విజయాన్ని లాగేసుకున్నారు

వారెవ్వా ఏం మ్యాచ్‌! ఉప్పల్‌లో ఎన్ని మలుపులో! రాజస్థాన్‌, హైదరాబాద్‌లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్‌రైజర్స్‌.. రాయల్స్‌ నుంచి విజయాన్ని లాగేసుకుంది.

Updated : 03 May 2024 06:50 IST

ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై సన్‌రైజర్స్‌ గెలుపు
మెరిసిన నితీశ్‌, భువనేశ్వర్‌

వారెవ్వా ఏం మ్యాచ్‌! ఉప్పల్‌లో ఎన్ని మలుపులో! రాజస్థాన్‌, హైదరాబాద్‌లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్‌రైజర్స్‌.. రాయల్స్‌ నుంచి విజయాన్ని లాగేసుకుంది.

మొదట 8 ఓవర్లలో 48/2తో తక్కువ స్కోరుతో సరిపెట్టుకునేలా కనిపించిన సన్‌రైజర్స్‌ను తెలుగు కుర్రాడు నితీష్‌ కుమార్‌ రెడ్డి అద్భుత ఇన్నింగ్స్‌తో రెండొందలు దాటించాడు. రాజస్థాన్‌ ఛేదనలో ఒక్క పరుగుకే రెండు వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ పట్టుబిగించేలా కనిపించింది. కానీ పరాగ్‌, యశస్విల 134 పరుగుల భాగస్వామ్యంతో రాజస్థాన్‌ గెలుపు ముంగిట నిలిచింది. ఆఖర్లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చకచకా వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ తిరిగి పుంజుకుంటే.. పావెల్‌ మెరుపు బ్యాటింగ్‌తో రాజస్థాన్‌ను గెలుపు అంచులదాకా తీసుకెళ్లాడు. ఆఖరి బంతికి రాయల్స్‌ రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. కనీసం సింగిల్‌ తీసినా ఆ జట్టు మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు తీసుకెళ్లొచ్చు. కానీ భువనేశ్వర్‌కు పావెల్‌ వికెట్ల ముందు దొరికిపోవడంతో సన్‌రైజర్స్‌ సంబరాల్లో మునిగిపోయింది.

ఈనాడు - హైదరాబాద్‌

న్‌రైజర్స్‌ దుమ్ములేపింది. వరుసగా నాలుగు విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్న రాజస్థాన్‌కు అడ్డుకట్ట వేసింది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. ట్రావిస్‌ హెడ్‌ (58; 44 బంతుల్లో 6×4, 3×6), నితీశ్‌కుమార్‌రెడ్డి (76 నాటౌట్‌; 42 బంతుల్లో 3×4, 8×6), క్లాసెన్‌ (42 నాటౌట్‌; 19 బంతుల్లో 3×4, 3×6) చెలరేగడంతో తొలుత సన్‌రైజర్స్‌ 3 వికెట్లకు 201 పరుగులు సాధించింది. రాజస్థాన్‌ 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (67; 40 బంతుల్లో 7×4, 2×6), రియాన్‌ పరాగ్‌ (77; 49 బంతుల్లో 8×4, 4×6) పోరాడినా ఫలితం లేకపోయింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ భువి (3/41) మొదటి, చివరి ఓవర్‌ అద్భుతంగా వేసి సన్‌రైజర్స్‌కు విజయాన్ని అందించాడు.

మెరిసిన జైస్వాల్‌, పరాగ్‌: 202.. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌ ముందు ఏమంత పెద్దదిగా అనిపించలేదు. కానీ ఆ జట్టును ఆరంభంలో భువనేశ్వర్‌ స్వింగ్‌ బౌలింగ్‌తో వణికించాడు. తొలి ఓవర్లో బట్లర్‌ను అలవోకగా బోల్తాకొట్టించాడు. బ్యాటును తాకుతూ వచ్చిన బంతిని మొదటి స్లిప్‌లో యాన్సెన్‌ ఒడిసి పట్టుకున్నాడు. అయిదో బంతికి కెప్టెన్‌ శాంసన్‌ను బౌల్డ్‌ చేశాడు.ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ కోలుకుంటుందని ఎవరూ అనుకోలేదు. అయితే యువ ఆటగాళ్లు యశస్వి, పరాగ్‌ కథ మార్చారు. భువి వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో రియాన్‌ పరాగ్‌ ఒక సిక్సర్‌, రెండు బౌండరీలతో 15 పరుగులు రాబట్టాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌ ఇదే దృశ్యాన్ని రిపీట్‌ చేసి 15 పరుగులు సాధించాడు. రాజస్థాన్‌ 6 ఓవర్లలో 60/2 స్కోరు సాధించింది. ఇటు యశస్వి.. అటు పరాగ్‌ పోటీపడి పరుగులు రాబట్టడంతో రాజస్థాన్‌ రన్‌రేట్‌ పదికి తగ్గకుండా సాగింది. 10 ఓవర్లలో ఆ జట్టు స్కోరు 100/2. ఇన్నింగ్స్‌ను వేగంగా ముగించాలన్న తొందర్లోనే అనవసర షాట్‌ ఆడిన యశస్వి.. నటరాజన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం పరాగ్‌ జట్టును విజయం దిశగా నడిపించాడు. అతడున్నంతసేపు రాజస్థాన్‌ విజయం తేలికగానే కనిపించింది. కానీ.. కమిన్స్‌ అతడిని ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత హెట్‌మయర్‌ (13), పావెల్‌ (27; 15 బంతుల్లో 3×4, 1×6) ధాటిగా ఆడటంతో సన్‌రైజర్స్‌కు కష్టమే అనిపించింది. హెట్‌మయర్‌ ఔటైనా భారీ షాట్‌లు ఆడగల పావెల్‌ క్రీజులో ఉండటంతో రాజస్థాన్‌దే గెలుపు అనిపించింది. అయితే ఆ జట్టు విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు అవసరమైన దశలో కమిన్స్‌.. అద్భుతమే చేశాడు. 19వ ఓవర్లో 7 పరుగులే ఇచ్చి జురెల్‌ (1)ను ఔట్‌ చేశాడు. ఆఖరి ఓవర్లో రాయల్స్‌కు 13 పరుగులు అవసరమయ్యాయి. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో వరుసగా 1, 2, 4, 2, 2 వచ్చాయి. ఆఖరి బంతికి రాజస్థాన్‌కు కావాల్సింది 2 పరుగులు. భువి యార్కర్‌ను ఆడలేక పావెల్‌ వికెట్లు ముందు దొరికిపోవడంతో హైదరాబాద్‌ సంబరాల్లో మునిగిపోయింది.

తడబాటు ప్రారంభం: గత రెండు మ్యాచ్‌ల్లో లక్ష్య ఛేదనలో చతికిలపడ్డ సన్‌రైజర్స్‌ గురువారం టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌కు మొగ్గుచూపింది. భారీ స్కోరు లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు ఆరంభంలో ఇబ్బందులు తప్పలేదు. రాజస్థాన్‌ బౌలర్లు కచ్చితమైన లైన్‌, లెంగ్త్‌తో బ్యాటర్లను పరీక్షించారు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సన్‌రైజర్స్‌ వికెట్‌ కోల్పోవాల్సింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో హెడ్‌ బ్యాట్‌ను తాకి వచ్చిన బంతి.. రియాన్‌ పరాగ్‌ చేతుల్లో నుంచి బౌండరీకి దూసుకెళ్లింది. అశ్విన్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ (12) సిక్సర్‌ కొట్టినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అవేష్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అభిషేక్‌.. సందీప్‌శర్మ ఓవర్లో అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (5) నిష్క్రమించారు. పవర్‌ ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్‌ 2 వికెట్లకు 37 పరుగులే చేసింది. 8 ఓవర్ల (48/2) వరకు కూడా సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ చప్పగా సాగింది. ఆ జట్టు 150 చేస్తే గొప్పే అనిపించింది అప్పుడు. కానీ..

భళా నితీశ్‌: చాహల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ నుంచి స్టేడియం కళకళలాడింది. ఆ ఓవర్లో హెడ్‌ రెండు సిక్సర్లు, ఒక బౌండరీతో 18 పరుగులు రాబట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. కొద్దిసేపటికే హెడ్‌ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం బాదే బాధ్యతను తెలుగబ్బాయి నితీశ్‌కుమార్‌రెడ్డి తీసుకున్నాడు. ఆరంభంలో క్రీజులో కాస్త ఇబ్బంది పడిన అతడు.. చాహల్‌ వేసిన 13వ ఓవర్లో జోరందుకున్నాడు. ఆ ఓవర్లో రెండేసి సిక్సర్లు, బౌండరీలతో చెలరేగి 21 పరుగులు పిండుకున్నాడు. స్కోరు బోర్డు దూసుకెళ్తున్న సమయంలో హెడ్‌ను బౌల్డ్‌ చేసిన అవేశ్‌.. 96 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత నితీశ్‌కు క్లాసెన్‌ తోడవడంతో పరుగుల వేగం మరింత పెరిగింది. 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన నితీశ్‌ సాధికారిక షాట్లతో అలరించాడు. అశ్విన్‌ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. చాహల్‌ వేసిన తర్వాతి ఓవర్లో తొలి రెండు బంతుల్ని క్లాసెన్‌ సిక్సర్లుగా మలిచాడు. ఇలా ఆఖరి వరకు క్లాసెన్‌, నితీశ్‌ బౌలర్లకు చుక్కలు చూపించడంతో సన్‌రైజర్స్‌ 200 పరుగుల మైలురాయిని అధిగమించింది. తొలి 8 ఓవర్లలో 48 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌.. తర్వాతి 12 ఓవర్లలో 153 పరుగులు రాబట్టడం విశేషం. ఆ జట్టు చివరి 5 ఓవర్లలో ఒక్క వికెట్‌ కోల్పోకుండా 70 పరుగులు చేసింది. నితీశ్‌, క్లాసెన్‌ నాలుగో వికెట్‌కు అజేయంగా 32 బంతుల్లో 70 పరుగులు జోడించారు. ఈ సీజన్‌లో 200 పరుగులు సాధించడం సన్‌రైజర్స్‌కు ఇది అయిదో సారి.

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) అవేష్‌ 58; అభిషేక్‌ (సి) జురెల్‌ (బి) అవేష్‌ 12; అన్మోల్‌ప్రీత్‌ (సి) జైస్వాల్‌ (బి) సందీప్‌ 5; నితీశ్‌ నాటౌట్‌ 76; క్లాసెన్‌ నాటౌట్‌ 42; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201; వికెట్ల పతనం: 1-25, 2-35, 3-131; బౌలింగ్‌:  బౌల్ట్‌ 4-0-33-0; అశ్విన్‌ 4-0-36-0; అవేష్‌ 4-0-39-2; సందీప్‌ 4-0-31-1; చాహల్‌ 4-0-62-0

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) నటరాజన్‌ 67; బట్లర్‌ (సి) యాన్సెన్‌ (బి) భువనేశ్వర్‌ 0; శాంసన్‌ (బి) భువనేశ్వర్‌ 0; పరాగ్‌ (సి) యాన్సెన్‌ (బి) కమిన్స్‌ 77; హెట్‌మయర్‌ (సి) యాన్సెన్‌ (బి) నటరాజన్‌ 13; పావెల్‌ ఎల్బీ (బి) భువనేశ్వర్‌ 27; జురెల్‌ (సి) అభిషేక్‌ (బి) కమిన్స్‌ 1; అశ్విన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200; వికెట్ల పతనం: 1-1, 2-1, 3-135, 4-159, 5-181, 6-182, 7-200; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-41-3; యాన్సెన్‌ 4-0-44-0; కమిన్స్‌ 4-0-34-2; నటరాజన్‌ 4-0-35-2; ఉనద్కత్‌ 2-0-23-0; నితీశ్‌ 1-0-12-0; షాబాజ్‌ 1-0-11-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు