Zelenskyy: యుద్ధం ‘ముగింపు’ మొదలైంది.. ఖేర్సన్‌లో జెలెన్‌స్కీ

ఖేర్సన్‌ నుంచి రష్యా దళాల ఉపసంహరణ.. తమపై మాస్కో సాగిస్తోన్న యుద్ధం ముగింపునకు ఆరంభం లాంటిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.

Published : 15 Nov 2022 01:41 IST

ఖేర్సన్‌: రష్యా సైనికుల నుంచి విముక్తి పొందిన ఖేర్సన్‌ నగరంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ దళాల ధైర్యసాహసాలను కొనియాడారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధం ముగింపునకు ఇదే ఆరంభమని అన్నారు.

ఖేర్సన్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల రష్యా సైన్యం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఖేర్సన్‌కు విముక్తి లభించింది. తొమ్మిది నెలల పాటు సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు లభించిన విజయాల్లో ఇదే కీలకం. ఈ సందర్భంగా నేడు ఈ నగరంలో పర్యటించిన జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్‌ సేనలను ప్రశంసించారు. ‘‘రష్యా దాడుల్లో ఖేర్సన్‌లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో క్లిష్ట సవాళ్లు ఎదురైనప్పటికీ.. మన బలమైన సైన్యం ఈ ప్రాంతానికి శత్రువుల నుంచి తిరిగి దక్కించుకోగలిగింది’’ అని అన్నారు. క్రెమ్లిన్‌ దళాల నుంచి ఉక్రెయిన్‌ ఆర్మీ ఇప్పటివరకు మూడు అతిపెద్ద ప్రాంతాలను తిరిగి దక్కించుకోగలిగింది. ఉత్తర కీవ్‌తో, ఈశాన్య ఖర్కీవ్‌, ఖేర్సన్‌ ప్రాంతాలు ఇప్పుడు తిరిగి కీవ్‌ సేనల అధీనంలోకి వచ్చాయి.

ఇదిలా ఉండగా.. ఖేర్సన్‌లో జెలెన్‌స్కీ పర్యటనపై స్పందించేందుకు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ నిరాకరించారు. అయితే, ఆ నగరం రష్యా సమాఖ్యలోని భూభాగమే అని చెప్పడం గమనార్హం. మరోవైపు, ఖేర్సన్‌ నుంచి దళాల ఉపసంహరణ వెనుక రష్యా భారీ వ్యూహం ఉండొచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని