టిడ్కో...పూర్తయ్యేది ఎప్పటికో?
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

టిడ్కో...పూర్తయ్యేది ఎప్పటికో?

లబ్ధిదారులు చేరకముందే శిథిలమైన పేదల గృహాలు

భవన సముదాయాల వద్ద కానరాని మౌలిక వసతులు

చాలా చోట్ల పునాదుల దశలోనే నిలిచిపోయిన ఇళ్లు

- ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, జమ్మలమడుగు, రాయచోటి

కడప: సరోజినినగర్‌లోని గృహసముదాయం వద్ద బురదమయంగా మట్టి రహదారి

టిడ్కో గృహ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పట్టణాల్లోని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గృహసముదాయ నిర్మాణం చేపట్టాయి. జిల్లాలోని ఏడు పురపాలక సంఘాల్లో తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన గృహ నిర్మాణ పనులు నేటికీ వివిధ దశల్లోనే దర్శనమిస్తున్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయాయి. సుమారు రెండేళ్లు గడుస్తున్నా ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినా మౌలిక వసతులు కల్పించలేదు. చాలాకాలంగా నిరుపయోగంగా ఉండడం, నిర్వహణను పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు చేరకముందే శిథిలావస్థకు చేరుతున్నాయి.

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను మూడు దశల్లో చేపట్టారు. తొలి దశలో రూ.229.52 కోట్లు, రెండో దశలో రూ.725.02 కోట్లు, మూడో దశలో రూ.107.08 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. మొదటి రెండు దశల్లోని పనులను హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీసీ, చివరి దశ పనులను సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ దక్కించుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ రెండు సంస్థలు పనులు మొదలుపెట్టి ప్రగతి చూపాయి. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వీటి కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది. 25 శాతం లోపు ప్రగతి నమోదైన ఇళ్ల నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంతో కంగుతిన్న గుత్తేదారులు మొత్తం పనులను నిలిపివేశారు. రెండో దశలో ఎన్‌సీసీ సంస్థకు కేటాయించిన వాటిలో మధ్యలో ఆగిపోయిన 3,124 ఇళ్ల నిర్మాణ పనులను కొనసాగించేందుకు రివర్స్‌ టెండరింగ్‌ విధానం చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన దాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ నెల్లూరు, కడప జిల్లాల్లో పనులు దక్కించుకుంది. ఇప్పటికే ఆ సంస్థ నెల్లూరు జిల్లాలో పనులు మొదలుపెట్టినా, జిల్లాలో మాత్రం ఇంతవరకు ప్రారంభించలేదు.

కడప: చలమారెడ్డిపల్లెలో అడవిని

తలపిస్తున్న గృహసముదాయ పరిసరాలు

ఇళ్లు నిర్మించక... సొమ్ములు చెల్లించక!

ఎర్రగుంట్ల నగర పంచాయతీకి మొత్తం 2,046 ఇళ్లు మంజూరయ్యాయి. రూ.4.15 కోట్లతో చేపట్టిన 1,776 ఇళ్లు పునాది దశలో నిలిచిపోయాయి. మరో 270 ఇళ్ల నిర్మాణం ప్రారంభించ లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పునాదుల్లో వర్షపు నీరు చేరి దెబ్బతింటున్నాయి. ● పులివెందుల పురపాలక సంఘానికి 3,143 గృహాలు మంజూరు కాగా, రూ. కోటితో 720 ఇళ్లు పునాది దశకు చేరాయి. మిగిలిన 2,423 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. పట్టణంలోని కదిరి రహదారి సమీపంలోని 30 ఎకరాల స్థలాన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసి 1,785 మంది లబ్ధిదారుల నుంచి రూ.49.16 లక్షలు నగదు వసూలు చేశారు. రెండేళ్లుగా పనులు జరగకపోవడంతో చెల్లించిన సొమ్ము తిరిగివ్వాలంటూ లబ్ధిదారులు కోరుతున్నారు. ● రాజంపేట పట్టణానికి మంజూరైన 1,279 ఇళ్లల్లో నిర్మాణ పనులు ప్రారంభించినవి కేవలం 336 మాత్రమే. అవన్నీ పునాది దశలోనే అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఇళ్ల నిర్మాణం కోసం 845 మంది లబ్ధిదారుల నుంచి రూ.50.20 లక్షలు వసూలు చేశారు. ఇళ్లు కట్టివ్వక, తమ సొమ్ములు తిరిగి చెల్లించకపోడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ● బద్వేలు పురపాలక సంఘానికి మంజూరైన 888 ఇళ్లల్లో నిర్మాణ పనులు ప్రారంభించినవి 624 ఉన్నాయి. వాటిని పునాది దశలోనే అసంపూర్తిగా వదిలేశారు. ఇందుకోసం లబ్ధిదారులు రూ.42 లక్షలు చెల్లించారు. ● మైదుకూరు పట్టణానికి 927 టిడ్కో గృహాలు మంజూరైనా భూములు అందుబాటులో లేకపోవడంతో ఒక్క ఇంటి నిర్మాణమూ ముందుకు సాగలేదు.

కడప నగరంలో నిర్మాణం పూర్తయిన భవన

సముదాయంలో తుప్పుపట్టిన ఇనుప కడ్డీలు

గడప దాటని కడపలో పనులు...

కడప నగరపాలక సంస్థకు 4,372 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రూ.75.49 కోట్లతో 2,576 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. కోర్టు కేసులు, భూవివాదాలతో 1,796 గృహనిర్మాణాలు నిలిచి పోయాయి. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలోని సరోజినినగర్‌లో 990, చలమారెడ్డిపల్లెలో 1,442 ఇళ్ల పైకప్పు నిర్మాణం పూర్తయింది. సరోజినినగర్‌లో చాలా వరకు ఇళ్లకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. అంతర్గత రహదారులు, విద్యుత్తు కనెక్షన్లు, తాగునీటి సదుపాయం కల్పించాల్సి ఉంది. చాలాకాలంగా నిర్వహణ లేకపోవడంతో ఇనుప కడ్డీలు, తలుపులు, కిటికీలు దెబ్బతిన్నాయి. ఆయా గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇటీవల అక్కడి వస్తువులను కొందరు దొంగతనం చేసినట్లు భద్రతా సిబ్బంది చెబుతున్నారు.

జమ్మలమడుగులో చెదలు పట్టిన ఓ ఇంటి ప్రధాన ద్వారం

జమ్మలమడుగు... పడని ముందడుగు

జమ్మలమడుగు నగరపంచాయతీకి మంజూరైన 1,440 టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులకు రాజీవ్‌నగర్‌ కాలనీ సమీపంలో 2017లో అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. వీటిల్లో 1,404 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తికాగా.. మరో 36 వాటికి సంబంధించి కిటికీలు, వాకిళ్లు, బండల చప్పట పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.49.60 కోట్లు ఖర్చు చేశారు. విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు ఏర్పాటు కాగా, ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అంతర్గత రహదారులు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇక్కడ గృహసముదాయం నిర్మాణం పూర్తికాగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉద్యానవనం ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. లబ్ధిదారులు చేరకపోవడంతో కొన్ని ఇళ్ల తలుపులు చెదలు పట్టి ఊడిపోయాయి. ఇళ్ల మధ్యలో పిచ్చిమొక్కలు పెరిగిపోయి అడవిని తలపిస్తోంది.

రాయచోటి: పునాది దశలో నిలిచిపోయిన నిర్మాణం​​​​​​​

రాయచోటి... సమస్యలతో పోటీ

రాయచోటి పురపాలక సంఘానికి 1,011 గృహాలు మంజూరు కాగా, 1,008 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.13.26 కోట్లు ఖర్చుపెట్టారు. సాంకేతిక సమస్యలతో మూడు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. పనులు ప్రారంభించినవాటిలో పునాది దశలో 768, పైకప్పు దశలో 240 ఉన్నాయి. ఇందులో 90 ఇళ్ల నిర్మాణం పూర్తయినా మౌలిక వసతులు కల్పించలేదు. చాలా ఇళ్లకు తలుపులు, కిటికీలు అమర్చాల్సి ఉంది.

ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి కేటాయించిన టిడ్కో గృహాలన్నీ రద్దయ్యాయి. మొత్తం 4,150 ఇళ్లు మంజూరు కాగా కోర్టు కేసులతో 1,990 గృహ నిర్మాణపనులు నిలిచిపోయాయి. రూ.12.18 కోట్లతో 2,160 గృహాల నిర్మాణం చేపట్టగా, 144 పూర్తయ్యాయి. తమ ప్రాంతానికి టిడ్కో ఇళ్లు వద్దని ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఇళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించిన వారికి జగనన్న కాలనీల్లో స్థలాలు మంజూరు చేశారు.

పనులు ప్రారంభించాలని ఆదేశించాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో 25 శాతం లోపు ప్రగతి ఉన్న ఇళ్ల నిర్మాణాలు నిలిపివేశాం. వీటిని తిరిగి ప్రారంభించాలని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. ఈ మేరకు ఆయా గుత్తేదారులకు తాఖీదులు పంపించాం. జిల్లాలో నిర్మాణం పూర్తయిన ఇళ్లు గత రెండేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో సామగ్రి దెబ్బతింటే మరమ్మతులు చేయిస్తాం. - రత్నంరాజు, డీఈ, ఏపీ టిడ్కో, కడప

జిల్లాలో టిడ్కో ఇళ్ల వివరాలు

మొత్తం మంజూరైనవి 19,231

పైకప్పు దశలో ఉన్నవి 3,536

పునాది దశలో ఉన్నవి 7,104

నిర్మాణం ప్రారంభించనివి 8,591

మొత్తం ప్రాజెక్టు విలువ రూ.1,061.62 కోట్లు

ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.155.68 కోట్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని