సహాయ దర్శకుడైనా.. సెట్‌లో టీ సర్వ్ చేశారు! - Krish Jagarlamudi birthday story
close
Updated : 10/11/2020 09:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సహాయ దర్శకుడైనా.. సెట్‌లో టీ సర్వ్ చేశారు!

బర్త్‌డే స్పెషల్‌: క్రిష్‌ సినీ ప్రయాణం

క్రిష్‌ జాగర్లమూడి.. తీసింది తొమ్మిది సినిమాలే అయినా.. అందులో ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి ముత్యాల్లాంటి చిత్రాలున్నాయి. ఆయన సినిమాలు ప్రేక్షకుల్ని ఆలోచిపంజేసి, తెలియని భావోద్వేగానికి గురి చేస్తాయి. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. పట్టుదల.. కృషి.. అంకితభావంతో కెరీర్‌లో ముందుకు వచ్చిన క్రిష్‌ మంగళవారం పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఆయన సినిమాను ఎందుకు కెరీర్‌గా ఎంచుకున్నారు?, తొలి అవకాశం ఎలా వచ్చింది? తదితర ఆసక్తికర విషయాలు మీ కోసం.. 

గమ్మత్తయిన వాతావరణంలో..

క్రిష్‌ పుట్టి, పెరిగిందంతా గుంటూరులోనే. తాతగారు జాగర్లమూడి రమణయ్య పోలీసు అధికారి. ఆయనకి ఆరుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మనవళ్లు మనవరాళ్లందరిలో క్రిష్‌ పెద్దవాడు కావడంతో తాతయ్యతో ఎక్కువ అనుబంధం ఉండేది. రమణయ్య పొద్దున్నే న్యూస్‌ పేపర్‌ క్రిష్‌ చేతికిచ్చి, మొత్తం తిరిగి రాయించేవారట. చందమామ పుస్తకం వచ్చిందంటే మొత్తం మళ్లీ క్రిష్‌తో రాయించి.. ఇంటికి వచ్చిన తర్వాత కథలన్నీ వినేవారు. అలా కథలు రాసే గుణం క్రిష్‌కు అలవడింది. ఆయన అత్త కృష్ణవేణి.. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసొచ్చిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టుకుని టైటిల్‌ నుంచి నేపథ్య సంగీతం వరకు మొత్తం వివరించేవారట. కథ చెప్పే అలవాటు ఆమె దగ్గరి నుంచి వచ్చింది. 

ఓ బాబాయి క్రిష్‌కు హేతువాద పుస్తకాలు తెచ్చేవారు. ఇంకొక బాబాయి తనతోపాటు సినిమాలకు తీసుకెళ్లేవారు. ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబాకు సినిమాలంటే ఇష్టం. ఓ ఊరిలో సినిమా థియేటర్‌ రన్‌ చేసి, వర్కౌట్‌ కాక వదిలేశారు. అలా.. క్రిష్‌ గమ్మత్తయిన వాతావరణంలో, ఉమ్మడి కుటుంబంలో పెరిగారు. తొమ్మిదో తరగతిలో ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి ‘శివ’ సినిమా చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లారట. విషయం తెలుసుకున్న ఆయన తండ్రి ‘సినిమా ఎలా ఉంది?’ అని ప్రశ్నించారు. క్రిష్‌ నిజం చెప్పకుండా.. తెలియదన్నట్లు ముఖం పెట్టడంతో.. వాళ్ల నాన్న కొట్టారట.

అమెరికాకు..

ఇంటర్‌ తర్వాత ఫార్మసీ చదవడానికి క్రిష్‌ విజయవాడ సిద్ధార్థ్‌ కాలేజీలో చేరారు. అక్కడ ఆయనకు ఇంకో ప్రపంచం పరిచయమైంది. విద్యార్థులు గ్రూపులు గ్రూపులుగా విడిపోయి.. కారణం లేకుండా గొడవపడేవారట. ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలిసి తిరిగిన ఆయనకు ఆ కొట్లాటలు నచ్చలేదు. ఇబ్బందిగా ఫీల్‌ అవుతూనే రెండేళ్లు పూర్తి చేశారు. పుస్తకాలు చదువుతూ.. మరో రెండేళ్లు గడిపారు. ఆపై ఎంఎస్‌ ఫార్మసీ చదవుకోవడానికి అమెరికా వెళ్లారు. అమ్మకు, జన్మభూమికి దూరంగా ఉండటంతో పుస్తకాలు ఇంకా ఎక్కువ చదివేవారట. సినిమాలు కూడా బాగా చూడటం మొదలుపెట్టారు. ‘అమెరికాలో నాలాంటి ఆలోచనలు ఉన్న రూమ్మేట్స్‌ దొరికారు. రాజీవ్‌రెడ్డి (‘గమ్యం’ నిర్మాత), కాట్రగడ్డ సిద్ధార్థ (సారథి స్టూడియో పాపయ్యగారి అబ్బాయి), శ్యాం చింతా, దేవా.. మేమంతా పుస్తకాలు, సినిమాల గురించి చర్చించుకునేవాళ్లం. అమెరికా వచ్చిన నా ఇంటర్‌ క్లాస్‌మేట్‌.. నా కథలు విని, వెన్నుతట్టేవాడు. ఇలాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టం’ అని ఓ సారి క్రిష్‌ చెప్పారు.

ఫిక్స్‌ అయ్యారు..

స్నేహితుల ప్రోత్సాహంతో క్రిష్‌లో నమ్మకం ఇంకా పెరిగింది. అలా అమెరికాలో ఉన్నప్పుడు ఓ కథ రాసి, సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ వర్కౌట్‌ కాకపోవడంతో.. ఇండియా వచ్చేశారు. సినిమా తీయాలని గట్టిగా ఫిక్స్‌ అయినప్పటికీ.. ముందు జాగ్రత్తగా తన స్నేహితుడు రాజీవ్‌తో కలిసి ‘ఫస్ట్‌ బిజీ సొల్యూషన్స్‌’ అనే కంపెనీ మొదలుపెట్టారు. అది బాగా జరుగుతున్న సమయంలో స్నేహితుడికి అప్పగించి, సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా..

అదే సమయంలో రసూల్‌ ‘ఒకరికొకరు’ సినిమా తీస్తుంటే క్రిష్‌ సహాయ దర్శకుడిగా చేరారు. పేరుకు ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయినప్పటికీ.. ప్రతి పని చేశారట. ఆఫీస్‌ బాయ్‌ రాకపోతే సెట్‌లో టీ కూడా సర్వ్‌ చేశారు. ఏదో రాయాలి, ఏదో చేయాలనే తపన మాత్రం ఆయనలో ఇంకా పెరిగింది. బాలీవుడ్‌ సినిమా కోసం గాంధీ-గాడ్సేల కథ రాయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే పరిశోధనల కోసం పుణె, నాగ్‌పూర్‌, సాంగ్లి.. అన్నీ ప్రదేశాలు చుట్టారు. కారు డ్రైవర్‌ బుజీద్‌ ఆయన్ను అన్నీ చోట్లకు తిప్పారు. ఈ ప్రయాణంలో ఓ రోజు సాంగ్లిలో ఎంత వెతికినా మినరల్‌ వాటర్‌ దొరకలేదట. ‘‘బుజీద్‌ మాత్రం రోడ్డు పక్కన ఉన్న బోరు నీళ్లు తాగాడు. నేను తాగనని చెప్పా. అంతేకాదు ఆరోగ్యం గురించి క్లాస్‌ తీసుకున్నా. చివరికి అతను ఓ మాట అన్నాడు. ‘బాటిల్‌ వాటర్‌ లేనిదే నడవని జీవితం.. అదేం జీవితం సర్‌’ అని అడిగాడు. ఎంతో తెలివైన వాణ్ణి అనుకుని.. ఆ ప్రయాణమంతా అతనితో ఎంతో జ్ఞానాన్ని పంచుకున్నా. కానీ అతడు ఆ ఒక్క మాటలో జీవిత సారాంశం చెప్పేశాడు. ఆ ప్రయాణం నా జీవితంలో ఎన్నో ఆశల్ని రేకెత్తించింది’’ అని క్రిష్‌ చెప్పారు.

‘గమ్యం’ పుట్టింది..

అప్పుడే బాలీవుడ్‌ డ్రీమ్స్‌ని పక్కనపెట్టి.. తిరిగి హైదరాబాద్‌కు రావాలని క్రిష్‌ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో షోలాపూర్‌లో ఆగిపోయి, తెల్లపేపర్లు తెప్పించుకుని, డ్రైవర్‌ను వెనక్కి పంపేశారు. ఓ చిన్న హోటల్‌లో బస చేసి, ‘గమ్యం’ కథ రాశారు. ‘నా సినిమాను ఎలా తీయబోతున్నాననే విషయం నాకు తెలుసు. నా ప్లాన్‌ను నిర్మాతలు అర్థం చేసుకోలేరు కదా. అందుకే నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి తమ్మారెడ్డి భరద్వాజ సాయంతో సినిమాను బయటికి తీసుకురాగలిగాం. ఈ సినిమా సక్సెస్‌ అవకపోతే తిరిగి అమెరికా వెళ్లిపోవాలనేది మా అమ్మానాన్నలతో అగ్రిమెంట్‌’ అని ఓసారి క్రిష్‌ గుర్తు చేసుకున్నారు.

సినిమా సక్సెస్‌..

‘గమ్యం’ విడుదలైంది, థియేటర్‌లో ప్రేక్షకులు ఈలలు వేసి, చప్పట్లు కొట్టారు. ఇంకేముంది క్రిష్‌ కెరీర్‌ విజయవంతంగా మొదలైంది. ‘వేదం’ సినిమా సినీ ప్రపంచానికి ఆయన్ను గొప్పగా పరిచయం చేసింది. ‘‘వేదం’కి శోభు, నేను, అనుష్క, అల్లు అర్జున్‌.. నలుగురం నాలుగు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నాం. అవి నేను మరిచిపోలేని రోజులు..’ అని ఓసారి క్రిష్‌ అన్నారు. కులం, మతం కాదు.. మనుషులు ముఖ్యమని చెప్పిన ‘కంచె’ జాతీయ అవార్డు సొంతం చేసుకుంది.

బాలకృష్ణ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చారిత్రక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ దర్శకుడిగా క్రిష్‌ స్థాయిని మరింత పెంచింది. కేవలం 100 రోజుల్లో ఎన్టీఆర్‌ జీవిత కథని తెరపైకి తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. బాలీవుడ్‌ హిట్‌ ‘మణికర్ణిక’ తర్వాత ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌తో చిత్రం తీయబోతున్నట్లు క్రిష్‌ ప్రకటించారు. ‘పవన్‌ కల్యాణ్‌ గారితో షూటింగ్ చిత్ర బృందం మొత్తానికి ప్రతి క్షణం ఓ గొప్ప జ్ఞాపకంలా మారుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది’ అని ఇటీవల క్రిష్‌ పేర్కొన్నారు. మరోవైపు పవన్‌ సినిమాకు కాస్త విరామం రావడంతో వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లో ఓ సినిమాను పట్టాలెక్కించారు క్రిష్‌. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలెన్నో ఆయన తీయాలని కోరుకుంటూ క్రిష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని