US Navy: బీజింగ్‌ చేతికి ఇండో-పసిఫిక్‌ డేటా.. చైనా గూఢచారికి అమెరికాలో జైలు శిక్ష..

ఇండో-పసిఫిక్‌లో అమెరికా (USA)కు సంబంధించిన కీలక సమాచారం చైనాకు చేరింది. ఈ కేసులో అమెరికా నేవీకి చెందిన ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది.

Updated : 09 Jan 2024 13:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు ఆసియాలో ఉన్న కీలకమైన ఒకినావా (జపాన్‌) సైనిక స్థావరం వివరాలను చైనాకు చేరవేసిన గూఢచారికి జైలు శిక్ష పడింది. కాలిఫోర్నియాలోని నౌకాదళ (US Navy) స్థావరంలో పనిచేసే వెన్‌హెంగ్‌ ఝావో గత ఏడాది అక్టోబర్‌లో చైనాకు కీలక సమాచారం చేరవేశాడు. 2021-2023 వరకు ఏర్పాటు చేసిన కీలక సైనిక వసతుల సమాచారం, ఆపరేషనల్‌ ఆర్డర్లు, సైనిక విన్యాసాల వివరాలను బీజింగ్‌కు అందజేశాడు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా నౌకాదళం చేపట్టిన యుద్ధ విన్యాసాల వివరాలు, జపాన్‌లోని ఒకినావా స్థావరంలో అమర్చిన ముఖ్యమైన రాడార్‌కు సంబంధించిన బ్లూప్రింట్‌, ఎలక్ట్రికల్‌ డయాగ్రామ్‌ వంటివి కూడా వీటిలో ఉన్నాయి.

మాల్దీవుల వివాదం వేళ.. బయటపడిన చైనా వక్రబుద్ధి

వెన్‌హెంగ్‌ ఝావోకు నౌకాదళ స్థావరంలో పనిచేసేలా సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఉంది. అతడు వెంచురా కౌంటీ బేస్‌లో పనిచేశాడు. అక్కడ అనుమతి లేని ప్రదేశాల్లోకి చొరబడి సమాచారం సేకరించినట్లు అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఈ డేటాను చైనాకు పంపేందుకు బలమైన ఎన్‌క్రిప్టెడ్‌ వ్యవస్థను కూడా వాడుకొన్నట్లు తేలింది. ఆ తర్వాత అన్ని ఆధారాలను అతడు నాశనం చేశాడు.

ఇందుకోసం 2021 ఆగస్టు నుంచి 2023 మే వరకు అతడికి చైనా నుంచి 14 విడతలుగా 14,866 డాలర్లు చెల్లించారు. చైనాలో పుట్టిన ఝావో 2009లో అమెరికా వచ్చాడు. 2012లో పౌరసత్వం తీసుకొన్నాడు. ఆ తర్వాత ఐదేళ్లకు నౌకాదళంలో చేరాడు. 2023లో అతడిని గూఢచర్యం ఆరోపణలపై ఆరెస్టు చేశారు. అతడికి కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్‌ కోర్టు తాజాగా 27 నెలల జైలు శిక్ష విధించింది. మరోవైపు ఝావో కేసు విషయం తమకు తెలియదని వాషింగ్టన్‌లోని చైనా దౌత్య కార్యాలయం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని