కథా మహత్యం.. కొత్త నేపథ్యం - Story On Movie Scripts And New Concepts
close
Published : 11/11/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కథా మహత్యం.. కొత్త నేపథ్యం

స్టార్‌ హీరో సినిమా అంటే... ఎక్కడైనా వాణిజ్య సూత్రాలకు అనుగుణంగా సాగాల్సిందే! తెలుగు స్టార్ల పరిస్థితి మరింత భిన్నం. వాళ్లకున్న ఇమేజ్‌... అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని దర్శకులు కథలు వండి వార్చాల్సిందే. ఆ క్రమంలో హీరోయిజం... ఆరు ఫైట్లు... ఆరు పాటలు... ఇలాంటి లెక్కల తర్వాతే అసలు కథ గురించి ఆలోచించాల్సి వస్తుంది. దాంతో ఏ హీరో సినిమా చూసినా ఒకే టెంప్లేట్‌తో సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇదంతా ఒకప్పటి మాట.  దర్శకులు, ప్రేక్షకుల ఆలోచనల్లోనూ అభిరుచుల్లోనూ మార్పులు రావడంతో ఇటీవల కథలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. భిన్న నేపథ్యాల్ని స్పృశిస్తూ ప్రేక్షకులకు కొత్త రకమైన వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. హీరోలూ ఆ తరహా కథల్ని ప్రోత్సహిస్తున్నారు.

హీరో అంటే స్టైల్‌గానే ఉండాలి. ఎంత వెతికినా ఒక్క లోపం కనిపించకూడదు. ఎన్ని ఫైట్లు చేసినా చొక్కా నలక్కూడదనే నియమాల్ని ఎప్పుడో పక్కన పెట్టేశారు మన కథానాయకులు. భూమార్గం పట్టిన కథల్ని, పాత్రల్నే ఎంచుకుంటూ ప్రయాణం    చేస్తున్నారు. అవసరం అనుకున్నప్పుడంతా ఇమేజ్‌ని సైతం పక్కన పెట్టేస్తున్నారు. దాంతో దర్శకులు మరింత సహజమైన, కొత్త రకమైన కథల్ని వండి వారుస్తున్నారు. ఆ క్రమంలో కొత్త నేపథ్యాలు వెలుగు చూస్తున్నాయి. ఇదివరకు తెరపై చూడని కథ, కథనాల్ని ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు లభిస్తోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న అగ్ర కథానాయకుల చిత్రాలన్నీ భిన్న నేపథ్యాల్ని ఆవిష్కరించేవే. ఎంచుకున్న కథల మధ్య పోలిక ఏమాత్రం కనిపించడం లేదు.

పీరియాడిక్‌ కథలు

కొంత కాలంగా తెలుగులో పీరియాడిక్‌ కథల సందడి మెండుగా కనిపిస్తోంది. వర్తమానంలో సాగే కథలు కాకుండా, వెనుకటి రోజులకి వెళ్లి అప్పటి గాథల్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు. దాంతో ఆ సినిమాలు ప్రత్యేకతని సంతరించుకుంటున్నాయి. అవి ప్రేక్షకులకు కొత్త  దనాన్ని పంచుతున్నాయి. సాధారణంగా ప్రేమకథలంటే ట్రెండ్‌కి తగ్గట్టుగానే ఉంటాయి. ప్రభాస్‌ నటిస్తున్న ప్రేమకథ  1970 కాలాన్ని ఆవిష్కరించబోతోంది. ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ ఆనాటి అందాలను ఆవిష్కరిస్తూ, యూరప్‌ నేపథ్యంలో తెరకెక్కుతుండడం విశేషం. రాధాకృష్ణ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

* ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులుగా అగ్ర దర్శకులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ పీరియాడిక్‌ కథతో తెరకెక్కుతున్నదే. 1920 కాలాల్ని ఆవిష్కరించే చిత్రమిది. రాజమౌళి చిత్రం అంటే నేపథ్యమే కాదు, వాటిలోని భావోద్వేగాలూ ప్రత్యేకమే. కథానాయకుల్ని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లుగా చూపిస్తుండడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

* వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘నారప్ప’ 1980కి ముందు జరిగే కథే. ఇదొక కొత్త రకమైన నేపథ్యాన్ని ఆవిష్కరించబోతోంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమూ పీరియాడిక్‌ కథతో రూపొందుతున్నదే. రానా * ‘విరాటపర్వం’ 1990ల్లో సాగే కథ. ఇవన్నీ పాత కాలంలోకి వెళ్లిన కథలే అయినా ఒకొక్కటి ఒక్కో అనుభూతిని పంచుతూ, ఒక్కో నేపథ్యాన్ని ఆవిష్కరించబోతున్నాయి.

అమెరికా.. అడవి...

మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కార్‌ వారి పాట’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ కథ కొంత భాగం అమెరికా నేపథ్యంలో సాగబోతోంది. మహేష్‌బాబు, అమెరికా నేపథ్యం అంటే ఆ హంగామా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆత్రుతని కలిగిస్తోంది.

*స్టైల్‌కి పెట్టింది పేరైన అల్లు అర్జున్‌ ఈసారి ఊర మాస్‌ అంటున్నారు. ఆయన నటిస్తున్న ‘పుష్ప’ అడవి నేపథ్యంలో సాగే కథ. ఎర్రచందనం అక్రమ రవాణా చుట్టూ ఈ కథని అల్లారు దర్శకుడు సుకుమార్‌. ఇంతవరకూ ఈ నేపథ్యంలో సినిమా రాకపోవడం గమనార్హం.

*సీనియర్‌ హీరోలు చిరంజీవి, నాగార్జున మరో రకమైన రుచుల్ని పంచబోతున్నారు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ‘ఆచార్య’ పోరుబాట నేపథ్యంలో సాగే కథ. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ‘వైల్డ్‌డాగ్‌’ ఉగ్రవాదం ప్రధానాంశంగా రూపొందుతున్న కథ.

*స్టార్‌ హీరోలే ఇలాంటి భిన్నమైన దారుల్లో వెళుతున్నారంటే, ఇక యువతరం మాట ప్రత్యేకంగా చెప్పాలా? వాళ్లు మరింత స్వేచ్ఛగా కథల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రల్ని సైతం స్వీకరిస్తూ కొత్తదనం అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రపంచం అరచేతిలోకి వచ్చిన సమయంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. మన హీరోలు సైతం ఆ బాట పట్టి వారిని మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని