ఆయన్ను అక్కడకు తరలించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. నావల్నీ మరణం పుతిన్‌కు వినాశనకరమైన పరిణామాలను కలిగిస్తుందని కొన్నేళ్ల క్రితమే అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. 2021లో జెనీవాలో జరిగిన బైడెన్‌-పుతిన్‌ భేటీ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పుతిన్‌పై ధిక్కారస్వరానికి మారుపేరు నావల్నీ

అటు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా దీనిపై స్పందించారు. ‘‘ఇది తీవ్ర విషాదకర ఘటన. రష్యా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వారిని అణచివేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఎంతకు తెగిస్తారో ఈ ఘటన తెలియజేస్తోంది. పుతిన్‌ అంటే ఏమిటో ప్రపంచానికి ఇది గుర్తుచేస్తుంది’’ అని అన్నారు.

పుతిన్‌ శిక్ష నుంచి తప్పించుకోలేరు: నావల్నీ సతీమణి

నావల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యులియా నావల్నయా అనుమానం వ్యక్తం చేశారు. అవే గనుగ నిజమైతే.. పుతిన్‌, ఆయన అనుచరులు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. ‘పుతిన్, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నమ్మలేం. వారు ఎప్పుడూ అవాస్తవాలే చెప్తారు. కానీ వారు చెప్పింది నిజమైతే నా దేశానికి, నా కుటుంబానికి చేసిన అన్యాయానికి.. పుతిన్‌, ఆయన పరివారం బాధ్యత వహించాలి. ఆ రోజు త్వరలోనే వస్తుంది’ అని ఆమె గద్గద స్వరంతో మాట్లాడారు. ప్రస్తుతం రష్యాలో ఉన్న భయంకరమైన పాలనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని ‘మ్యూనిచ్‌ సెక్యురిటీ కాన్ఫరెన్స్’ వేదికగా పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని