అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే

అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్‌ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది.

Published : 10 May 2024 07:59 IST

సైబర్‌ నేరాల నియంత్రణకు ఆర్బీఐ చర్యలు
మూణ్నెల్లలోనే 2.5 లక్షల బ్యాంకు ఎకౌంట్ల మూసివేత
ఇతరులు వినియోగించుకునేందుకు అనుమతిస్తే చిక్కులు తప్పవంటున్న దర్యాప్తు సంస్థలు

ఈనాడు - హైదరాబాద్‌: అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్‌ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోని ఈ తరహా 2.5 లక్షల ఖాతాలను 3 నెలల కాలంలోనే రద్దుచేశారు.

ఎక్కడో ఉండి.. ఇక్కడి ఖాతాలకు..

దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఒక్క తెలంగాణలోనే సైబర్‌ నేరాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో బాధితులు రూ.2 వేల కోట్లు పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా లెక్కలేస్తే ఈ మొత్తం రూ.15-20 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్మును మళ్లించుకునేందుకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వినియోగించుకుంటున్నారు. నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతు కూలీలకు కమీషన్‌ ఆశ చూపి..వారి ఖాతాల వివరాలు తీసుకుంటున్నారు. వారితో ఖాతాలు తెరిపించేందుకు స్థానికంగా ఏజెంట్లనూ నియమించుకుంటున్నారు. కొల్లగొట్టిన డబ్బును తొలుత వీరి ఖాతాల్లోకి, అక్కడ నుంచి మరికొన్ని ఖాతాల్లోకి మళ్లించి..తర్వాత ఈ సొమ్మును క్రిప్టోగా మార్చి విదేశాలకు తరలిస్తున్నారు. 

కట్టడికి కఠిన చర్యలు

దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు వ్యవస్థీకృతమయ్యాయి. కొందరు విదేశాల నుంచీ కార్యకలాపాలు సాగిస్తుండటంతో వారిని పట్టుకోవడం, నేరాలు జరగకుండా అడ్డుకోవడం దర్యాప్తు సంస్థలకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో నేరగాళ్లకు ఆయువు పట్టులాంటి బ్యాంకు ఖాతాల ఆటకట్టించాలని దర్యాప్తు సంస్థలు నిర్ణయించాయి. దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సూచనల ఆధారంగా ఆర్బీఐ అనుమానాస్పద ఖాతాల రద్దుకు బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం..పెద్దగా లావాదేవీలు జరగని ఖాతాల్లోకి ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు జమకావడం, ఆ వెంటనే ఆ డబ్బు వేరే ఖాతాలోకి మళ్లడం వంటివి జరిగినప్పుడు దాన్ని అనుమానాస్పద ఖాతాగా పరిగణిస్తారు. ఆ ఖాతాదారుడిని పిలిచి విచారిస్తారు. అంత సొమ్ము ఎలా వచ్చింది? ఎవరు పంపారు? అక్కణ్నుంచి మరో ఖాతాలోకి ఎలా వెళ్లిందనే వివరాలు ఆరా తీస్తారు. సరైన సమాధానం లభించకపోతే.. అనుమానాస్పద ఖాతాగానే పరిగణించి రద్దు చేస్తారు. క్రిమినల్‌ కేసులూ నమోదు చేస్తారు. ఇలా ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 2.5 లక్షల బ్యాంకు ఖాతాలు రద్దయ్యాయి. ‘ఈ ప్రయోగం సత్ఫలితాన్నిస్తోంది. తెలిసి చేసినా, తెలియక చేసినా తమ ఖాతాను వేరే వాళ్లు వాడుకోవడానికి అనుమతిస్తే చిక్కులు తప్పవనే విషయం సామాన్య ఖాతాదారులకు కూడా తెలిసివస్తుంది. దీనివల్ల సైబర్‌ నేరగాళ్ల ముందరి కాళ్లకు బంధాలు వేసినట్లవుతుందని’ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అనుమానాస్పద సిమ్‌కార్డులు రద్దు చేయిస్తున్నారు. నేరాలకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న 33,029 సిమ్‌కార్డులు, ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా 3,769 సెల్‌ఫోన్లను స్తంభింపజేశారు.


ఆశపడితే నేరస్థులవుతారు

సైబర్‌ నేరగాళ్లు తాము చేసే నేరాల ద్వారా కొల్లగొట్టే నగదు లావాదేవీల కోసం ఇతరుల బ్యాంకు ఖాతాలను వినియోగించడం ఇటీవల ఎక్కువైంది. నేరానికి ఉపయోగిస్తారని తెలిసినా కొందరు సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో వివరాలు ఇస్తున్నారు. అలా ఇచ్చే వారూ నేరస్థులే అవుతారు. నేరాలు చేసే వారికి సిమ్‌కార్డులు ఇచ్చినా నేరస్థులుగానే పరిగణిస్తాం.

 కొత్తపల్లి నరసింహ, డీసీపీ, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని