Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్‌

India-Canada row: ఉగ్రవాదంపై కెనడా ఉదాసీన వైఖరే ప్రస్తుత దౌత్య వివాదానికి కారణమైందని అన్నారు భారత విదేశాంగమంత్రి జైశంకర్‌. నిజ్జర్ హత్య కేసులో ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే చూపించాలని కెనడాను నిలదీశారు.

Published : 30 Sep 2023 10:55 IST

వాషింగ్టన్‌: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ (EAM Jaishankar) మరోసారి గట్టిగా బదులిచ్చారు. ఆ ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలుంటే చూపించాలన్నారు. ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరే ఇక్కడ ప్రధాన సమస్య అని, దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (India-Canada row)

ఐరాస సర్వసభ్య సమావేశాల నిమిత్తం అమెరికా వెళ్లిన జైశంకర్‌.. తాజాగా వాషింగ్టన్‌లో భారత విలేకరులతో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌ - కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలపై ఆయన స్పందించారు. ‘‘నిజ్జర్ (Nijjar) హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు సంబంధించి కెనడా వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉంటే దాన్ని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు. కానీ, కెనడా ఆ వివరాలు ఇవ్వాలి కదా..!’’ అని జైశంకర్‌ అన్నారు. ఈ అంశంపై ఇరు దేశాలు ప్రభుత్వాలు చర్చలు జరిపి.. విభేదాలను పరిష్కరించుకోవాల్సి అవసరం ఉందన్నారు.

బ్లింకెన్‌తో చర్చల్లో నిజ్జర్‌ అంశం ప్రస్తావనకు వచ్చింది

వారి ఉదాసీన వైఖరే..

‘‘కెనడా ప్రభుత్వంతో భారత్‌ చాలాకాలంగా సమస్యలు ఎదుర్కొంటోంది. అతివాదం, ఉగ్రవాదంపై వారి ఉదాసీన వైఖరే ఇక్కడ ప్రధాన సమస్య. రాజకీయంగా ఉన్న ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో కెనడా అలా వ్యవహరించాల్సి వస్తోంది. భారత్‌లో నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు ఆ దేశంలో ఉన్నారు. వారిని అప్పగించాలని ఎన్నోసార్లు అభ్యర్థించినా కెనడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో భారత వ్యతిరేక శక్తులు.. కెనడాలో తమ కార్యకలాపాలకు కొనసాగిస్తున్నాయనేది రహస్యమేమీ కాదు’’ అని జైశంకర్‌ మండిపడ్డారు.

వాక్‌ స్వేచ్ఛపై మాకు హితబోధలు అక్కర్లేదు..

‘‘కెనడాలో మా దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. దీన్ని సాధారణ పరిస్థితిగా పరిగణించాలా? మరో దేశానికి ఇలాంటి పరిస్థితే ఎదురైతే.. వారు ఎలా స్పందిస్తారు? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో దౌత్యవవేత్తలపై బెదిరింపులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాక్‌ స్వాతంత్ర్యం గురించి మాకు ఇతరులు నేర్పించాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ పేరుతో హింస జరగడం అంటే.. దాన్ని దుర్వినియోగం చేసినట్లే’’ అని జైశంకర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని