భారత్‌ బయోటెక్‌ నుంచి త్వరలో కొవిడ్‌-19కు చుక్కలమందు టీకా
close

Published : 31/07/2021 05:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ బయోటెక్‌ నుంచి త్వరలో కొవిడ్‌-19కు చుక్కలమందు టీకా

3 నెలల్లో క్లినికల్‌ పరీక్షల ఫలితాలు
కొవాగ్జిన్‌తో ‘కాంబినేషన్‌’ ప్రయోగాలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 వ్యాధి నిరోధం కోసం ముక్కు ద్వారా ఇచ్చే చుక్కలమందు టీకా త్వరలో భారత్‌ బయోటెక్‌ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీకాపై నిర్వహిస్తున్న క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన సమాచారం వచ్చే రెండున్నర నెలల్లో వెల్లడవుతుందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల వివరించారు. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ విడుదల చేసిన కొవాగ్జిన్‌ టీకా ఇంజక్షన్‌తో ఇచ్చేది. ముక్కు ద్వారా, చుక్కల మందు రూపంలో టీకా ఇవ్వడం ఎంతో సౌకర్యంగా ఉండటంతో పాటు పంపిణీ ఎంతో సులువు అవుతుంది. దీన్ని ఆవిష్కరించడానికి భారత్‌ బయోటెక్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని భారత్‌ బయోటెక్‌ కుదుర్చుంది. అధిక జనాభా గల మనదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ తరహా టీకా మేలైనదని వివిధ సందర్భాల్లో డాక్టర్‌ కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు. ‘ముక్కు ద్వారా ఇచ్చే టీకాను నెలకు 10 కోట్ల డోసుల మేర ఉత్పత్తి చేయొచ్చు’ అని డాక్టర్‌ కృష్ణ ఎల్ల తాజాగా ఫిక్కీ నిర్వహించిన సదస్సులో వెల్లడించారు. ప్రస్తుతం ఇంజెక్షన్‌ ద్వారా ఇస్తున్న రెండు డోసుల కొవాగ్జిన్‌ టీకాకు బదులు.. మొదటి డోసులో కొవాగ్జిన్‌, రెండో డోసు కింద ముక్కు ద్వారా టీకా ఇస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనే అంశాన్ని నిర్ధారించుకునే యత్నాల్లో భారత్‌ బయోటెక్‌ నిమగ్నమైంది. ఈ ‘కాంబినేషన్‌ టీకా’ విషయంలో తగిన ప్రయోగాలు నిర్వహించడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ని అనుమతి కోరింది. ఈ విధానంలో సత్ఫలితాలు వస్తే, కొవిడ్‌-19 వ్యాధిని ఎదుర్కొనేందుకు మరింత సామర్థ్యం లభిస్తుందని డాక్టర్‌ కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని