Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాధితుల సంఖ్యపెరుగుతోంది

ఒక్కరోజు వ్యవధిలో 405 కేసుల నమోదు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సిద్ధం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు బాధితులు పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రెట్టింపవుతోంది. వీటి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌, సాధారణ పడకల సంఖ్యను యంత్రాంగం పెంచుతోంది. కేజీహెచ్‌లో ఇప్పటికే 500 పడకలు సిద్ధంగా ఉండగా, వాటిలో 300 పడకల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు.
బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో నగరంతో పాటు జిల్లాలో ఉన్న ఇతర ప్రభుత్వ ఆసుపత్రులను యంత్రాంగం సిద్ధం చేస్తోంది. టీబీ ఆసుపత్రిలోనూ బాధితులను చేర్చుకుంటున్నారు. ఇక్కడ 288 పడకలు అందుబాటులో ఉండగా ఇప్పటికే పదిమంది చేరారు. విమ్స్‌లో 300 పడకలను సిద్ధం చేశారు.
అనకాపల్లి, పాడేరు జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో వంద చొప్పున 200 పడకలను సిద్ధం చేశారు. అరకు, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రుల్లో 135 పడకలను సిద్ధం చేశామని కొవిడ్‌ ప్రత్యేక అధికారి, ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తెలిపారు. బాధితులు, కేసుల సంఖ్య పెరుగుతున్నందున తొలుత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, అంబులెన్సులు, ఔషధాలు, పీపీఈ కిట్లు, ఇతర సామగ్రి సిద్ధం చేయాలని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆదేశించారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 405 కొవిడ్‌ కేసులు వచ్చాయని, ఈ ఏడాదిలో ఇవే అత్యధిక కేసులన్నారు. తాజా కేసులతో బాధితుల సంఖ్య 65,270కు చేరిందన్నారు. ఒక్కరోజు వ్యవధిలో 202 మంది కోలుకోగా వీరి సంఖ్య 62,069కు చేరిందన్నారు. ప్రస్తుతం 2643 మంది చికిత్స పొందుతున్నారని ప్రిన్సిపల్‌ వివరించారు. కొత్తగా ఎవరూ కొవిడ్‌తో మృతి చెందలేదని, ఇంతవరకు 558 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని