krishnamma movie review: రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

krishnamma movie review: సత్యదేవ్‌ కీలక పాత్రలో నటించిన మాస్‌, యాక్షన్‌ డ్రామా ఎలా ఉంది?

Published : 10 May 2024 14:27 IST

Krishnamma Movie Review; చిత్రం: కృష్ణమ్మ; నటీనటులు: సత్యదేవ్, లక్ష్మణ్‌ మీసాల, కృష్ణ బురుగుల, అర్చన అయ్యర్, అతీరా రాజ్, రఘు కుంచె, నంద గోపాల్, తారక్, సత్యం తదితరులు; సంగీతం: కాలభైరవ; ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి; నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి; సమర్పణ: కొరటాల శివ; రచన, దర్శకత్వం: వి.వి.గోపాలకృష్ణ; విడుదల తేదీ: 10-05-2024

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు సత్యదేవ్‌. కానీ, కొన్నాళ్లుగా ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా హిట్టు మాట వినిపించలేకపోయింది. దీంతో ఈసారి విజయమే లక్ష్యంగా ‘కృష్ణమ్మ’తో బాక్సాఫీస్‌ బరిలో అడుగు పెట్టారు. దీనికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం.. పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల చూపు ఈ సినిమాపై పడింది. మరి ఈ ‘కృష్ణమ్మ’ కథేంటి?(krishnamma movie review) ఈ చిత్రంతోనైనా సత్యదేవ్‌ విజయతీరాలకు చేరుకున్నారా?

కథేంటంటే: అనాథలైన భద్ర (సత్యదేవ్‌), శివ (కృష్ణ బూరుగుల), కోటి (లక్ష్మణ్‌ మీసాల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ బయటకొచ్చాక ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్మగ్లింగ్‌ చేసి పొట్ట నింపుకొంటుంటారు. వీళ్లంతా తమకంటూ ఓ కుటుంబం ఉండాలని ఆశ పడతారు. ఈ క్రమంలోనే మీనా (అతీరా రాజ్‌)తో శివ ప్రేమలో పడతాడు. ఆమె భద్రకు రాఖీ కట్టడంతో తనూ ఆమెను సొంత చెల్లిగా చూడటం మొదలు పెడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్‌ వంటి తప్పుడు పనులు మానేసి ఆటో నడుపుతూ సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తాడు భద్ర. అయితే ఓసారి మీనా తల్లి ఆపరేషన్‌కు రూ.2లక్షలు అవసరమైతే.. ఆ డబ్బు సంపాదించడం కోసం భద్ర, శివ, కోటి తప్పనిసరి పరిస్థితుల్లో గంజాయి స్మగ్లింగ్‌ చేయడానికి సిద్ధపడతారు. అలా వాళ్లు పాడేరు నుంచి వైజాగ్‌కు గంజాయి తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్లు అనుకోకుండా ఓ యువతి హత్యాచారం కేసులోనూ ఇరుక్కుంటారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ హత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు? (krishnamma movie review)  ఈ కేసు ఏమిటన్నది తెలియకుండానే దాన్ని భద్ర, కోటి, శివ తమపై వేసుకోవడానికి కారణమేంటి? కేసు గురించి తెలిశాక ఈ ముగ్గురు ఏం చేశారు? శివని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న మీనా ఏమైంది? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: స్నేహంతో ముడిపడి ఉన్న ప్రతీకార కథ ఇది. బలమైన భావోద్వేగాలతో రా రస్టిక్‌ కోణంలో సాగుతుంది. అయితే ఈ అసలు కథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఒకరకంగా ప్రథమార్ధమంతా సాగతీత వ్యవహారమే. అడవిలో జరిగే ఓ హత్యతో సత్యదేవ్‌ పాత్రను పరిచయం చేస్తూ.. కథను ఆరంభించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. ఆ తర్వాత భద్ర, శివ, కోటిల గతాన్ని చూపిస్తూ నెమ్మదిగా సినిమాని ముందుకు నడిపించాడు దర్శకుడు. వీళ్ల ముగ్గురి స్నేహం, మీనాతో శివ ప్రేమలో పడటం.. మొదట్లో వీళ్ల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు.. ఆఖరికి వాళ్లంతా ఓ కుటుంబంలా కలిసిపోవడం.. అంతా రొటీన్‌ వ్యవహారంలా సాగుతుంది. (krishnamma movie review)  ఈ మధ్యలో హీరోకి ఓ చిన్న లవ్‌ట్రాక్‌ తగిలించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కానీ, అదీ ఏమాత్రం మెప్పించదు. విరామానికి ముందు భద్ర తన మిత్రులతో కలిసి గంజాయి స్మగ్లింగ్‌కు సిద్ధమవడం.. దాన్ని తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోవడం.. అదే సమయంలో అనుకోకుండా ఓ హత్యాచారం కేసును తమపై వేసుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడి నుంచి ద్వితీయార్ధమంతా సీరియస్‌ టోన్‌లో సాగిపోతుంది. హత్యాచారానికి గురైన యువతి ఎవరన్నది తెలిశాక భద్ర, కోటి, శివ పోలీసులపై తిరగబడే సన్నివేశాలు ఆసక్తిరేకెత్తిస్తాయి. పోలీసులు వాళ్లని చిత్రహింసలకు గురి చేసి బలవంతంగా ఆ కేసును ఒప్పించే సీక్వెన్స్‌ ‘జైభీమ్‌’, ‘విచారణ’ చిత్రాల్ని గుర్తు చేస్తుంది. భద్ర, కోటి జైలు నుంచి బయటకు వచ్చాక చేసే వరుస హత్యలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ముగింపు ఊహలకు తగ్గట్లుగా ఉన్నా.. పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా అనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే: భద్ర పాత్రలో సత్యదేవ్‌ చక్కగా ఒదిగిపోయారు. ఆయన ఈ సినిమాతో తనలోని ఇంటెన్స్‌ నటనను ప్రేక్షకులకు మరోసారి రుచి చూపించారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో తన మిత్రుడు చనిపోయినప్పుడు సత్యదేవ్‌ కళ్లతో పలికించే భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. అలాగే ముగింపులోనూ ఉద్వేగభరితమైన నటనతో అందరి మనసుల్ని హత్తుకుంటారు. ఆయన మిత్రులుగా కోటి, శివ పాత్రల్లో లక్ష్మణ్, కృష్ణ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. (krishnamma movie review)  మీనా పాత్రలో అతీరా అందంగా కనిపించింది. ఆమె పాత్రలో నటనకు ఆస్కారం లేకున్నా.. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంది. ఇక సినిమాలోని మిగతా పాత్రలన్నీ ఫర్వాలేదనిపిస్తాయి. దర్శకుడు గోపాలకృష్ణ ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. కాకపోతే దీన్ని రా రస్టిక్‌గా చూపించిన తీరు బాగుంది. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం కాస్త ప్రేక్షకుల్ని అలరిస్తుంది. కాలభైరవ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + సత్యదేవ్‌ నటన
  • + ద్వితీయార్ధంలోని మలుపులు
  • + పతాక సన్నివేశాలు
  • బలహీనతలు
  • - కథా నేపథ్యం
  • - సాగతీత సన్నివేశాలు
  • చివరిగా: ‘కృష్ణమ్మ’.. ఈ ప్రవాహంలో సుడులెక్కువ! (krishnamma movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని