close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘కట్టె’కు పచ్చికట్టే దిక్కు!

 దహనాలకు లభించని ఎండు కలప
 అధికంగా వాడుతున్న కిరోసిన్‌, పెట్రోలు, డీజిల్‌
 కొవిడ్‌ మృతుల అంత్యక్రియలూ భారమే

ఈనాడు డిజిటల్‌-అమరావతి: కరోనా సృష్టిస్తున్న విలయం అంతాఇంతా కాదు. చివరికి చనిపోయిన తర్వాత మృతదేహాల్ని దహనం చేసేందుకు అవసరమైన కట్టెలకూ కొరత వచ్చింది. చాలాచోట్ల ఎండు కట్టెలు అందుబాటులో లేక పచ్చి వాటినే వినియోగిస్తున్నారు. దీంతో అవి కాలేందుకు కిరోసిన్‌, పెట్రోల్‌, డీజిల్‌ వంటివి అధిక పరిమాణంలో వాడుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రధాన నగరాల్లోని పలు శ్మశానాల్లో ఇలాంటి దుస్థితి ఉంది. సమీప ప్రాంతాల నుంచి వచ్చి నగరాల్లోని ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స పొందుతూ మరణిస్తే వారి మృతదేహాల్ని స్థానిక శ్మశానవాటికలకు తరలిస్తున్నారు. దీంతో అక్కడ గతంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో దహనాలు జరుగుతున్నాయి. ఆ స్థాయిలో కట్టెల సరఫరా లేకపోవటంతో కొరత ఏర్పడుతోంది. సాధారణ రోజుల్లో ఎప్పుడూ ఎండు కట్టెలు నిల్వ ఉండేవని... ఇప్పుడు కట్టెల లోడు ఇలా తెప్పిస్తే.... అలా ఖాళీ అయిపోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో కట్టెల ధర పెరిగి.. ఆ మేరకు అంత్యక్రియల ఖర్చులూ పెరిగిపోతున్నాయి.
నాలుగు రెట్లు పెరిగిన కట్టెల వినియోగం
ఒక్కో మృతదేహాన్ని దహనం చేసేందుకు సగటున 200-300 కిలోల ఎండు కట్టెలు అవసరం. పచ్చివైతే 300-400 కిలోల వరకూ అవసరమవుతాయి. విశాఖపట్నం జ్ఞానాపురం సమీపంలోని ఓ శ్మశానవాటికలో గతంలో రోజుకు సగటున 10 మృతదేహాలను దహనం చేస్తుంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 40కి చేరింది. దీంతో ఉదయం ఆరు టన్నుల కట్టెలు తెప్పించి ఉంచితే మధ్యాహ్నానికే ఖాళీ అయిపోతున్నాయని శ్మశాన వాటిక నిర్వాహకులు తెలిపారు. ‘గతంలో టన్ను కట్టెలు రూ.రెండున్నర వేలకు వచ్చేవి. ప్రస్తుతం ఎండు కట్టె లభించట్లేదు. పచ్చి కట్టెకే టన్నుకు రూ.5 వేల వరకూ కొనుగోలు చేయాల్సి వస్తోంది’’ అని విజయవాడ గుణదలలోని ఈఎస్‌ఐ శ్మశాన వాటిక నిర్వాహకుడు దత్తూ చెప్పారు. విశాఖలో కొన్ని చోట్ల ఎలక్ట్రిక్‌ పద్ధతిలో అంత్యక్రియలు జరుపుతున్నా ఆ సదుపాయం లేనిచోట మాత్రం కట్టెలతోనే దహనం చేయాల్సి వస్తోంది.
ప్యాకేజీలతో...
కొవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాల్ని ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో తరలించటం మొదలుకుని శ్మశానంలో దించటం, అంత్యక్రియలు నిర్వహించటం వరకూ కొంతమంది దళారీలు ఏకంగా ప్యాకేజీలు పెట్టేస్తున్నారు. అంత మొత్తం చెల్లించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారని మృతుల బంధువుల ఆరోపిస్తున్నారు. అసలే ఆపత్కాలంలో ఉన్నవారు అంతంత మొత్తం వెచ్చించలేక ఇబ్బంది పడుతున్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు