ప్రియాంకకు.. ప్రభుత్వ సాయం కలేనా?
eenadu telugu news
Updated : 25/10/2021 12:32 IST

ప్రియాంకకు.. ప్రభుత్వ సాయం కలేనా?

ప్రస్తుతం కోలుకున్నా... వైద్యానికి నిధుల కొరత

 

ఈనాడు, విశాఖపట్నం: ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఓ మృగాడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతి ప్రభుత్వ సాయం అందక కన్నీరుమున్నీరవుతోంది. విశాఖలోని థాంప్సన్‌ వీధిలో ఉండే సాయి ఈశ్వర్‌ ప్రియాంకపై ఆమె ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్‌ గత సంవత్సరం డిసెంబరు 2న దాడి చేశాడు. హేక్సాబ్లేడుతో పీక కోశాడు. గొంతుపై నాలుగుచోట్ల బలంగా కోసేయడంతో సుమారు నెల రోజులపాటు మృత్యువుతో పోరాడింది. చివరకు ప్రాణాలు దక్కించుకుందిగానీ గొంతు మాత్రం మూగబోయింది.

* ముంబయిలోని ప్రిన్స్‌ అలీఖాన్‌ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేస్తే మళ్లీ మాటలు వస్తాయని తెలిస్తే ఆమె తల్లిదండ్రులు రమణమ్మ, లక్ష్మణరావు అక్కడికి తీసుకెళ్లారు. శస్త్రచికిత్స, ఇతర ఖర్చులన్నీ కలిపి సుమారు రూ.11 లక్షల ఖర్చవుతుందని తెలియడంతో ఆర్థికసాయం చేయాలని అధికారుల్ని వేడుకున్నారు. ఇతర రాష్ట్రాల ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేస్తే ముందుగా డబ్బులు ఇచ్చే అవకాశం ఉండదని, శస్త్రచికిత్స తరువాత బిల్లు పెట్టుకోవాలని అధికారులు సూచించారు. దీంతో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ వారి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకోలేక వారి దీనస్థితిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా క్రికెటర్‌ హనుమ విహారి స్పందించి రూ.5లక్షలు అందించారు. దీంతో మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకుని ప్రస్తుత సంవత్సరం జూన్‌ 21వ తేదీన శస్త్రచికిత్స చేయించారు. దీంతో ప్రియాంక ఒకింత మాట్లాడగలుగుతోంది. కానీ తలను మాత్రం ఎప్పుడూ వంచే ఉంచాల్సిన దుస్థితి. దీంతోపాటు ఐదు నెలలపాటు ప్రతినెలా ముంబయి ఆసుపత్రికి వెళ్లాలి. ఆ విధంగా వెళ్లిరావడానికి, మందులకు, ఇతర ఖర్చులకు నెలకు రూ.65వేలు చొప్పున ప్రతినెలా ఖర్చవుతున్నాయి. ఇప్పటికి రెండుసార్లు వెళ్లినా ఆర్థిక సమస్యల కారణంగా మూడోసారి ముంబయికి వెళ్లలేక ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తోంది. శస్త్రచికిత్సకు అయిన ఖర్చులు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందేమోనన్న ఉద్దేశంతో ఆమె తల్లిదండ్రులు దీనంగా ఎదురుచూస్తున్నా నేటికీ వారికి ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు.

* ఓ బాలిక క్యాన్సర్‌తో బాధపడుతోందన్న సమాచారం తెలుసుకున్న ప్రియాంక తల్లి క్రికెటర్‌ హనుమ విహారి ఇచ్చిన రూ.5 లక్షల్లో రూ.1.50 లక్షల్ని అతడి ఫౌండేషన్‌కి ఆ బాలిక సహాయార్థం తిరిగి ఇచ్చేశారు. తనకు ప్రభుత్వసాయం వస్తుందన్న ఉద్దేశంతో ఆమె ఇలా చేశారు. ఇప్పుడేమో కూతురి వైద్యానికి డబ్బుల్లేక విలవిల్లాడుతున్నారు.

* డిగ్రీ ప్రైవేటుగా చదువుతున్న ప్రియాంక వాలంటీర్‌. ఆమెకు బిల్లులు మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారుగానీ నేటికీ వాటి పరిస్థితి ఏమిటో అర్థం కాని దుస్థితి.


మరణిస్తేనే డబ్బులిస్తారా?

మొదటిసారి ముంబయి వెళ్లేటప్పుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ నలుగురికి రానుపోను టిక్కెట్లు ఇచ్చారు. శస్త్రచికిత్సకు రూ.లక్ష ఇచ్చారు. క్రికెటర్‌ హనుమ విహారి రూ.5లక్షలు ఇవ్వడంతో నా కూతురు మళ్లీ మాట్లాడగలుగుతోంది. ప్రభుత్వం నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు. మరణించిన వారికి పరిహారాలు ఇస్తూ బతికి ఉన్నవాళ్లకు ఇవ్వకపోవడం బాధాకరం.

- రమణమ్మ, ప్రియాంక తల్లి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని