Allu arjun-pawan kalyan: నా ప్రేమ, మద్దతు పవన్‌కల్యాణ్‌కే.. అల్లు అర్జున్‌ పోస్ట్‌

పవన్‌ రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ అల్లు అర్జున్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌పెట్టారు.

Updated : 09 May 2024 17:17 IST

హైదరాబాద్‌: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు (Pawan Kalyan) రాజకీయ మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పిఠాపురం ప్రజలు పవన్‌ను గెలపించాలని కోరుతూ అగ్ర కథానాయకుడు చిరంజీవి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) పవన్‌కు మద్దతు తెెలిపారు. ఆయన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌పెట్టారు.

‘‘పవన్‌కల్యాణ్‌గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

ఇటీవల జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు హీరో నాని (Nani) ప్రకటించారు. ‘పవన్‌ కల్యాణ్‌.. మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. చిరంజీవి వీడియోను తన ఎక్స్‌ వేదికగా పంచుకున్న రామ్‌చరణ్‌ ‘భవిష్యత్‌ కోసం పాటుపడే నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను గెలిపించండి’ అని పోస్ట్‌ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్‌ శ్రేయస్సు కోసం మీ కృషిని, ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఆశాదీపం. మీరు గెలిచి ప్రజల తలరాతలు మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి’ అని హీరో రాజ్ తరుణ్ జనసేనకు సపోర్ట్‌ చేశారు. అలాగే పవన్‌కు మద్దతు తెలుపుతున్నట్లు యువ నటుడు తేజ సజ్జా తన ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, హాస్య నటులు ఆది, గెటప్‌ శ్రీను తదితరులు పవన్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నటుడు సంపూర్ణేష్‌ బాబు కూడా పవన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని