close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కురులకు పోషకాల రక్షణ

జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండేందుకు మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో చూసుకోండి.

పెరుగుతో పెరిగేలా: జుట్టు ఒత్తుగా పెరగాలనుకుంటున్నారా... మీరు తీసుకునే ఆహారంలో పెరుగు మోతాదును పెంచి చూడండి. దీన్నుంచి మాంసకృత్తులే కాదు, ఇతర పోషకాలూ అందుతాయి. కుదుళ్లకు రక్తప్రసరణ సజావుగా అందుతుంది. ఫలితంగా శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. దీంతోపాటు గుడ్లూ తీసుకోవాలి. వీటినుంచి అందే మాంసకృత్తులు, ఇనుము, బి విటమిన్లు ముఖ్యంగా బయోటిన్‌ జుట్టు బలహీనం కాకుండా చేస్తాయి.

చిట్లకుండా చేసే పాలకూర: అన్నిరకాల ఆకుకూరల్లానే పాలకూరలోనూ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూరలో ఎ, సి విటమిన్లు, ఇనుము, బీటాకెరొటిన్‌, ఫోలేట్‌, మాంసకృత్తులు ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు, పొడిబారకుండా చేసేందుకు ఈ పోషకాలు తోడ్పడతాయి. కురులు తేమగా ఉంటే... చిట్లే సమస్య చాలామటుకూ అదుపులో ఉన్నట్లే.

జామతో తెగకుండా: ఇందులో విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకం జుట్టు తెగకుండా చేస్తుంది. కప్పు జామకాయ ముక్కల నుంచి 300 మిల్లీగ్రాములకు పైగా విటమిన్‌ సి అందుతుంది. అవకాశం ఉన్నప్పుడల్లా ఈ పండును తినేందుకు ప్రయత్నించాలి.

`

ఇనుముతో రాలదు: మన శరీరానికి ఇనుము ఎంత తక్కువగా అందితే... జుట్టు రాలే సమస్య అంత పెరుగుతుందని చాలామంది గుర్తించరు. జుట్టు రాలుతోంటే... ముందు ఇనుములోపం ఉందేమో తెలుసుకునేందుకు దానికి సంబంధించిన పరీక్ష చేయించుకోండి. ఆ తరువాత ఇనుము అందించే ఖర్జూరాలు, ఆకుకూరలు, నట్స్‌, తృణధాన్యాలు, ఓట్స్‌ వంటివి తీసుకోవాలి. అవసరం అనుకుంటే వైద్యుల సలహాతో ఐరన్‌ సప్లిమెంట్లనూ ఎంచుకోవాలి.

నిర్జీవాన్ని తగ్గించే చిలగడదుంప: పొడిబారడం వల్ల జుట్టు నిర్జీవంగా, ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. అలాంటి జుట్టును మళ్లీ మెరిపించాలనుకుంటున్నారా... చిలగడదుంపలు ఎంచుకోవడమే సరైన పరిష్కారం. వీటిల్లో బీటా కెరొటిన్‌ ఉంటుంది. అది శరీరంలోకి వెళ్లేసరికి విటమిన్‌ ఎ గా మారుతుంది. ఆ పోషకం సెబమ్‌ను విడుదల చేసి.. జుట్టు పొడిబారకుండా, జీవం కోల్పోయినట్లు కనిపించకుండా చేస్తుంది. దీంతోపాటు క్యారెట్‌, గుమ్మడి, తర్బూజా, నిమ్మజాతి పండ్లనూ తీసుకోవచ్ఛు.

రక్తప్రసరణకు దాల్చినచెక్క: ఈ పొడిని అన్నిరకాల పదార్థాల్లో చాలా కొద్దిగా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది రక్తప్రసరణను పెంచుతుంది. మీరు తీసుకునే పోషకాలు, ప్రాణవాయువు జుట్టు కుదుళ్లకు సక్రమంగా అంది, ఆరోగ్యంగా పెరుగుతుంది.

 


మరిన్ని