ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Updated : 10 May 2024 09:59 IST

పోలింగ్‌ పూర్తయ్యాకే పథకాల సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమచేయాలన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టు నిర్ణయం

ఈనాడు, అమరావతి: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ నెల 13న ఓటింగ్‌ ముగిసేవరకు ఈ పథకాలకు సంబంధించిన నిధులను జమచేయవద్దంటూ ఈసీ ఈనెల 9న ఇచ్చిన ఉత్తర్వులను 10 వరకు తాత్కాలికంగా పక్కనపెట్టింది. నిధుల పంపిణీకి ఏవిధంగాను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రవర్తన నియమావళిని అతిక్రమించేలా వేడుకలు నిర్వహించవద్దని.. నేతల జోక్యం లేకుండా చూడాలని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ గురువారం రాత్రి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ప్రధాన వ్యాజ్యాలపై కౌంటర్‌ వేయాలని ప్రతివాదులను ఆదేశించారు. విచారణను జూన్‌ 27కి వాయిదా వేశారు.

ఈ నెల 13న పోలింగ్‌ తేదీ ముగిసే వరకు పెట్టుబడి రాయితీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల సొమ్ము రూ.14,165 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయకుండా నిలువరిస్తూ 9న ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని, అంతకు ముందు ఈసీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది.

13వ తేదీ తర్వాత జమచేస్తే అభ్యంతరం లేదు: ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది

ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. పోలింగ్‌ ఈ నెల 13తో ముగుస్తుందని, ఆ తర్వాత రోజు రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను జమచేస్తే అభ్యంతరం లేదన్నారు. ఎన్నికల ప్రక్రియ (జూన్‌ 6) ముగిసే వరకు నిధులను జమచేయవద్దని గతంలో నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమర్పించిన వివరాలను పరిశీలించాక పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు జమచేయవచ్చని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాన అవకాశాలు దెబ్బతీయకుండా, లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సొమ్మును జమచేసే విషయంలో రెండుమూడు రోజులు వేచిచూస్తే వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు జూన్‌ 6 వరకు ఉన్నప్పటికీ.. ఓటింగ్‌ అయిన మరుసటి రోజే సొమ్ము జమకు అనుమతి ఇచ్చామన్నారు. వివిధ పథకాల కింద లబ్ధిదారులకు రూ. 14,165 కోట్ల పంపిణీకి రాష్ట్రప్రభుత్వం అనుమతి కోరిందన్నారు. ఎన్నికలకు ముందు అంత పెద్దమొత్తంలో సొమ్మును జమచేస్తే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందన్నారు. పథకాల సొమ్ము విడుదలకు కొందిమంది మాత్రమే హైకోర్టులో వ్యాజ్యాలు వేశారన్నారు. 13వ తేదీ లోపే నిధులను తమ ఖాతాల్లో జమచేయాలని కోరే హక్కు పిటిషనర్లకు లేదని వాదించారు. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేయలేదని, లబ్ధిదారులు కొందరు మాత్రమే వ్యాజ్యాలు వేశారని గుర్తుచేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కొత్త పథకాలతోపాటు అమల్లో ఉన్న పథకాలకూ వర్తిస్తుందని వివరించారు. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం పథకాల లబ్ధిదారులకు ఏడాదికి ఒకసారి సొమ్ము జమచేస్తారని గుర్తుచేశారు. కరవు మండలాలు, బాధిత రైతులను ప్రభుత్వం ఆరునెలల కిందట గుర్తించిందని, ఇప్పటి వరకు సొమ్ము జమచేయకుండా పోలింగ్‌ తేదీకి రెండుమూడు రోజుల ముందు సొమ్ము జమచేస్తే ఎన్నికలను ప్రభావితం చేసినట్లవుతుందని తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో అనుచిత లబ్ధి కలగకుండా అన్ని పార్టీలకూ సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.

రూ.వేల కోట్లు జమచేస్తే ఎన్నికలపై ప్రభావం ఉంటుంది

పథకాలకు నిధులను విడుదల చేస్తున్నట్లు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే ప్రభుత్వం ప్రకటించిందని, అయితే లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమచేసేందుకు ఇంత జాప్యం ఎందుకు జరిగిందో తెలియజేస్తూ ప్రభుత్వం సమర్పించిన వినతిలో పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవని ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ పేర్కొన్నారు. వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెట్టుబడి రాయితీ విషయంలో ఆరు నెలలు వేచి చూసిన వారు మరో మూడు, నాలుగు రోజులు వేచి చూడలేరా అని అంటూ ఒకటి, రెండు రోజుల్లో రూ.వేల కోట్లను జమచేస్తే ఎన్నికలపై అది ప్రభావం చూపుతుందన్నారు. వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు.

ఎప్పటి నుంచో అమలవుతున్న పథకాలు ఇవి: పిటిషనర్లు

పిటిషన్లు దాఖలు చేసిన రైతులు, మహిళల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. ‘నిధుల పంపిణీని నిలువరిస్తూ ఈసీ తీసుకున్న పథకాలు కొత్తవి కాదు. ఎప్పటి నుంచో అమలవుతున్నాయి. రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించారు. 6.95 లక్షల మంది రైతులకు రూ.847 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని నిలుపుదల చేయడం వల్ల రైతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పటికే కొనసాగుతున్న పథకాల నిధుల పంపిణీని నిలువరించాల్సిన అవసరం లేదని ఎన్నికల ప్రవర్తన నియమావళి స్పష్టం చేస్తోంది. ఇందుకు భిన్నంగా ఈసీ వ్యవహరించింది. లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో సొమ్ము జమచేస్తారు. అధికారపార్టీ దీనిని సొంత ప్రయోజనం కోసం ప్రచారం చేసుకోకుండా ఈసీ షరతులు విధించవచ్చు. విద్యా దీవెన పథకం కింద నిధులను సకాలంలో జమచేయకుంటే విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందిపెట్టే ప్రమాదం ఉంది. ఎన్నికల మరుసటి రోజు నుంచి (13వ తేదీ తర్వాత) సొమ్ము జమచేసుకోవచ్చంటూ ఈ నెల 9న ఈసీ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేయండి. నిధుల జమకు అనుమతివ్వండి’ అని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఇవేవీ కొత్త పథకాలు కావన్నారు. నిధుల లభ్యతను బట్టి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. నిధుల పంపిణీకి అనుమతి కోరుతూ స్క్రీనింగ్‌ కమిటీ పంపిన ప్రతిపాదనకు సకాలంలో నిర్ణయం వెల్లడించకుండా ఈసీ జాప్యం చేసిందన్నారు. నిధుల జమకు అనుమతివ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని