close

తెలంగాణ

భలే మాంచి ఆవు బేరము 

ఒక్కో గోవు ఖరీదు రూ.1000 
బెళగం మిలటరీ డెయిరీ నుంచి కొనుగోలు 
ఆదిలాబాద్‌ రైతులకు అందించనున్న విజయ డెయిరీ

విజయ డెయిరీ ఒక్కో ఆవును రూ.వెయ్యికే కొనుగోలు చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కేంద్ర రక్షణశాఖ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. రక్షణశాఖకు ఆవులకు సంబంధమేంటి అనుకుంటున్నారా?.. బ్రిటిష్‌ పరిపాలన సమయంలో సైన్యం కోసం దేశవ్యాప్తంగా పలుచోట్ల డెయిరీ ఫామ్‌లను ఏర్పాటు చేశారు. కాగా ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో డెయిరీ ఫామ్‌లు నడుస్తున్నందున, ప్రత్యేకంగా ఆవులను పెంచడం కన్నా డెయిరీ వాళ్లకు అప్పగించడమే మేలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో కర్ణాటక రాష్ట్రం బెళగం మిలటరీ డెయిరీ ఫామ్‌ నుంచి రోజుకు 15 లీటర్ల చొప్పున పాలిచ్చే ఆరోగ్యవంతమైన 537 ఆవులను విజయ డెయిరీ కొనుగోలు చేసింది.

లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఆదిలాబాద్‌ కలెక్టర్‌కు.. 
కర్ణాటక నుంచి తీసుకొచ్చే ఆవులను ఆదిలాబాద్‌ జిల్లా రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ జిల్లా నుంచి సుమారు రెండు వేల మంది రైతులు విజయ డెయిరీకి పాలు పోస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాయితీపై పాడిపశువుల పంపిణీలో కేవలం రెండు వందల మందే లబ్ధిపొందారు. మిగిలిన వారిలో కొందరితోపాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల నుంచి ఎంపిక చేసిన వారికి ఆవులను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, ఆవుల పంపిణీ బాధ్యతను ఆ జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే చేపట్టనున్నారు. ఆవు రూ.వెయ్యికే వస్తున్నా.. రవాణా ఖర్చులు, బీమాతో కలిపి ఒక్కోదానిపై సుమారు రూ.11 వేల వరకు ఖర్చవుతుందని అంచనా.

ప్రత్యేక సంకర జాతి 
ఆవులను కొనుగోలు చేయడానికి ముందు తెలంగాణ పశువైద్యుల బృందం బెళగం వెళ్లి అక్కడి వాటిని పరిశీలించింది. వాటిలో ఎక్కువ భాగం విదేశీ జాతైన హోల్‌స్టెన్‌ ఫ్రీజన్‌, తెలంగాణ బ్రీడ్‌ సాహీవాల్‌ నుంచి వచ్చిన సంకర జాతికి చెందినవిగా గుర్తించింది. దీంతో ఇవి తెలంగాణ వాతావరణాన్ని సులభంగా తట్టుకోగలవని అధికారులు భావిస్తున్నారు. అందుకే మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో వాటిని పెంచే సామర్థ్యం ఉన్న రైతులకే సరఫరా చేయాలని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిర్ణయించారు. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులకు సైతం ఈ మేరకు డెయిరీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఆదిలాబాద్‌లో వీటి పరిస్థితిని చూశాక, పుణె మిలటరీ డెయిరీ ఫామ్‌ నుంచి మరిన్ని ఆవులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు తెలిపారు. రాయితీ పాడిపశువుల పథకంలో 2.13 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 60 వేల మంది లబ్ధిదారులకు ఆవులు, గేదెలు పంపిణీ చేశామని ఆయన చెప్పారు.

39 మిలటరీ డెయిరీ ఫామ్స్‌ మూసివేత 
బ్రిటిష్‌ పరిపాలన సమయంలో 1892లో బెళగంలో ఫామ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలకు ఇది పాలు సరఫరా చేస్తోంది. 50 మంది ప్రత్యక్షంగా, 300 మంది పరోక్షంగా దీనిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డెయిరీఫామ్‌లు నడుస్తున్నందున ప్రత్యేకంగా డెయిరీ నిర్వహణ ఉపయోగం లేదని భావించి వాటిని మూసివేయాలని రక్షణశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బెళగం ఫామ్‌తోపాటు దేశంలో మిలటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న 39 ఫామ్‌లను మూసివేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెయిరీలకు ఆవులను అప్పగించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌ మిలటరీ ఫామ్‌లోని ఆవులను సైతం మణిపూర్‌ రాష్ట్రానికి విక్రయించారని డెయిరీ అధికారులు చెబుతున్నారు.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు