close

తాజా వార్తలు

అరామ్‌కో.. సౌదీకి ప్రాణవాయువు..!

ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులకు ఎడారి దేశం శ్రీకారం

ఇంటర్నెట్‌డెస్క్‌: అరామ్‌కో.. ఏడారి దేశమైన సౌదీ అరేబియాలోని రాజకుటుంబానికి చెందిన దిగ్గజ చమురు సంస్థ. ఇటీవల రిలయన్స్‌ పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో వాటాల కొనుగోలుతో వార్తల్లో నిలిచింది. వ్యాపారం విషయంలో పక్కా ప్రణాళికతో ఉండే అతితక్కువ దేశాల్లో సౌదీ కూడా ఒకటి. మతపరమైన సంబంధాలను.. వ్యాపార సంబంధాలకు దూరంగా ఉంచుతూ సుస్థిర భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా భారత్‌లో సౌదీ అరామ్‌కో 15బిలియన్‌ డాలర్లను రిలయన్స్‌లో పెట్టుబడిగా పెట్టింది. 
పాకిస్థాన్‌కు ప్రాణవాయువు అందించే అరబ్‌ దేశం సౌదీనే. ప్రపంచం మొత్తం పాక్‌ను దూరం పెట్టినా.. ఆ దేశానికి 20 బిలియన్‌ డాలర్ల సాయం అందిస్తానని హామీ ఇచ్చింది. పాక్‌ను తనపై ఆధారపడే దేశంగా సౌదీ చూస్తుంది. కానీ, భారత్‌ను సౌదీ చూసే కోణం వేరు. భారత్‌ ఆదాయాన్ని ఇచ్చే దేశంగా చూస్తుంది. పాక్‌తో పోల్చుకుంటే భారత్‌ ఆర్థికంగా తాము ఆధారపడదగిన దేశంగా సౌదీ భావిస్తుందని ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్ఇం‌టర్నెషనల్‌ అఫైర్స్‌ డీన్‌ శ్రీరామ్‌ చౌలియా పేర్కొన్నారు.
ఈక్రమంలో సౌదీ అరేబియా భారత్‌లో దాదాపు 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశాలను పరిశీలిస్తోందని ఇటీవల సౌదీ యువరాజ్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారత్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి తెలిపారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం 15 బిలియన్‌ డాలర్లను రిలయన్స్‌లో పెట్టుబడిగా పెట్టారు. రిలయన్స్‌తో సౌదీ అరామ్‌కో సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

యాపిల్‌ను దాటేసిన కంపెనీ ..

ఏ విషయమైన గోప్యంగా ఉంచే సౌదీ అరేబియాలో ఒక  కంపెనీ చేసిన ప్రకటన ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది.  సౌదీ అరేబియాకు చెందిన చమురు రంగ దిగ్గజం అరామ్‌కో తొలిసారి తన వార్షిక లాభాలను బాహ్యప్రపంచానికి వెల్లడించింది. ఆ వివరాలు విని యాపిల్‌తో సహా దిగ్గజ కంపెనీలు కూడా నోళ్లు వెళ్లబెట్టాయి. గత ఏడాది 111.1 బిలియన్‌ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. అంటే అక్షరాలా రూ.7.69లక్షల కోట్లు. గత ఏడాది ప్రపంచంలోనే అత్యధిక లాభాలను సాధించిన కంపెనీగా ఇది రికార్డు సృష్టించింది.  2018లో ఇప్పటి వరకు యాపిల్‌ 59 బిలియన్‌ డాలర్లు, రాయల్‌ డచ్‌ షెల్ 23.9 బిలియన్‌ డాలర్లు, ఎక్సాన్‌ మొబైల్‌ 20.8 బిలియన్‌ డాలర్ల లాభాన్ని సంపాదించాయి. ఇప్పుడు ఈ మూడు కంపెనీల లాభాన్ని కలిపినా అరామ్‌కో లాభంతో సమానం కాలేదు. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది.

కళ్లు తెరిపించిన 2014..

సౌదీకి చెందిన అరామ్‌కో ఇప్పటి వరకు తన లాభాలను వెల్లడించలేదు. 1938 నుంచి చమురు ఆదాయంతో సౌదీ సంపద వెల్లివిరిసింది. ప్రజలకు భారీ సబ్సిడీలను ఇస్తున్నారు. కొన్నాళ్ల కిందటి వరకు పన్ను వసూళ్లు కూడా లేవు. కానీ 2014లో చమురు ధరలు పతనం కావడంతో  ఆర్థిక వ్యవస్థ ఒక కుదుపునకు లోనైంది. దీంతో లోటు బడ్జెట్‌ ప్రభావం తెలిసి వచ్చింది.  ఇప్పుడే ఇలా ఉంటే కొన్నేళ్ల తర్వాత చమురు నిల్వలు అంతమైపోతే పరిస్థితి  ఏమిటనేది సౌదీకి అంతుబట్టలేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేవలం చమురుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని పాలకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అరామ్‌కోను మార్కెట్లో లిస్టు చేయాలని సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సంకల్పించారు.  ఇది ఐపీవోకు వస్తే ప్రపంచంలో అదే అతి పెద్దది కానుంది. ఐపీవోకు వచ్చే కంపెనీలు తప్పనిసరిగా తమ లెక్కల పుస్తకాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లాభాలను ప్రకటించింది. ప్రస్తుతం అరామ్‌కో విలువ 1 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 1.5 ట్రిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రిలయన్స్‌లో అరామ్‌కో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ కంపెనీ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.  లిస్టింగ్‌తో ఈ కంపెనీ విలువ 2 ట్రిలియన్‌ డాలర్లను దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లిస్టింగ్‌ ద్వారా వచ్చే నిధులతో టెక్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని సౌదీ భావిస్తోంది. ఇప్పటికే సౌదీ సావరీన్‌ ఫండ్స్‌ ద్వారా టెస్లా, ఉబెర్‌ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. 

దుబాయ్‌ ఆదర్శం..

గల్ఫ్‌ దేశాల్లో దుబాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడే పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడి దూసుకెళుతోంది. 20ఏళ్ల కిందటే దీనికి సంబంధించిన ప్రణాళిక అమలును ప్రారంభించింది. పెట్టుబడులకు అనువైన వసతులను కల్పించింది. దీంతోపాటు స్వేచ్ఛా ఆర్థిక విధానాలను అమలు చేసింది. దీంతో ప్రపంచం నలు మూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించింది. ప్రపంచంలోని ప్రతి అతిపెద్ద కంపెనీ దుబాయ్‌లో ఒక శాఖను ఏర్పాటు చేశాయంటే అతిశయోక్తి కాదు. పలు దేశాల్లోని అత్యున్నత విశ్వవిద్యాలయాలు ఇక్కడి అకాడమిక్‌ సిటీలో తమ శాఖలను ఏర్పాటు చేశాయి. మధ్యప్రాశ్చ్యంలో పర్యటకులు అత్యధికంగా సందర్శించే నగరం కూడా దుబాయే. ఫలితంగా దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన ఎయిర్‌పోర్టు. దేశ జీడీపీలో కీలక వాటాను సొంతం చేసుకొంది. ఈ ప్రాంతంలో అత్యంత రద్దీ అయిన నౌకాశ్రయంగా దుబాయ్‌లోని ది జబెల్‌ అలీ పోర్టు పేరు తెచ్చుకొంది. ఫలితంగా ప్రస్తుతం దుబాయ్‌ జీడీపీలో చమురు వాటా కేవలం 5శాతానికి చేరింది. ప్రపంచంలో మరే ఆర్థిక వ్యవస్థ ఇంత వేగంగా మారలేదు. దుబాయ్‌ రాజు జయేద్‌ అల్‌ నహ్యన్‌ సౌదీ యువరాజుకు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో సౌదీ యువరాజు కూడా దుబాయ్‌ బాటలోనే నడిచేందుకు యత్నాలు మొదలు పెట్టారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు