close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

వలస జీవులకు భాగ్యనగరం!

వలసవచ్చే వారికి హైదరాబాద్‌ ‘భాగ్య’నగరంగా మారింది. కొంతకాలంగా చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఉత్తరాది వలస కూలీలకు ఇప్పుడు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. ఇటీవల విడుదలయిన జనగణన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. నగర శివార్లలో ఇతర రాష్ట్రాల కూలీల కాలనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. వలసల కారణంగా హైదరాబాద్‌ కార్మికరంగ ముఖచిత్రం మారిపోతోంది.

-ఈనాడు, హైదరాబాద్‌

ముంబయి దారి వదిలి..

ఇటీవలి వరకు వలసల నగరం అంటే ముంబయే. ఉత్తరాది నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచీ ఏటా వేలాది మంది ముంబయికి వలస వెళ్లేవారు. 2011 జనగణన ప్రకారం 2.35 కోట్ల ముంబయి జనాభాలో 1.01 కోట్ల మంది (43 శాతం) వలస వాసులే. అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో కొత్తగా వెళ్లేవారికి బతుకు కష్టమైంది. రోజంతా కష్టపడ్డా రూ.600 మించిరావు. ఆ డబ్బుతో జీవనం సాగించడం కష్టమైంది. అందుకే వలస కూలీలు ప్రత్యామ్నాయ నగరాలు చూసుకుంటున్నారు.

మిన్నగా ఆకర్షిస్తున్న మన నగరం
హైదరాబాద్‌పై అందరి దృష్టి..

వలసలకు సంబంధించి భారత గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2001-2011 మధ్యకాలంలో ముంబయికి పెరిగిన వలసలు 8 శాతం కాగా హైదరాబాద్‌కు 39 శాతం పెరిగాయి. ఇవి ఎనిమిదేళ్ల క్రితం గణాంకాలు కాగా ప్రస్తుతం వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. ఒకప్పుడు శివార్లలోని పరిశ్రమల్లో మాత్రమే వీరు పరిమిత సంఖ్యలో కనిపించేవారు. కానీ ఇప్పుడు మిగతా అన్ని రంగాలకూ విస్తరిస్తున్నారు.

పారిశ్రామిక రంగం

హైదరాబాద్‌ శివార్లలోని పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల్లో సగం మందికిపైగా ఉత్తరాదివారే. కాటేదాన్‌ పారిశ్రామికవాడలో 1450 పరిశ్రమలు ఉండగా వాటిలో 55 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే. చర్లపల్లి, ఉప్పల్‌, కాప్రా, కుశాయిగూడ పారిశ్రమికవాడల్లో దాదాపు 6 వేల పరిశ్రమలు ఉండగా వాటిలో పనిచేస్తున్న వారిలోనూ సగం మంది కూడా వీరే.

నిర్మాణ రంగం

నాలుగైదేళ్ల కిందట నిర్మాణ రంగంలో ఉత్తరాదివారు ఎక్కువగా  కనిపించేవారు కాదు. ఒంగోలు, నెల్లూరుకు చెందిన తాపీమేస్త్రీలు, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కూలీలు ఉండేవారు. ఇప్పుడు నిర్మాణరంగంలోనూ వీరి సంఖ్య సగానికి చేరువవుతోంది. ముఖ్యంగా పెద్ద నిర్మాణ సంస్థలు కూలీ పనులను ఉత్తరాదివారికి గుత్తకు ఇచ్చేస్తున్నాయి.

వ్యవసాయంలో సైతం..

పశ్చిమబంగాకు చెందిన కూలీలు నాట్లు, కలుపులు వంటి వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పుడు పత్తి, మిరప చేలల్లో పనిచేసేందుకు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా కూలీలు వరుస కడుతున్నారు.
* హోటళ్లు, పెట్రోల్‌బంకుల్లో పనిచేసేవారి ఉత్తరాదివారి సంఖ్య కూడా పెరుగుతోంది. మిఠాయిలు, ఐస్‌క్రీంలు, పానీపూరీ లాంటివాటిని అమ్ముతూ ఉపాధి Åపొందుతున్నారు. చదువుకున్న వారయితే ఆసుపత్రులు, హోటళ్లలో పనిచేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులుగానూ చేరుతున్నారు.

ఇవీ ఆకర్షణలు

* పనిచేసుకోవాలన్నా, పని వెతుక్కోవాలన్నా భాష తెలియకపోతే కష్టం. మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో ఉత్తరాదివారికి భాషాపరమైన సమస్యలు ఉండవు. ఉర్దూ, హిందీ వాడుకలో ఉండటం అందుకు కారణం.
* సంస్కృతి, ఆహారపుటలవాట్లు వంటివి కూడా అనుకూలించే అంశాలు.
* ముంబయి, దిల్లీ, బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో జీవన వ్యయం తక్కువ. ముంబయిలో మురికివాడలో ఇద్దరు కలిసి ఒక గది పంచుకున్నా ఒక్కొక్కరు కనీసం రూ.మూడువేలు అద్దె చెల్లించాలి. కానీ ఇదే అద్దెతో హైదరాబాద్‌ శివార్లలో ఓ మోస్తరు ఇల్లు దొరుకుతుంది. రవాణా, ఇతరత్రా ఖర్చులు కూడా మిగతా నగరాలతో పోల్చుకుంటే తక్కువే.

బతుకుదెరువు కోసమే..
-ఉత్తమ్‌కుమార్‌ జనా, నథాపూర్‌, బీజాపూర్‌ జిల్లా, ఒడిశా

స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక బతుకుదెరువు కోసమే నగరానికి వలస వస్తున్నాం. గతంలో పుణె, ముంబయి, దిల్లీ నగరాలకు వలస వెళ్లేవాళ్లం. ఇప్పుడక్కడ ఉపాధి దొరక్కపోవడం, ఖర్చులు పెరిగాయి. చర్లపల్లి, ఉప్పల్‌ ప్రాంతాల్లోని పరిశ్రమల్లోనే ఒడిశాకు చెందిన 10 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 3 వేల మంది మహిళలే. రోజుకు 8 గంటలకు పని చేస్తే రూ.10వేల వరకు జీతం వస్తుంది.
కార్మికుల కొరతతోనే..
-కోటకొండ సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల ఫెడరేషన్‌ అధ్యక్షులు

ఉప్పల్‌ నియోజవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొత్తం ఆరు వేల వరకు ఉన్నాయి. వీటిలో ఒడిశా, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబంగ రాష్ట్రాల కార్మికులు 50 శాతం వరకు ఉన్నారు. కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్న కార్మికుల సంఖ్య బాగా తగ్గింది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగటమే ఇందుకు కారణం. శారీరకశ్రమ ఉండే పనులను చేసేందుకు ఇక్కడి యువత ఇష్టపడటం లేదు. ఇక్కడిచ్చే జీతాలు ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇదే వేతనం స్థానిక యువతకు తక్కువగా అనిపిస్తోంది. పైగా ఇతర రాష్ట్రాల వారు అవసరమైతే అదనపు గంటలు పనిచేస్తారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.