ఐపీఎల్ సీజన్లో ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!

మా పెళ్లై నాలుగేళ్లవుతోంది. నా భర్తకు, నాకు ఎలాంటి విభేదాలు లేవు. నా భర్త ఉన్నత విద్య అభ్యసించి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. మంచి వ్యక్తి కూడా. కానీ, అతనికున్న సమస్యల్లా బెట్టింగ్ అలవాటే. మావారికి బెట్టింగ్‌లంటే విపరీతమైన పిచ్చి. ఈ వ్యసనం వల్ల చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు.

Published : 26 May 2024 18:04 IST

మా పెళ్లై నాలుగేళ్లవుతోంది. నా భర్తకు, నాకు ఎలాంటి విభేదాలు లేవు. నా భర్త ఉన్నత విద్య అభ్యసించి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. మంచి వ్యక్తి కూడా. కానీ, అతనికున్న సమస్యల్లా బెట్టింగ్ అలవాటే. మావారికి బెట్టింగ్‌లంటే విపరీతమైన పిచ్చి. ఈ వ్యసనం వల్ల చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఓ సందర్భంలో వాటి కోసం ఏకంగా మూడు లక్షల రూపాయల అప్పు చేశాడు. ఆ డబ్బులు కూడా బెట్టింగ్‌లో పోయాయి. ఈ విషయం తెలిసి నా భర్తను అడిగాను. మళ్లీ బెట్టింగ్‌ల జోలికి వెళ్లనని నాకు ప్రామిస్‌ చేశాడు. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి మళ్లీ మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌ సీజన్లో మొత్తం సమయమంతా దాని పైనే వెచ్చిస్తున్నాడు. ఈ విషయాల గురించి మా ఇరు కుటుంబ పెద్దలకు తెలియదు. వాళ్లంతా నా భర్త వచ్చిన జీతాన్ని పొదుపు చేస్తున్నాడని భావిస్తున్నారు. ఒకవేళ ఈ విషయం తెలిస్తే షాక్‌కు గురవడమే కాకుండా; వయసు రీత్యా వారి ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి? నా భర్తలో మార్పు తీసుకురావడం ఎలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఈ మధ్య కాలంలో బెట్టింగ్‌ యాప్‌లకు బానిసలుగా మారి చాలామంది ఆర్థికంగా దివాళా తీస్తున్నారు. ఫలితంగా వారు మాత్రమే కాకుండా వారి కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి. కొంతమంది వీటి వల్ల చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలను కూడా చూస్తున్నాం. కాబట్టి, మీ భర్త ఇప్పటికైనా దాన్నుంచి బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఎంతో అవసరం.

మీ భర్త బెట్టింగ్‌ అలవాటు వల్ల కుటుంబం రోడ్డున పడుతుందేమోనని మీకు భయం, ఆందోళన ఉండడం సహజం. అయితే ఈ విషయం గురించి అతనితోనే మరోసారి చర్చించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో బెట్టింగ్‌ అలవాటు వల్ల మీకు, కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో స్పష్టంగా వివరించండి. సాధ్యమైనంత వరకు అతని తప్పులను ఎత్తిచూపకుండా సంయమనంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. బెట్టింగ్‌ అలవాటు తప్ప మీ భర్తతో ఇతర ఇబ్బందులేవీ లేవని అంటున్నారు. కాబట్టి, దాన్నుంచి బయటపడడానికి మీ నుంచి పూర్తి సహకారం అందిస్తానన్న ధైర్యాన్ని అతనికి ఇవ్వండి. దానివల్ల అతనిలో మార్పు వస్తుందేమో గమనించండి.

మీ భర్త ఇదే అలవాటును కొనసాగిస్తే కచ్చితంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ముందుగానే మానసికంగా సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు కూడా జాబ్‌ చేస్తున్నట్లయితే కొంత మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అలాగే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగ సాధన చేయండి. ఈ విషయాల గురించి ఇప్పటివరకు ఇరు కుటుంబాల వారికి చెప్పలేదని అంటున్నారు. దానికి గల కారణాలను కూడా వివరించారు. అయితే పరిస్థితులు చేయిదాటక ముందే కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, వారికి కూడా మీ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయండి. దానివల్ల వారి నుంచి కూడా సహాయం లభించే అవకాశం లేకపోలేదు. అప్పటికీ మీ భర్త పరిస్థితిలో మార్పు రాకపోతే ఒకసారి కౌన్సెలింగ్‌ ఇప్పించండి. వారు తగిన సలహా/సూచనలు ఇస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్