ఉల్లంఘిస్తే.. ఊరుకోరు!
logo
Published : 12/05/2021 03:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉల్లంఘిస్తే.. ఊరుకోరు!

లాక్‌డౌన్‌ అమలుకు 15వేల మంది పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బుధవారం నుంచి పోలీసులు కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేయనున్నారు. మూడు పోలీస్‌ కమిషనరేట్లలో 15వేల మంది విధులు నిర్వహించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టేందుకు, వాహనాలు తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్‌ చేసేందుకు 308 ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.

నగరం నుంచి వెళితే..

హైదరాబాద్‌ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఎందుకు వెళ్తున్నారో వివరిస్తూ సంబంధిత పోలీస్‌ కమిషనరేట్‌ వెబ్‌సైట్‌లో ఈ-పాస్‌లో దరఖాస్తు చేసుకుంటే పోలీసులు పరిశీలించి ఒకవైపు ప్రయాణానికి మాత్రమే ఈ-పాస్‌ జారీ చేస్తారు.

ఆసుపత్రులకు వెళ్లాలంటే..

కొవిడ్‌ టీకా, పరీక్షలు చేయించుకునే వారు ఉదయం పదిగంటలలోపు మాత్రమే వెళ్లాలి. వచ్చేప్పుడు ఆసుపత్రుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. లాక్‌డౌన్‌ సమయంలో వెళ్లాల్సి ఉంటే ముందస్తు అనుమతి పత్రాలు చూపించాలి. అత్యవసర ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లేవారు రోగికి సంబంధించిన పాత రిపోర్టులు చూపించాలి.

* రైళ్లు, విమానాల్లో వచ్చేవారు ప్రయాణ టిక్కెట్లతో పాటు వారి హోదా ధ్రువీకరణ పత్రాలు లేదా ఆధార్‌కార్డు పోలీసులకు చూపించాలి.

సమయం దాటితే.. చట్టం ప్రకారం..

ఉదయం పదిగంటల తర్వాత అత్యవసర వాహనాలు, అంబులెన్సులు మినహా ఎవరు రోడ్లపైకి వచ్చినా విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు.

వైరస్‌ కట్టడికి సహకరించండి

అంజనీకుమార్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించింది. నగర ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించండి. రోజుకు నాలుగు గంటలపాటు నిత్యావసర వస్తువులు, ప్రజారవాణా ఇతర సేవలు అందుబాటులో ఉంటాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టనున్నాం.

ప్రశాంతంగా మీ పనులు పూర్తి చేసుకోండి..

మహేష్‌ భగవత్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌

హడావుడిగా కాకుండా ప్రశాంతంగా మీ పనులు పూర్తిచేసుకోండి. అత్యవసరమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వండి. రైతుబజార్లు, రేషన్‌ దుకాణాలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌కు గుంపులుగా వెళ్లకూడదు. ఎలాంటి ఇబ్బందులున్నా మీరు 9490617234కు ఫోన్‌ చేయండి.

మీకు సాయంగా ఉంటాం:

వీసీ సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

లాక్‌డౌన్‌ సమయంలో అనూహ్యంగా అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమైతే మీకు సాయంగా ఉంటాం. వేర్వేరు అవసరాలు, ప్రజలకు సేవ చేయాల్సిన రంగాలను ప్రభుత్వం మినహాయించింది. లాక్‌డౌన్‌ సమయంలో వాహనాలపై వెళ్తున్నవారు విధిగా ధ్రువీకరణ పత్రాలను వెంటతీసుకెళ్లండి. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారి వద్ద తప్పనిసరిగా ఈ-పాస్‌ ఉండాలి. సందేహాలుంటే 9490617440కు ఫోన్‌ చేయండి.

పెళ్లి ముహూర్తమా..?

ముందుగా నిర్ణయించిన పెళ్లి ముహూర్తాల ప్రకారం లాక్‌డౌన్‌ సమయంలో ఉంటే.. కాబోయే వధూవరుల తల్లిదండ్రులు లేదా బంధువులు సంబంధిత తహసీల్దార్‌తో పాటు పోలీస్‌ఠాణా ఇన్‌స్పెక్టర్‌ లేదా ఏసీపీ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలి. రెండువైపులా 40మంది మాత్రమే హాజరుకావాలి. ఇతర రాష్ట్రాల నుంచి పెళ్లికి వచ్చేవారు అక్కడి నుంచి ఈ-పాస్‌ తీసుకురావాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని