ఇక్కడ వడివడి.. అక్కడ తడబడి!
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

ఇక్కడ వడివడి.. అక్కడ తడబడి!

ఈనాడు, నల్గొండ

తెలంగాణ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణే లక్ష్యంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలలో సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2017లో యాదాద్రి, సూర్యాపేట కలెక్టరేట్‌ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 2018 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం భువనగిరి కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. సూర్యాపేట కలెక్టరేట్‌ పనులు ఇంకా బాలారిష్టాలు దాటడం లేదు.


త్వరలోనే ప్రారంభం

ప్రాంగణం లోపల పచ్చదనం

హైదరాబాద్‌ - వరంగల్‌ జాతీయ రహదారి పక్కన భువనగిరి సమీపంలోని రాయిగిరిలో సుమారు 12 ఎకరాల్లో పట్టుపరిశ్రమ కేంద్రంలో సమీకృత భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. జీప్లస్‌టు విధానంలో చేపట్టారు. 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన సముదాయంతో పాటు కలెక్టరు, ఇద్దరు అదనపు కలెక్టరు, డీఆర్వో తదితర జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు అందులోనే ఐదు నివాస ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణాలు పూర్తి కాగా.. అధికారుల నివాస సదుపాయాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రాంగణంలో సీసీ రహదారులతో పాటు నడక దారికి కోసం టైల్స్‌ వేశారు. ప్రాంగణమంతా పచ్చదనం కోసం దాదాపు 8 వేల మొక్కలు నాటారు. ల్యాండ్‌స్కేపింగ్‌, వీధిదీపాలు, తాగునీరు, డ్రైనేజీ, ఫర్నిచర్‌ బిగింపు పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. డిసెంబరు నెలలో ఈ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు తెలిసింది.

యాదాద్రి సమీకృత కలెక్టరేట్‌ భవనం నిర్మాణ వివరాలు
నిర్మాణ వ్యయం : రూ.54 కోట్లు
ఇప్పటి వరకు చేసిన ఖర్చు : దాదాపు రూ.40 కోట్లు
శంకుస్థాపన తేదీ : 11 అక్టోబరు 2017
పూర్తి చేయాల్సిన సమయం : పనులు ప్రారంభమైన ఏడాదిలోపు
విస్తీర్ణం : 12 ఎకరాలు
నిర్మాణ ప్రాంతం : రాయిగిరి
ప్రస్తుత పరిస్థితి : నిర్మాణాలన్నీ పూర్తి...తుది దశలో అధికారుల నివాస ప్రాంగణాలు
పర్యవేక్షణ : ఆర్‌అండ్‌బీ శాఖ
ప్రారంభ ముహూర్తం : వచ్చే నెల లేదా డిసెంబరులో


సా..గుతున్న పనులు

నిర్మాణంలో ఉన్న సూర్యాపేట కలెక్టరేట్‌ భవనం

సూర్యాపేట కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు మూడేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. కొవిడ్‌తో ఇతర రాష్ట్రానికి చెందిన నిర్మాణ కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లడంతో ఏడాది పాటు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నిర్మాణ స్థలం కొన్ని రోజుల పాటు కోర్టులో ఉండటంతో పనులు తొందరగా ప్రారంభం కాలేదు. తాజాగా కార్మికులందరూ పాల్గొంటుండటంతో నిర్మాణ పనుల్లో జోరు పెరిగింది. కుడకుడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 320, 321లో 25 ఎకరాల స్థలంలో రూ.46 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. స్థలం కొనుగోలు విషయంలో వివాదం తలెత్తి కొందరు కోర్టును ఆశ్రయించడంతో పనుల ప్రారంభంలో జాప్యమైంది. ఏడాదిలోపు పూర్తికావాల్సి ఉండగా... రెండేళ్ల వరకు స్లాబుల నిర్మాణం పూర్తి కాలేదు. ప్రస్తుతం మూడంతస్తుల్లో స్లాబులు పూర్తయి గోడల నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చికల్లా నిర్మాణాన్ని పూరి చేస్తామని రహదారులు, భవనాల శాఖ అధికారులు వెల్లడించారు.

సూర్యాపేట సమీకృత కలెక్టరేట్‌ భవనం నిర్మాణ వివరాలు
నిర్మాణ వ్యయం : రూ.46 కోట్లు
ఇప్పటి వరకు చేసిన ఖర్చు : రూ.14 కోట్లు
శంకుస్థాపన తేదీ : 12 అక్టోబరు 2017
పనులు ప్రారంభమైన తేదీ : జనవరి 2018    
పూర్తి చేయాల్సిన సమయం : పనులు ప్రారంభమైన ఏడాదిలోపు
విస్తీర్ణం : 25 ఎకరాలు
నిర్మాణ ప్రాంతం : కుడకుడ గ్రామం  
ప్రస్తుత పరిస్థితి : మూడు అంతస్తుల స్లాబ్‌ల పూర్తి
పర్యవేక్షణ : ఆర్‌అండ్‌బీ శాఖ
ప్రారంభ ముహూర్తం : వచ్చే ఏడాది మార్చి ఆఖరుకు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని