Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

లోతైన పరిశోధన 

లోతైన పరిశోధన 

మానవచరిత్రలోనే అద్భుత సాహసయాత్రకు రంగం సిద్ధమవుతోంది. భూ మండలంలో వ్యాపించిన ఐదు మహాసముద్రాల లోలోతుల్లోకి మనిషి తొలిసారి వెళ్లబోతున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం ‘డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ వెహికల్‌ (డీఎస్‌వీ) లిమిటింగ్‌ ఫ్యాక్టర్‌’ అనే అద్భుత సబ్‌మెర్సిబుల్‌ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. సాగర గర్భంలోని ప్రతికూల పరిస్థితులను తట్టుకొనేలా పటిష్ఠంగా రూపొందిన ఈ యంత్రం.. 36వేల అడుగుల లోతుల్లోకి మానవులను చేరవేసే సత్తా ఉంది.

అన్వేషణ నౌక ద్వారా.. 
లిమిటింగ్‌ ఫ్యాక్టర్‌ సబ్‌మెర్సిబుల్‌ను ‘ప్రెజర్‌ డ్రాప్‌’ అనే సైన్స్‌ పరిశోధన నౌక మోసుకెళుతుంది. సముద్రంలో నిర్దేశిత ప్రదేశం వద్దకు రాగానే నౌక నుంచి ఈ సబ్‌మెర్సిబుల్‌ను కిందకి దించుతారు. దీనికి చోదకుడిగా విక్టర్‌ వెస్కోవో వ్యవహరిస్తారు. ఆయన.. లోగడ ప్రపంచంలోని ఏడు అత్యంత ఎత్తయిన పర్వతాలను అధిరోహించారు. ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్దకు యాత్రలను చేపట్టారు. 
డిస్కవరి, సైన్స్‌ ఛానళ్లు ఈ యాత్రను ‘డీప్‌ ప్లానెట్‌’ అనే ప్రాజెక్టు కోసం చిత్రీకరిస్తాయి. 2019లో వీటిని ప్రసారం చేస్తాయి. ప్రెజర్‌ డ్రాప్‌ నౌకలో 30 మందికిపైగా సభ్యులు ఉంటారు.

ఫైవ్‌ డీప్‌ ఎక్స్‌పిడీషన్‌ సైన్స్‌ కార్యక్రమానికి న్యూకాజిల్‌ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త అలెన్‌ జేమీసన్‌ నాయకత్వం వహిస్తున్నారు.

ఐదు ప్రాంతాలకు తోడు గత ఏడాది గుర్తించిన యూఎస్‌ఎస్‌ ఇండియానాపోలిస్‌ యుద్ధనౌక శిథిలాల వద్దకూ యాత్రను నిర్వహిస్తారు. దక్షిణ అట్లాంటిక్‌లోని మీటియోర్‌ డీప్‌, దక్షిణ హిందూ మహాసాగరంలోని డయామాంటినా డీప్‌, సాల్మన్‌ దీవుల వద్ద ఉన్న ఫిలిప్పీన్‌ ట్రెంచ్‌, శాన్‌ క్రిస్టోబాల్‌ ట్రెంచ్‌, టోంగా ట్రెంచ్‌ల వద్దకూ వెళ్లాలని ఈ బృందం భావిస్తోంది.

లోతైన పరిశోధన 

అపూర్వ సాంకేతిక పరిజ్ఞానం.. 
‘లిమిటింగ్‌ ఫ్యాక్టర్‌’ సబ్‌మెర్సిబుల్‌లో అద్భుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. లోగడ తయారుచేసిన ఈ తరహా సాధనాలకు భిన్నంగా దీనికి అంతర్జాతీయ సముద్రయాన ప్రాధికార సంస్థ నుంచి ధ్రువీకరణ పత్రం లభించింది. 
లోగడ తయారుచేసిన ఇలాంటి రెండు సబ్‌మెర్సిబుళ్లు.. పూర్తిస్థాయి సముద్రలోతుల్లోకి ఒకటి కన్నా ఎక్కువసార్లు వెళ్లగలిగేలా డిజైన్‌ చేయలేదు. లిమిటింగ్‌ ఫ్యాక్టర్‌ మాత్రం వేలాది సార్లు డైవ్‌లు నిర్వహించగలదు. 
మహాసాగరాల్లోని ఏ ప్రాంతాన్నైనా సందర్శించగల ఏకైక మానవసహిత నౌక ఇదొక్కటే. నిర్దేశిత సాధనాలున్న ఎలాంటి నౌక నుంచైనా దీన్ని సాగరలోతుల్లోకి ప్రయోగించవచ్చు. 
శాస్త్రీయ పరిశోధనలకు, అన్వేషణకు, చలన చిత్రాల చిత్రీకరణకు ఇది అక్కరకొస్తుంది. 
‘లిమిటింగ్‌ ఫ్యాక్టర్‌’ను 90 మిల్లీమీటర్ల మందమైన టైటానియంతో నిర్మించారు. ఇందులో ఇద్దరికి చోటు ఉంటుంది. 8-12 గంటల పాటు సౌకర్యంగా కూర్చొని పరిశోధనలు చేయడానికి వీలుగా తీర్చిదిద్దారు. లోపలి ఉష్ణోగ్రత, తేమను నియంత్రించవచ్చు. 
వెలుపలి దృశ్యాలను వీక్షించడానికి మూడు వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. చీకటిగా ఉండే సముద్రగర్భంలో వెలుగులు నింపడానికి అత్యంత శక్తిమంతమైన ఎల్‌ఈడీల దీపాలను ఏర్పాటు చేశారు. సాగర లోతుల్లో పనిచేయగలిగే ‘లో లైట్‌ కెమెరాలనూ’ అమర్చారు. 


లోతైన పరిశోధన 

ఈ సబ్‌మెర్సిబుల్‌తోపాటు ఫ్లెరె, స్కాఫ్‌, క్లాస్ప్‌ అనే మూడు ల్యాండర్లను సముద్రగర్భంలోకి ప్రయోగించవచ్చు. ఈ యాత్రా బృందం వద్ద ఎకో సౌండర్‌, సాగరగర్భాన్ని మ్యాపింగ్‌ చేయడానికి మల్టీబీమ్‌ సోనార్‌ ఉంటాయి.



లక్ష్యాలు.. 
హై రిజల్యూషన్‌ మల్టీబీమ్‌ సోనార్‌ సాయంతో సముద్రలోతుల్లో భౌగోళికాంశాలు, ఆవాస ప్రాంతాలను గుర్తించడం. భూ ఫలకాల కదలికల వల్ల లక్షల సంవత్సరాల కిందట భౌగోళికంగా జరిగిన మార్పులపై శోధించడం. 
ఈ సబ్‌మెర్సిబుల్‌తోపాటు వెళ్లే మూడు ల్యాండర్ల సాయంతో సదరు ఆవాస ప్రాంతాల్లో నివసిస్తున్న జీవుల గురించి తెలుసుకోవడం. 
‘ప్రెజర్‌ డ్రాప్‌’ నౌకలోని వెట్‌ ల్యాబ్‌ను ఉపయోగించి.. సదరు ప్రాంతాల్లో జీవులు మనుగడ సాగిస్తున్న తీరును కనుగొనడం. 
ఐదు ప్రాంతాల్లోని జీవుల్లో జన్యు వైరుద్ధ్యాలను గుర్తించడం. అత్యంత ప్రతికూలంగా ఉండే అక్కడి వాతావరణంలో మనుగడ సాగించేలా ఆ జీవుల ఆవిర్భవించిన తీరును అర్థంచేసుకోవడం. 
మూడు ల్యాండర్ల సాయంతో శిలలు, జంతువులు, నీటి నమూనాలను సేకరణ.

విశేషాలు.. 
ఈ యాత్రలో భాగంగా 11 నెలల్లో 74వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. 
యాత్ర ముగిసేనాటికి సదరు సబ్‌మెర్సిబుల్‌.. నీటి లోతుల్లో అడుగువైపునకు కనీసం 72వేల మీటర్లు ప్రయాణించినట్లవుతుంది. 
సబ్‌మెర్సిబుల్‌ డైవ్‌లతోపాటు దాదాపు 50 సైంటిఫిక్‌ ల్యాండర్‌ మోహరింపులను చేపడతారు. 
ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన వారిలో ఎవరూ చాలెంజర్‌ డీప్‌లోని అత్యంత లోతైన ప్రాంతానికి ఇంతవరకూ వెళ్లలేదు. ఈ యాత్రలో విక్టర్‌ వెస్కోవో ద్వారా ఈ ఘనత సాధ్యమవబోతోంది.

క్షేమంగా ఉపరితలానికి.. 
సముద్ర లోతుల నుంచి ఉపరితలం మీదకు రావడానికి ఈ సబ్‌మెర్సిబుల్‌లో అనేక సురక్షిత విధానాలు ఉన్నాయి. అందులో 12 వేరువేరు బ్యాటరీలు ఉన్నాయి. ఒకవేళ విద్యుత్‌ సరఫరా లేకున్నప్పటికీ ప్రధాన బలాస్ట్‌ బరువులను విడుదల చేసి, తక్షణం, అత్యవసరంగా పైకి వెళ్లేలా దీన్ని డిజైన్‌ చేశారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.