ఒక్కో మరణానికి రూ.కోటి పరిహారం..
close

ప్రధానాంశాలు

ఒక్కో మరణానికి రూ.కోటి పరిహారం..

పరీక్షలే కాదు.. ఆరోగ్యం, భద్రత ముఖ్యం
మీ ఏర్పాట్లతో సంతృప్తి చెందకపోతే.. పరీక్షలకు మేం అనుమతించబోం
పరీక్షల మధ్యలో కొవిడ్‌ విజృంభిస్తే ఏం చర్యలు తీసుకుంటారు..?
విద్యార్థులను ఊగిసలాటలో పెట్టొద్దు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ఈనాడు, దిల్లీ: ‘పరీక్షలు నిర్వహించాలనే పట్టుదల చూపుతున్నారు తప్ప అందుకు తగిన ప్రణాళిక కనిపించడం లేదు. పరీక్షలే కాదు.. అందరి ప్రాణాలు, ఆరోగ్యం, భద్రత కూడా ముఖ్యం. 360 డిగ్రీల కోణంలో ఆలోచించండి. విద్యార్థులను ఊగిసలాటలో పెట్టొద్దు. మీ ఏర్పాట్లతో మేం సంతృప్తి చెందకపోతే పరీక్షలకు అనుమతించబోము’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షలతో ఒక్కరు చనిపోయినా అందుకు మీరు బాధ్యత వహించాలని, ప్రతి కొవిడ్‌ మరణానికీ రూ.కోటి వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణ గురించి రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ‘మీ అఫిడవిట్లో ఏ ఒక్క అంశంపైనా నిర్దిష్ట సమాచారం లేదు. కొద్ది రోజులుగా విచారణలో చెబుతున్న విషయాలనే మళ్లీ అఫిడవిట్‌లో పొందుపర్చారు. పరీక్షలు పెట్టాలనే పట్టుదల మినహా అందుకు తగిన ప్రణాళిక కనిపించడం లేదు’ అని జస్టిస్‌ ఖన్విల్కర్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రతి పరీక్ష గదిలో (25్ఠ 25 కొలత) 15-18 మంది విద్యార్థులు మించకుండా చూస్తామంటున్నారు. 15 మంది చొప్పున చూస్తే 34,634 గదులు, 18 మంది చొప్పున చూస్తే 28,862 గదులు అవసరమవుతాయి. అన్ని గదులు అందుబాటులో ఉన్నాయా?’ అని జస్టిస్‌ ఖన్విల్కర్‌ ప్రశ్నించారు.

అఫిడవిట్‌లో ఆ వివరాలెక్కడ?

రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుందని, విద్యాసంస్థలతో పాటు అవసరమైతే ఇతర ప్రభుత్వ కార్యాలయాలనూ వినియోగించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ తెలిపారు. ‘వెలుతురు, గాలి, ఇతర మౌలిక వసతులు కల్పిస్తూ అన్ని గదులను మీరు ఏర్పాటు చేయగలరా..? విద్యార్థులే కాకుండా ఇన్విజిలేటర్లు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది అవసరమవుతారు. ఈ వివరాలు మీ అఫిడవిట్‌లో ఎక్కడ ఉన్నాయి?’ అని జస్టిస్‌ ఖన్విల్కర్‌ ప్రశ్నించారు. తాము అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని నజ్కీ బదులిచ్చారు. ఈ సమయంలో జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి జోక్యం చేసుకున్నారు. ‘మీరు పరీక్షలంటే అయిదు లక్షల మంది విద్యార్థులని చెబుతున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, 34వేల మందికి పైగా ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఆరోగ్యభద్రత ముడిపడి ఉంది. పరీక్షలతోనే పని అయిపోదు. పరీక్ష పేపర్లను కేంద్రాలకు తరలించడం, వాటి మూల్యాంకనం, ఇతర ప్రక్రియలు ఉన్నాయి. ఆ వివరాలు అఫిడవిట్‌లో లేవు. జులై ఆఖరి వారంలో పరీక్షలు పెడతామంటున్నారు. 15 రోజులు సమయం ఇస్తామంటున్నారు. దానికి సరైన ప్రణాళిక లేదు. పరీక్షలు జులై నెలాఖరులో పెడితే ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు? ఫలితాలు ఆలస్యమైతే మీ కోసం ఇతరులు ప్రవేశాలు నిలిపివేయరు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తే మీ విద్యార్థులు నష్టపోతారు’ అని జస్టిస్‌ ఖన్విల్కర్‌ అన్నారు. ఇతర రాష్ట్రాల బోర్డులు పరీక్షలు రద్దు చేసినప్పుడు మీరు ఎందుకు పరీక్షలు రద్దు చేయరని ఆయన ప్రశ్నించారు.

గ్రేడ్లను మార్కులుగా మార్చే అవకాశం

పదోతరగతిలో గ్రేడింగ్‌ విధానం వలన ప్రస్తుతం మార్కులు ఇవ్వలేమని, అందుకే అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని నజ్కీ చెప్పగా.. జస్టిస్‌ ఖన్విల్కర్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ విషయంలో యూజీసీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, మీ బోర్డులోని నిపుణుల సలహా తీసుకోండి. గ్రేడ్లను మార్కులుగా ఎలా మార్చవచ్చో వారి అభిప్రాయాలు స్వీకరించండి’ అని సూచించారు. ‘ఏదో ఓ మార్కుల కొలబద్దగా గ్రేడ్లు రూపొందిస్తారు. వాటిని మళ్లీ మార్కులుగా మార్చే అవకాశం ఉంటుంది. నిపుణుల సలహా తీసుకోండి’ అని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి సూచించారు. తనకు రెండు రోజుల సమయం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం వెల్లడిస్తానని నజ్కీ ధర్మాసనానికి విన్నవించారు. ప్రతి రోజూ విలువైనదని, విద్యార్థులను మీరు ఊగిసలాటలో పెట్టకూడదంటూ ఇప్పుడే మీ నిర్ణయం తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. తనకు కొంత సమయం కావాలని నజ్కీ ధర్మాసనాన్ని అభ్యర్ధించారు. ‘ఇక్కడ మేము మార్గదర్శకత్వం వహించడానికి లేము. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యం, భద్రతపై మీరు దృష్టిపెట్టాలి. మీరు వివేచనతో నిర్ణయం తీసుకుంటే అందుకు సంబంధించిన నివేదిక ఏది? ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? దాని నేపథ్యం ఏమిటి? ఇది పరీక్షలకు సంబంధించినదే కాదు అందరి ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ప్రశ్న’ అని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి అన్నారు.


మధ్యలో మూడోదశ వస్తే ఏం చేస్తారు?

‘కొవిడ్‌ మూడోదశతో పాటు డెల్టా.. ఇతర వేరియంట్లు వస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. మీరు పరీక్షలు ప్రారంభించిన తర్వాత మధ్యలో కొవిడ్‌ మూడో దశ విజృంభిస్తే అప్పుడేం చేస్తారు? దానికి సంబంధించిన ప్రణాళికను మాకు సమర్పించండి. మేం అడిగిన ప్రతి అంశానికి సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్‌ సమర్పించాలి’ అని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ఆదేశించారు. ‘మీరు ఇంతకు ముందే ప్రతి అంశంపై నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమయంలో వివరణలు ఇవ్వద్దు. పరీక్షలు పెట్టడానికి కారణాలను తెలిపే ఫైలును స్థూలంగా కోర్టుకు సమర్పించాలి’ అని జస్టిస్‌ ఖన్విల్కర్‌ ఆదేశించారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ను వెంటనే సమర్పించాలని ఆదేశిస్తూ కేసు విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని