డీలర్ల నిరసన గళం
eenadu telugu news
Published : 27/10/2021 05:32 IST

డీలర్ల నిరసన గళం

రేషను సరకుల లారీలకు అడ్డుగా నిల్చుని నిరసన తెలుపుతున్న డీలర్లు

వన్‌టౌన్‌, మాధవధార, న్యూస్‌టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రేషన్‌ సరకుల సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని పౌరసరఫరాల సంస్థకు చెందిన గోదాములు 30 వరకు ఉన్నాయి. వాటి నుంచి బియ్యం, పంచదార, కందిపప్పు రేషను డిపోలకు వెళతాయి. ప్రధాన గోదాముల నుంచి మండల స్టాకు పాయింట్ల(ఎంఎల్‌ఎస్‌)కు బియ్యం వస్తున్నా.. అక్కడి నుంచి డిపోలకు మంగళవారం సరఫరా నిలిచిపోయింది. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని రేషను డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డిపోలకు వెళ్లే సరకుల వాహనాలను అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగడం వల్ల దాదాపు 600 టన్నుల బియ్యం సరఫరా నిలిచిపోయింది.
* జిల్లాలో దాదాపు 12లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. ఆయా కార్డులకు నెలకు 18వేల టన్నుల బియ్యం అవసరం. ప్రతి నెలా 26వ తేదీ నుంచి డిపోలకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి సరకులు చేరవేస్తారు. రోజుకు 1500 టన్నుల వరకు ఈ రకంగా పంపుతారు. జిల్లాలో 828 ఎండీయూ (మల్టీ డిస్పెన్సబుల్‌ యూనిట్లు) వాహనాల పరిధిలో 2,100కుపైగా రేషను డిపోలున్నాయి. 30వ తేదీ నాటికి కనీసం 828 డిపోలకు బియ్యం చేర్చగలిగితే ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీ ప్రారంభం అవుతుంది. డీలర్ల ఆందోళన ఫలితంగా ప్రస్తుతం బియ్యం సరఫరా ఆగిపోయింది. వరుసగా రెండు రోజులు ఆందోళన సాగితే ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీపై దాని ప్రభావం పడే అవకాశం ఉంది.
* జిల్లాలోని డీలర్లంతా ఆందోళనలో పాల్గొంటున్నారని రేషను డిపో డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పి.చిట్టిరాజు, ఎం.ప్రసాద్‌ తెలిపారు. గతంలో గోనె సంచెకు రూ.20 చొప్పున పౌరసరఫరాల సంస్థ (సీఎస్‌సీ) జిల్లా అధికారులు చెల్లించేవారని, గత ఏప్రిల్‌ నుంచి వాటిని నిలిపివేశారన్నారు. దీని వల్ల ప్రతి డీలరు నెలకు రూ.3వేల నుంచి 5వేల వరకు నష్టపోతున్నారన్నారు. అంతంత మాత్రంగా వచ్చే కమీషన్లతో డిపోల నిర్వహణ కష్టం మారిన తరుణంలోనూ  సంచులకు రుసుము చెల్లించకపోవడం దారుణమని వాపోయారు.  మంగళవారం మర్రిపాలెం వద్ద ఉన్న పౌరసరఫరాల శాఖ గోదాం వద్దా నగర డీలర్ల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు మాకిన ప్రసాద్‌, చెరుకూరి వెంకటరావు, టి.జయరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని