close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

పటిష్ఠ బోదనకు నిష్ట

సమగ్ర అత్యున్నత విద్యకు అంకురార్పణ
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
న్యూస్‌టుడే, వెల్గటూరు

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బోధనా పటిమను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచే దిశగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థలు సంయుక్తంగా ‘నిష్ట’ పేరిట దీన్ని రూపొందించారు. సంపూర్ణ, ఉన్నతమైన ఈ శిక్షణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

నిష్టలో భాగంగా దేశవ్యాప్తంగా 42 లక్షల మందిని సుశిక్షితులను చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. కేంద్ర స్థాయిలో 120 ఆచార్యుల బృందాలు 33 వేల బృందాలకు శిక్షణ ఇస్తారు. ఒక్కో బృందంలో ఒక ప్రధానోపాధ్యాయుడు, అయిదుగురు ఉపాధ్యాయులు ఉంటారు. తెలంగాణలో 94,547 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.

బహుళార్థ బోధన పద్ధతుల పెంపు: ప్రస్తుతం కొనసాగుతున్న మూస విధానంలో కాకుండా తరగతి గది వాతావరణాన్ని బట్టి శిక్షణ పొందే వారి భాగస్వామ్యాన్ని పెంచి బహుళార్థక బోధన పద్ధతులపై శిక్షణ ఇస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉపాధ్యాయులు స్వయంగా వివిధ రకాల కృత్యాలు, బోధనా వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. వీటిని శిక్షణలో ప్రదర్శించాల్సి ఉంటుంది. తద్వారా విషయ నిపుణులు ఉపాధ్యాయుల సాంకేతిక పరిజ్ఞానాన్ని అంచనా వేస్తారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణకు హాజరవుతున్న రిసోర్స్‌పర్సన్లకు పూర్వ పరీక్ష నిర్వహిస్తున్నారు. నిష్ట పేరిట చరవాణి ‘యాప్‌’ను సైతం అభివృద్ధి పరిచారు. శిక్షణ సమయంలో తాము నేర్చుకున్న వాటిని ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం అంత్యపరీక్ష కూడా ఉంటుంది.

ఏమిటీ నిష్ట?
‘నేషనల్‌ ఇన్షియేటివ్‌ ఫర్‌ స్కూల్‌ హెడ్స్‌, టీచర్స్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌’కు సంక్షిప్త రూపమే నిష్ట. ‘పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి సమగ్ర, అత్యున్నత శిక్షణకు అంకురార్పణ కార్యక్రమం’ పేరిట దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ కోసం విషయ నిపుణుల(రిసోర్స్‌ పర్సన్ల)కు గత నెల 18 నుంచి నాలుగు విడతలుగా శిక్షణ ఇస్తున్నారు. వీరికి ఈ నెల 8 నుంచి 12 వరకు నాలుగో విడత శిక్షణ పూర్తవుతుంది. అనంతరం వీరు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.

శిక్షణాంశాలు ఇవే...
* విద్యా ప్రణాళిక, విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలు, అభ్యసన ఫలితాలు, సమ్మిళిత విద్య.
* పాఠశాలలో విద్యార్థి ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా, సురక్షితమైన, ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన వనరులను అభివృద్ధి చేయడం.
* విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి కళా ఆధారిత అభ్యసనాన్ని, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం.
* పాఠశాల స్థాయిలోనే బోధనాభ్యసనాన్ని మదింపు చేయడం, దీన్ని సమాచార, సాంకేతికకు అనుసంధానించడం.
* పర్యావరణ విద్య, గణితం, భాష, సామాన్య, సాంఘిక వంటి పెడగోజి అంశాల బోధన పద్ధతులపై మూస పద్ధతికి భిన్నంగా బోధన
* ఫోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారుల సంరక్షణ) చట్టంపై అవగాహన.
* ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాల పెంపు.

బోధనలో విప్లవాత్మక మార్పులకు నాంది
వెంకటేశ్వర్లు, జగిత్యాల జిల్లా విద్యాధికారి
పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ శిక్షణకు సంబంధించి ఉపాధ్యాయుల మెయిల్‌ ఐడీల సేకరణ పూర్తయింది. జిల్లాలో అయిదు రాష్ట్ర రిసోర్స్‌పర్సన్ల బృందాలు శిక్షణ పొందాయి. అయిదు వేదికలు ఏర్పాటు చేసి ఒక్కో వేదికలో సగటున 150 మంది చొప్పున 750 మందికి ఒక విడత చొప్పున శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. నాలుగు విడతల్లో కలిసి ఎంపిక చేసిన వారందరికీ శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాం. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు బహుళార్థ బోధనలో మెలకువలు నేర్చుకుని అన్ని విషయాలు బోధించేలా నిష్ణాతులుగా తయారవుతారు. ఇది విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది కానుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.