కొవిడ్‌ రెండో ఉద్ధృతి ప్రభావమే ఎక్కువ - The effect of the second wave on covid is greater
close

Published : 11/06/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ రెండో ఉద్ధృతి ప్రభావమే ఎక్కువ

క్రెడాయ్‌ సర్వే

దిల్లీ: కొవిడ్‌ తొలి దశతో పోలిస్తే రెండోదశ ఉద్ధృతి ప్రభావం తమ వ్యాపారాలపై చాలా ఎక్కువగా ఉందని 90 శాతం మంది స్థిరాస్తి డెవలపర్లు స్థిరాస్తి సమాఖ్య క్రెడాయ్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొత్త విక్రయాలు దారుణంగా పడిపోయాయని, రావాల్సిన బకాయిలు కూడా దాదాపు ఆగిపోయాయని వారు తెలిపారు. స్థానికంగా వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లతో తమ ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని 95 శాతం మంది డెవలపర్లు భయపడుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో క్రెడాయ్‌కు సుమారు 13,000 మంది సభ్యులుండగా, 217 నగరాల్లోని 4,813 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో క్రెడాయ్‌ నివేదిక విడుదల చేసింది. స్థిరాస్తి రంగంపై కొవిడ్‌-19 రెండో దశ ప్రభావం ఎలా ఉందనే కోణంలో ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ జోన్లలోని అన్ని నగరాల్లో మే 24-జూన్‌ 3 మధ్య క్రెడాయ్‌ ఈ సర్వే చేసింది.

* సిమెంట్‌, ఉక్కు ధరలు అమాంతం పెరిగిపోయి, నిర్మాణ వ్యయం అధికమవ్వడంతో ఇళ్లు/ఫ్లాట్ల ధరలు మధ్య, దీర్ఘకాలంలో 10-20 శాతం మేర పెరిగే అవకాశం ఉందని క్రెడాయ్‌ తెలిపింది.


కొవిడ్‌ ఉన్నా.. నియామకాల జోరు
ఔషధ, ఇ-కామర్స్‌ రంగాల్లో అధికం
ఇండీడ్‌ సర్వే

దిల్లీ: కొవిడ్‌-19 రెండో దశ పరిణామాల నేపథ్యంలోనూ, కంపెనీలు నియామకాల జోరును కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో ఔషధ, ఇ-కామర్స్‌, ఆర్థిక సేవల రంగాల్లో నియామకాలు అధికంగా జరిగాయని ఇండీడ్‌ సర్వే పేర్కొంది. ఇండీడ్‌ తరఫున మార్చిలో వాల్యూవాక్స్‌ నిర్వహించిన ఈ సర్వేలో 9 నగరాలకు చెందిన 350 వ్యాపారులు, 500 మంది ఉద్యోగులు అభిప్రాయాలు తెలిపారు. సర్వే నివేదిక ఇలా..
* గత త్రైమాసికంలో 64 శాతం సంస్థలు ఉద్యోగులను నియమించుకున్నాయి. ఈ సమయంలో 61 శాతం మంది ఉద్యోగం కోసం లేదా కొలువు మార్పు కోసం చూశారు. త్రైమాసికం మొత్తంగా చూస్తే నియామక కార్యకలాపాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ.. నెలవారీగా నియామకాలు తగ్గుతూ వచ్చాయి. జనవరిలో 38 శాతంగా ఉన్న నియామకాలు, ఫిబ్రవరిలో 31 శాతానికి, మార్చిలో 26 శాతానికి తగ్గాయి.
* సర్వేలో పాల్గొన్న వారు కోరుకున్న కొలువు కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. 53 శాతం పురుషులు, 60 శాతం మహిళలు, 50 శాతం మంది ప్రారంభ స్థాయి, 44 శాతం మధ్య స్థాయి, 40 శాతం సీనియర్‌ స్థాయి ఉద్యోగులు ఇదే అభిప్రాయాన్ని తెలిపారు.
* కరోనా సమయంలో అత్యవసర వ్యాపార సేవలు అందించిన సంస్థలు నిర్వహణ పదవులకు ఉద్యోగులను నియమించుకోవడం పెంచాయి.
* టీమ్‌ లీడ్‌, బిజినెస్‌ ఎనలిస్ట్‌, కంటెంట్‌ హెడ్‌, సర్వీస్‌ ఇంజినీర్‌ వంటి ఉద్యోగాల వాటా 25 శాతంగా ఉంది. మొబైల్‌ యాప్‌ డెవలపర్‌, క్యాడ్‌/కామ్‌ ఇంజినీర్‌ వంటి టెక్నికల్‌ ఉద్యోగాల వాటా 18 శాతం, డెలివరీ వ్యక్తులు, ఎలక్ట్రిషియన్‌, ఐటీఐ ట్రైనీ వంటి ఉద్యోగాల వాటా 15 శాతంగా నమోదైంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని