Hyderabad vs Bengaluru: హైదరాబాద్‌ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం

ఐపీఎల్‌ 2024లో బెంగళూరు వరుస ఆరు ఓటముల తర్వాత రెండో విజయం సాధించింది. హైదరాబాద్‌ను 35 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడించింది. 

Updated : 25 Apr 2024 23:46 IST

హైదరాబాద్‌: ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు రెండో విజయం సాధించింది. హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆజట్టు 35 పరుగుల తేడాతో నెగ్గింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో షాబాజ్‌ అహ్మద్‌ (40*) టాప్‌ స్కోరర్‌. లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్‌కు బెంగళూరు బౌలర్లు వరుస షాక్‌లు ఇచ్చారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్ (3) విల్ జాక్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (31; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. జోరు మీదున్న అతడిని యశ్ దయాల్ వెనక్కి పంపాడు. కాసేపటికే స్వప్నిల్ బౌలింగ్‌లో మార్‌క్రమ్ (7) వికెట్ల ముందు దొరికిపోగా.. హెన్రిచ్ క్లాసెన్ (7) గ్రీన్‌కు చిక్కాడు. నితీశ్ రెడ్డి (13), అబ్దుల్‌ సమద్‌ (10)లను కర్ణ్‌ శర్మ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. దూకుడుగా ఆడిన కమిన్స్ (31; 15 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)ను గ్రీన్ ఔట్ చేశాడు. భువనేశ్వర్‌ కుమార్‌ (13) మూడు ఫోర్లు బాది పెవిలియన్ చేరాడు.  షాబాజ్ క్రీజులో ఉన్నా దూకుడుగా ఆడలేకపోవడంతో హైదరాబాద్‌ ఓటమి చాలాముందే ఖరారైపోయింది. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, గ్రీన్‌, కర్ణ్‌ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. విల్‌ జాక్స్‌, యశ్‌ దయాల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (51; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం బాదాడు. డుప్లెసిస్ (24; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. రజత్ పటిదార్ (50; 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మార్కండే బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదేశాడు.  కామెరూన్ గ్రీన్ (37*; 19 బంతుల్లో 5 ఫోర్లు) ధాటిగా ఆడటంతో బెంగళూరు స్కోరు 200 దాటింది. హైదరాబాద్‌ బౌలర్లలో ఉనద్కత్ 3, నటరాజన్ 2, కమిన్స్, మయాంక్ మార్కండే తలో వికెట్ పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని