3-5తరగతుల... విలీనం షురూ..!
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

3-5తరగతుల... విలీనం షురూ..!

250 మీటర్ల దూరంలో 243 బడులు
సర్దుబాటుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు
ఈనాడు-అమరావతి

న్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఈ నెలాఖరు లోపు విలీనం చేయాలని ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 250 మీటర్ల దూరంలో ఉన్న వాటిని తక్షణమే విలీనం చేయడానికి చర్యలు తీసుకోవాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. విలీనానికి సరిపడా గదులు ఉన్నాయా లేవా అనే వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు మంగళవారం కొందరు ప్రధానోపాధ్యాయులకు ఫోన్లు చేసి సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 243 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేయడానికి గతంలోనే మ్యాపింగ్‌ చేసి వివరాలను కమిషనరేట్‌కు పంపారు.

నవంబరు ఒకటి నుంచి రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఎస్జీటీ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని సూచించింది. అనేక గ్రామాల్లో ఉన్నత పాఠశాలల్లోనే ప్రాథమిక పాఠశాలలు నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఇలా వేర్వేరుగా ఉన్నాయి. జిల్లాలో ఇవి ఎన్ని ఉన్నాయో ఇంతకుముందే అధికారులు గుర్తించి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. సోమవారం రాత్రి అందరు డీఈఓలను నెలాఖరుకల్లా  3-5 తరగతుల విలీనం, ఎస్జీటీ ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు అయినా జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం కార్యాలయంలోనే ఉండి కార్యాచరణ రూపొందించారు.


బడి ఒకచోట.. టీచర్‌ ఒకచోట

3, 4, 5 తరగతులకు ఇకమీదట స్కూల్‌ అసిస్టెంట్లు లేదా సీనియర్‌ ఎస్‌జీటీలతో బోధన చేయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం తరగతుల విలీనం నేపథ్యంలో ఎక్కడైనా గదుల సమస్య ఉంటే ఆ పిల్లలను ప్రాథమిక పాఠశాలలోనే ఉంచి అక్కడకు ఉన్నత పాఠశాల నుంచి టీచర్లను పంపి విద్యా బోధన చేయిస్తామని చెబుతోంది.
విలీనం సరే.. టీచర్లు ఏరీ?
3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించి వారికి సబ్జెక్టు టీచర్లయిన స్కూల్‌ అసిస్టెంట్లతో బోధన చేయిస్తామని విద్యాశాఖ చెబుతోంది. అంతమంది సబ్జెక్టు టీచర్లు చాలా ఉన్నత పాఠశాలల్లో లేరని, ఖాళీలు పేరుకుపోయాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉపాధ్యాయులపై పనిభారం పడుతుందని, విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తగ్గుతుందని చెబుతున్నారు. ఎస్‌జీటీలను ఉన్నత పాఠశాలల్లో చేర్చుకుని వారితో బోధన చేయించటం కూడా సరైన విధానం కాదని పలు సంఘాల నేతలు అంటున్నారు.
విద్యా శాఖ వర్గాలు మాత్రం ఎక్కడైతే టీచర్ల కొరత ఉందో అక్కడకు ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్లను త్వరలోనే బదిలీపై సర్దుబాటు చేసి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం ఉన్నత పాఠశాలలకు, ప్రాథమిక విద్యార్థులకు వేర్వేరు సమయాల్లో పెడుతున్నారు. 3వ తరగతి నుంచే ఉన్నత పాఠశాలగా పరిగణిస్తే అప్పుడు చిన్న పిల్లలకు, పెద్దపిల్లలకు వేర్వేరుగా రెండుసార్లు పెట్టడం అసాధ్యమని, ఇలాంటి అనేక ఇబ్బందులపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని పలువురు హెచ్‌ఎంలు వెలిబుచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని