close

ప్రధానాంశాలు

అంతిమ లక్ష్యం.. అమరావతి

అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలి
మందడం, వెలగపూడి, తుళ్లూరులో దీక్షలు
సీఆర్‌డీఏ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అభ్యంతరాలు
ఈనాడు - అమరావతి

వంటా వార్పులు.. ప్లకార్డుల ప్రదర్శనలు.. ఉద్యమ నినాదాలు .. వీటన్నింటికీ వెన్నుదన్నుగా నిలుస్తున్న పరిసర ప్రాంతాల ప్రజలు.. ఇలా నెల రోజులు దాటినా రాజధాని అమరావతి ఉద్యమ ఉద్ధృతి నానాటికీ పెరుగుతోంది. హైదరాబాద్‌, విశాఖపట్నం లాంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా పలువురు వచ్చి రైతుల దీక్షలకు మద్దతు ప్రకటించారు.

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, రైతుకూలీల ఉద్యమం పట్టుదలతో కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయం మారేవరకు ఆందోళనలను విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. తుళ్లూరు మహాధర్నా శిబిరంలో 31వ రోజు మహిళలు, యువత, రైతులు, కూలీలు పెద్దఎత్తున పాల్గొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై హైపవర్‌ కమిటీకి అభ్యంతరాలు తెలియజేయడానికి లేఖలు సిద్ధం చేశారు. ఐకాస అసైన్డు రైతులకు, రైతులకు వేర్వేరుగా లేఖలు సిద్ధంచేసి అందరికీ పంపిణీ చేసింది. మహిళలతో కలిసి ర్యాలీగా వెళ్లి వాటిని సీఆర్‌డీఏ కార్యాలయంలోని అధికారులకు అందజేశారు. అనంతవరంలో గ్రామదేవత పోలేరమ్మకు పొంగళ్లు పెట్టారు. అనంతవరం నుంచి తుళ్లూరు మహాధర్నా శిబిరం వరకు పాదయాత్రగా వచ్చారు. ‘మనమంతా ఒక్కటే.. మన రాజధాని ఒకటే.. అమరావతి’ అనే నినాదాలు రాసిన టీ షర్టులు ధరించి పలువురు ధర్నాలో పాల్గొన్నారు. ‘ఆంధ్రుడా మేలుకో.. అమరావతిని కాపాడుకో’ అని యువతులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘మా నమ్మకాన్ని నిలబెట్టిన న్యాయవ్యవస్థకు కన్నీటి అభిషేకం’ అని ప్లకార్డులను మహిళలు ప్రదర్శించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో వంటావార్పు చేసి నిరసనదీక్ష కొనసాగించారు. మంగళగిరి మండలం నవులూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో నిరసన దీక్షలు జరిగాయి. ఈ దీక్షకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సంఘీభావం తెలిపారు. అమరావతి కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరినీ తీసుకుని దిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిసి అమరావతి గళం వినిపించాలని హైకోర్టు న్యాయవాదులు తుళ్లూరు మహాధర్నాలో పిలుపునిచ్చారు. ప్రభుత్వకుట్రలపై 13 జిల్లాల్లోని మేజిస్ట్రేట్‌ కోర్టుల్లో కేసులు వేసే యోచనలో ఉన్నామని తెలిపారు.

వెలగపూడి నుంచి కొవ్వొత్తుల ర్యాలీ
వెలగపూడి దీక్షా శిబిరంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ‘రాజధాని సంక్షోభం.. ఒక పరిశీలన.. ఒకే పరిష్కారం’ పుస్తకాన్ని పంపిణీ చేశారు. రాత్రి వెలగపూడి దీక్షా శిబిరం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభమై మల్కాపురం, మందడం, ఉద్దండరాయునిపాలెం మీదుగా ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతం వరకు కొనసాగింది.

వివిధ ప్రాంతాల వాసుల మద్దతు
మందడంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ముమ్మరమయ్యాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం తదితర ప్రాంతాలవారు వచ్చి రైతుల దీక్షకు మద్దతు పలికారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామస్థులు రూ. లక్ష విలువైన సరకులను అందజేశారు. గుంటూరు జిల్లాకు చెందిన సినీ దర్శకుడు రామ్‌ప్రసాద్‌ మందడం వచ్చి రైతులకు మద్దతు ప్రకటించారు. మిగిలిన వారూ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నానన్నారు. మహిళలపై లాఠీఛార్జి, అరెస్టులు, దురుసు ప్రవర్తనను కళ్లకు కట్టినట్లు చూపించే పలు చిత్రాలను మందడం శిబిరంలో ప్రదర్శించారు.


 

19న దుర్గమ్మకు ముడుపులు
రాజధాని గ్రామస్థులు 19న కనకదుర్గమ్మకు ముడుపులు చెల్లించే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఉద్దండరాయునిపాలెంలో పూజలు చేసి విజయవాడ వెళ్లనున్నారు. గతంలోలా భారీగా కాకుండా పరిమిత సంఖ్యలోనే వెళ్లాలని భావిస్తున్నారు. దీనికి పోలీసుల అనుమతి కోసం ఐకాస నేతలు ప్రయత్నిస్తున్నారు. నేరుగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కలిసి మాట్లాడేందుకు సమయం కోరారు.


తెనాలిలో మహిళల మహా పాదయాత్ర

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌చేస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో మహిళా ఐకాస ఆధ్వర్యంలో శుక్రవారం భారీఎత్తున పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రతినిధులు మాట్లాడారు. మహిళలు, రైతులంటే రాష్ట్ర ప్రభుత్వానికి, వైకాపా నాయకులకు కనీస గౌరవం లేదని, సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక పోస్టింగులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు వైఎస్‌ విజయమ్మకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆలపాటి మాధవి, సుంకర పద్మశ్రీ, రాయపాటి శైలజ, మానం విజేత, అన్నాబత్తుని జయలక్ష్మి, రావి అపర్ణ, కావేటి సామ్రాజ్యమ్మ, జెట్టి రేణుక, గౌసియాబేగం, రమాదేవి, రమ్య, కృష్ణవేణి, ఉదయశ్రీ, సరళ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


గుండెపోటుతో వృద్ధురాలి మృతి

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి తరలిపోతుందని, అసైన్డ్‌ భూమికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో కారణంగా భూమిని అమ్ముకోలేకపోయాననే బాధతో.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడుకు చెందిన ఇందుర్తి సుబ్బమ్మ(75)శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. సుబ్బమ్మ రాజధాని నిర్మాణానికి తనకున్న అర ఎకరం అసైన్డ్‌ భూమిని ఇచ్చారు. అసైన్డ్‌ భూమి విక్రయంపై రాష్ట్రప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసింది. దీంతో భూమిని అమ్ముకోలేకపోయారు. ఆ దిగులుతో సుబ్బమ్మ అనారోగ్యానికి గురై గుండెపోటుతో చనిపోయినట్లు ఆమె బంధువులు తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.