Mystery: చిన్నారుల్లో ‘అంతుచిక్కని’ కాలేయ వ్యాధి..!

కరోనా వైరస్‌ విజృంభణతో గత రెండేళ్లుగా సతమతమవుతోన్న ప్రపంచ దేశాలను ఇప్పుడు ఓ అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది.

Updated : 25 Apr 2022 21:32 IST

మూలాలు శోధిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

బెర్లిన్‌: కరోనా వైరస్‌ విజృంభణతో గత రెండేళ్లుగా సతమతమవుతోన్న ప్రపంచ దేశాలను ఇప్పుడు ఓ అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. ఐరోపా, అమెరికాలో చిన్నారుల్లో వెలుగు చూస్తోన్న కాలేయ వ్యాధి క్రమంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మిస్టరీ కాలేయ వ్యాధితో ఇప్పటికే ఓ చిన్నారి మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరించింది. అయితే, ఇప్పటివరకు ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు తెలియని నేపథ్యంలో వాటి మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ శోధన చేపట్టింది.

ఒకరు మరణం..

‘ఐరోపా, అమెరికాకు చెందిన 12 దేశాల్లోని చిన్నారుల్లో ‘మూలాలు తెలియని కామెర్ల జబ్బు’ వెలుగులోకి వచ్చింది. వీటికి సంబంధించి ఇప్పటివరకు 169 కేసులు నమోదయ్యాయి. ఒక నెల వయసు నుంచి 16ఏళ్ల లోపు పిల్లల్లోనే వీటని గుర్తించాం. ఇప్పటివరకు అనారోగ్యం పాలైన మొత్తం బాధిత చిన్నారుల్లో 17 మందికి కాలేయ మార్పిడి అవసరమైంది. వీరిలో ఇటీవలే ఒకరు మరణించారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే, ఆ మరణం ఏ దేశంలో చోటుచేసుకుందనే విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించలేదు.

యూకేలో తొలికేసు..

ఈ మిస్టరీ కాలేయ వ్యాధి కేసును ఏప్రిల్‌ మొదటి వారంలో తొలుత బ్రిటన్‌లో గుర్తించారు. ఇప్పటివరకు అక్కడ 114 మంది చిన్నారులు అనారోగ్యం బారినపడ్డారు. ఈనేపథ్యంలో ‘ఈ హెపటైటిస్‌ కేసులు పెరగడం, ఊహించిన స్థాయికంటే ఎక్కువ కేసులు నమోదుపై స్పష్టత లేదు. అయినప్పటికీ అవి గుర్తించకుండాపోయే అవకాశం కూడా ఉంటుంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మరోవైపు ఈ తరహా కేసులు డెన్మార్క్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్‌తోపాటు స్పెయిన్‌లోనూ నమోదైనట్లు యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవలే వెల్లడించింది. అమెరికాలోని అలబామాలోనూ ఒకటి నుంచి ఆరేళ్ల వయసు చిన్నారుల్లో ఇటువంటి తీవ్ర కాలేయ కేసులు తొమ్మిది గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యాధిని గుర్తించిన పిల్లల్లో జ్వరం మాత్రం కనిపించలేదు. కొందరిలో ఆస్పత్రి చేరికలు అవసరం అవుతుండగా.. మరికొందరికి ఏకంగా కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.

నిపుణులు ఏమంటున్నారు..?

ఈ మిస్టరీ కేసులకు సంబంధించిన సమాచారంపై నిపుణులు ఇప్పటికే అధ్యయనం చేపట్టారు. అయితే, సాధారణ జలుబుకు కారణమైన వైరస్‌ ఇందుకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ అసలు కారణాలేంటనే విషయంపై పరిశోధన కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అడినోవైరస్‌ కారణమని భావిస్తున్నప్పటికీ కచ్చితమైన మూలం కోసం దర్యాప్తు కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తం నమోదైన కేసుల్లో 74 వాటిల్లో అడినోవైరస్‌ గుర్తించగా.. మరో 20 మంది చిన్నారులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొంది. ఈ క్రమంలో చిన్నారుల్లో హెపటైటిస్‌ పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలని ఆయా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తూ అప్రమత్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని