గంటల్లోనే నిందితుడి గుర్తింపు
eenadu telugu news
Published : 28/09/2021 03:21 IST

గంటల్లోనే నిందితుడి గుర్తింపు

సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రశాంతి

గోరంట్ల(గ్రామీణ గుంటూరు), న్యూస్‌టుడే: గోరంట్ల సమీపంలో ఓ వృద్ధురాలి నుంచి బంగారు గొలుసు చోరీ చేసి పరారైన దొంగ ఆచూకీని నల్లపాడు పోలీసులు ఎనిమిది గంటల్లోనే గుర్తించారని, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తక్కువ సమయంలోనే నిందితుడిని పట్టుకున్నారని డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. గుంటూరులోని కార్యాలయంలో దక్షిణ మండల డీఎస్పీ ప్రశాంతి ఈ కేసు వివరాలు సోమవారం మీడియాకు వెల్లడించారు. స్వర్ణభారతినగర్‌కు చెందిన బుర్రా దయాకర్‌ (21) వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడేవాడు. గతంలో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. గోరంట్లలోని యాదవుల బజార్‌కు చెందిన గోళ్ల వెంకటేశ్వరమ్మ ఈ నెల 26న మధ్యాహ్నం ఒంటరిగా పశువులు కాస్తుంది. కొద్దిసమయం రెక్కీ నిర్వహించిన నిందితుడు దయాకర్‌ అదను చూసుకుని వెంకటేశ్వరమ్మపై భౌతిక దాడి చేసి 32 గ్రాముల బంగారు గొలుసు చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో వృద్ధురాలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీని ఎనిమిది గంటల్లోనే గుర్తించారు. ఈ నెల 27న సాయంత్రం 4 గంటలకు అమరావతి రోడ్డులో నిందితుడు దయాకర్‌ బంగారు గొలుసును విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిందితుడి నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు పరిష్కారంలో వేగంగా స్పందించిన పోలీసు సిబ్బంది షేక్‌ జాన్‌సైదా, కిరణ్‌కుమార్‌, డి.పోతురాజులను డీఎస్పీ ప్రశాంతి అభినందించారు. సమావేశంలో నల్లపాడు సీఐ ప్రేమయ్య, ఎస్‌ఐ కిషోర్‌ తదితర సిబ్బంది ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని