India-China: మాల్దీవుల వివాదం వేళ.. బయటపడిన చైనా వక్రబుద్ధి

Maldives Row: మాల్దీవుల వివాదం వేళ.. భారత్‌పై మరోసారి చైనా అక్కసు వెళ్లగక్కింది. దిల్లీపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ అక్కడి అధికారిక పత్రిక కథనం ప్రచురించింది.

Updated : 11 Jan 2024 13:45 IST

బీజింగ్‌: భారత ప్రధాని మోదీ (PM Modi), లక్షద్వీప్‌ (Lakshadweep) పరిసరాలపై మాల్దీవుల (Maldives) మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై చైనా (China) స్పందిస్తూ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. మాల్దీవులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్‌... భారత్‌ (India) మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలంటూ నోరు పారేసుకుంది.

ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సంపాదకీయాన్ని ప్రచురించింది. ‘‘మాల్దీవులను మేం ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తాం. దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భారత్‌, చైనా మధ్య ఘర్షణల కారణంగా దిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ చెప్పలేదు. ఈ ద్వీప దేశానికి భారత్‌ నుంచి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో దిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి. దానికి చైనాను నిందించడం మాని.. భారత్‌ మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి’’ అని కథనంలో డ్రాగన్‌ తన అక్కసు వెళ్లగక్కింది.

మరింత దిద్దుబాటలో మాల్దీవులు

కాగా.. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్న వేళ.. ఈ కథనం రావడం గమనార్హం. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు ఆయన తన సతీమణితో కలిసి బీజింగ్‌ చేరుకున్నారు. ఆయనకు డ్రాగన్‌ అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తన మొదటి విదేశీ పర్యటన చైనాలోనే చేపట్టారు.

గతేడాది సెప్టెంబరులో ముయిజ్జు మాల్దీవుల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వచ్చీ రాగానే తమ భూభాగంలో ఉన్న భారత బలగాలను తొలగించేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల మోదీపై, లక్షద్వీప్‌పై మాల్దీవులు మంత్రులు విద్వేష వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. దీన్ని దిల్లీ తీవ్రంగా పరిగణించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు