బెంగళూరు గెలిచిందోచ్‌..

విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ అంటే ఫేవరెట్‌ ఎవరో చెప్పాల్సిన పని లేదు.

Updated : 26 Apr 2024 06:54 IST

ఆరు ఓటముల తర్వాత ఓ విజయం
సన్‌రైజర్స్‌కు సొంతగడ్డపై షాక్‌

విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ అంటే ఫేవరెట్‌ ఎవరో చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్‌ మొదట బ్యాటింగ్‌ చేస్తే 300 స్కోరు చేసేస్తుందేమో.. రెండోసారి ఆడితే 250 లక్ష్యం కూడా సురక్షితం కాదేమో అన్న అంచనాలు! కానీ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌కు 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా 35 పరుగుల తేడాతో నెగ్గి ఆశ్చర్యపరిచింది. బ్యాటర్ల పోరాటం.. బౌలర్ల క్రమశిక్షణ ఆ జట్టుకు ఆరు పరాజయాల తర్వాత ఓ విజయాన్నందించింది. రికార్డు స్కోర్లు, వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్‌ జోరుకు సొంతగడ్డపై బ్రేకులు పడ్డాయి. బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు సీజన్‌లో మూడో ఓటమిని మూటగట్టుకుంది.

ఈనాడు - హైదరాబాద్‌

సన్‌రైజర్స్‌ దూకుడుకు సొంతగడ్డపై అడ్డుకట్ట పడింది. 287 పరుగులతో సన్‌రైజర్స్‌కు ఐపీఎల్‌ రికార్డు స్కోరును సమర్పించుకున్న బెంగళూరు.. బదులు తీర్చుకుంది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు సాధించింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (51; 43 బంతుల్లో 4×4, 1×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రజత్‌ పటీదార్‌ (50; 20 బంతుల్లో 2×4, 5×6) మెరుపులు తోడవడంతో భారీ స్కోరు నమోదైంది. అనంతరం బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సన్‌రైజర్స్‌ ఛేదనలో తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులకే పరిమితమైంది.

పవర్‌ప్లేలోనే తేలిపోయింది: 207.. సన్‌రైజర్స్‌ గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఏమంత పెద్ద లక్ష్యం కాదు. కానీ పిచ్‌ సహకరించనప్పుడు.. పరిస్థితులు అనుకూలించనప్పుడు ఓ మోస్తరు లక్ష్యమైనా కష్టమే అనడానికి సన్‌రైజర్స్‌ ఆటే నిదర్శనం. 277, 287, 125/0తో అద్భుతాలు సృష్టించిన సన్‌రైజర్స్‌.. ఛేదనలో తొలి ఓవర్లో రాబట్టింది 3 పరుగులే. ఆఖరి బంతికి ట్రావిస్‌ హెడ్‌ (1) వికెట్‌ కూడా కోల్పోయింది. విల్‌ జాక్స్‌ వేసిన మొదటి ఓవర్‌ బెంగళూరు బృందంలో ఊహించని జోష్‌ తీసుకురాగా.. సన్‌రైజర్స్‌ బలాన్ని సగానికి తగ్గించింది. మూడో ఓవర్లో అభిషేక్‌శర్మ (31; 13 బంతుల్లో 3×4, 2×6) రెండు సిక్సర్లు సహా 20 పరుగులు రాబట్టి కాస్త లోటు పూడ్చినా.. యశ్‌ దయాల్‌ తర్వాతి ఓవర్లో అతనికి కళ్లెం వేశాడు. అభిషేక్‌ పుల్‌ షాట్‌తో గాల్లోకి లేచిన బంతిని వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఒడిసి పట్టుకున్నాడు. అక్కడ్నుంచి సన్‌రైజర్స్‌ కష్టాలు మరింత పెరిగాయి. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న స్వప్నిల్‌ సింగ్‌ మంచి వికెట్‌తో బోణీ కొట్టాడు. వికెట్ల ముందుకొచ్చిన మార్‌క్రమ్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. ఆ సమయంలో సన్‌రైజర్స్‌ అభిమానుల ఆశలన్నీ క్లాసెన్‌పైనే. భారీ అంచనాల మధ్య క్రీజులో అడుగుపెట్టిన క్లాసెన్‌ తానెదుర్కొన్న రెండో బంతిని సిక్సర్‌గా మలిచి ఒక్కసారిగా జోష్‌ తీసుకొచ్చాడు. అయితే ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌ ప్రయత్నించిన క్లాసెన్‌.. గ్రీన్‌ చేతికి చిక్కాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన స్వప్నిల్‌ మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు. పవర్‌ప్లేలో 62/4తో సన్‌రైజర్స్‌ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. మధ్య ఓవర్లలో సన్‌రైజర్స్‌ను బెంగళూరు మరింత కట్టడి చేసింది. లెగ్‌ స్పిన్నర్‌ కర్ణ్‌ శర్మ తన వరుస ఓవర్లలో నితీశ్‌కుమార్‌ రెడ్డి (13), అబ్దుల్‌ సమద్‌ (10)లను ఔట్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ పనైపోయింది. అప్పటికి స్కోరు 85/6. అయితే కెప్టెన్‌ కమిన్స్‌ (31; 15 బంతుల్లో 1×4, 3×6).. స్వప్నిల్‌, కర్ణ్‌ ఓవర్లలో సిక్సర్లతో చెలరేగాడు. రెండు ఓవర్లలో  30 పరుగులు సాధించడంతో సన్‌రైజర్స్‌ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ గ్రీన్‌ తన తొలి ఓవర్లోనే కమిన్స్‌ను బోల్తాకొట్టించాడు. కెప్టెన్‌ నిష్క్రమించడంతో సన్‌రైజర్స్‌ మిగతా ఇన్నింగ్స్‌ మొక్కుబడిగా సాగింది. షాబాజ్‌ అహ్మద్‌ (40 నాటౌట్‌; 37 బంతుల్లో 1×4, 1×6) చివరి బంతి వరకు క్రీజులో ఉన్నా అద్భుతాలేమీ చేయలేకపోయాడు.

మెరుపులతో మొదలై..: ఈ సీజన్లో సన్‌రైజర్స్‌ రికార్డు స్కోర్ల మహిమో.. హెడ్‌, అభిషేక్‌, క్లాసెన్‌ల వీర విధ్వంసకర బ్యాటింగ్‌ భయమో గానీ పిచ్‌తో సంబంధం లేకుండా, పరిస్థితుల గురించి ఆలోచించకుండా టాస్‌ గెలవగానే సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్‌ ఇవ్వకుండా, తనే మొదట బ్యాటింగ్‌ చేసింది బెంగళూరు. ఆరంభంలో ఆ జట్టు చాలా దూకుడుగా ఆడింది. మొదటి బంతినే కోహ్లి బౌండరీగా మలిచాడు. రెండో ఓవర్లో కెప్టెన్‌ డుప్లెసిస్‌ (25; 12 బంతుల్లో 3×4, 1×6) మూడు ఫోర్లతో చెలరేగాడు. తొలి మూడు ఓవర్ల వరకు వీరిద్దరు బౌండరీలతోనే మాట్లాడారు. కమిన్స్‌ బౌలింగ్‌లో కోహ్లి, డుప్లెసిస్‌ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 19 పరుగులు రాబట్టారు. బెంగళూరు 3 ఓవర్లలోనే 43/0 స్కోరు సాధించింది. ఈ స్థితిలో నటరాజన్‌కు బంతినివ్వడం సన్‌రైజర్స్‌కు ఫలితాన్నిచ్చింది. నటరాజన్‌ స్లో బౌన్సర్‌ను భారీషాట్‌కు ప్రయత్నించిన డుప్లెసిస్‌ మిడాఫ్‌లో మార్‌క్రమ్‌ చేతికి చిక్కాడు. అక్కడ్నుంచి స్కోరు బోర్డు ఒక్కసారిగా నెమ్మదించింది. బౌలర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు సంధించడంతో కోహ్లి, విల్‌ జాక్స్‌ (6) పవర్‌ ప్లేలో భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో నాలుగో ఓవర్లో 2, అయిదో ఓవర్లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. నటరాజన్‌ బౌలింగ్‌లో కోహ్లి సిక్సర్‌ బాదడంతో పవర్‌ ప్లేను బెంగళూరు (61/1) గౌరవప్రదంగానే ముగించింది.

అతనొచ్చాక..: క్రీజులో అసౌకర్యంగా కనిపించిన విల్‌ జాక్స్‌ (6)ను మయాంక్‌ మార్కండే బోల్తా కొట్టించడం బెంగళూరుకు లాభమే చేసింది. అతని స్థానంలో క్రీజులోకొచ్చిన రజత్‌ పటీదార్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒక ఎండ్‌లో కోహ్లి భారీ షాట్లు కొట్టేందుకు ఇబ్బంది పడుతుండటంతో పటీదార్‌ బాధ్యత తీసుకున్నాడు. మార్కండే వేసిన 11వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతో చెలరేగి 27 పరుగులు పిండుకున్నాడు. రజత్‌ కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. అతడు మరింత దూకుడుగా ఆడే క్రమంలో ఉనద్కత్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కోహ్లి, పటీదార్‌ మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. కొద్దిసేపటికే అర్ధసెంచరీ (37 బంతుల్లో) పూర్తి చేసుకున్న కోహ్లి కూడా పెవిలియన్‌ చేరుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 14.5 ఓవర్లలో 140/4. చివరి 5 ఓవర్లలో కామెరూన్‌ గ్రీన్‌  (37 నాటౌట్‌; 20 బంతుల్లో 5×4) రాణించినా మిగతా వాళ్ల నుంచి అతనికి సహకారం లభించలేదు. మహిపాల్‌ లొమ్రార్‌ (7), దినేశ్‌ కార్తీక్‌ (11) ఎక్కువసేపు నిలవలేదు. చివరి ఓవర్లో సిక్సర్‌, ఫోర్‌తో అలరించిన స్వప్నిల్‌ సింగ్‌ (12) ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఒకదశలో 220 స్కోరు సునాయాసంగా చేరుకుంటుందనుకున్న బెంగళూరు.. చివరికి 206 పరుగుల వద్ద ఆగింది. చివరి 5 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) సమద్‌ (బి) ఉనద్కత్‌ 51; డుప్లెసిస్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) నటరాజన్‌ 25; జాక్స్‌ (బి) మార్కండే 6; పటీదార్‌ (సి) సమద్‌ (బి) ఉనద్కత్‌ 50; గ్రీన్‌ నాటౌట్‌ 37; లొమ్రార్‌ (సి) కమిన్స్‌ (బి) ఉనద్కత్‌ 7; కార్తీక్‌ (సి) సమద్‌ (బి) కమిన్స్‌ 11; స్వప్నిల్‌ (సి) అభిషేక్‌ (బి) నటరాజన్‌ 12; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 206; వికెట్ల పతనం: 1-48, 2-65, 3-130, 4-140, 5-161, 6-193, 7-206; బౌలింగ్‌: 1-0-10-0; భువనేశ్వర్‌ 1-0-14-0; కమిన్స్‌ 4-0-55-1; నటరాజన్‌ 4-0-39-2; షాబాజ్‌ 3-0-14-0; మార్కండే 3-0-42-1; ఉనద్కత్‌ 4-0-30-3

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) కార్తీక్‌ (బి) యశ్‌ దయాల్‌ 31; హెడ్‌ (సి) కర్ణ్‌ (బి) జాక్స్‌ 1; మార్‌క్రమ్‌ ఎల్బీ (బి) స్వప్నిల్‌ 7; నితీశ్‌ (బి) కర్ణ్‌ 13; క్లాసెన్‌ (సి) గ్రీన్‌ (బి) స్వప్నిల్‌ 7; షాబాజ్‌ నాటౌట్‌ 40; సమద్‌ (సి) అండ్‌ (బి) కర్ణ్‌ 10; కమిన్స్‌ (సి) సిరాజ్‌ (బి) గ్రీన్‌ 31; భువనేశ్వర్‌ (సి) సిరాజ్‌ (బి) గ్రీన్‌ 13; ఉనద్కత్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-3, 2-37, 3-41, 4-56, 5-69, 6-85, 7-124, 8-141; బౌలింగ్‌: జాక్స్‌ 2-0-23-1; సిరాజ్‌ 4-0-20-0; యశ్‌ దయాల్‌ 3-0-18-1; స్వప్నిల్‌ 3-0-40-2; కర్ణ్‌ 4-0-29-2; ఫెర్గూసన్‌ 2-0-28-0; గ్రీన్‌ 2-0-12-2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని