close

ప్ర‌త్యేక క‌థ‌నం

చాటుమాటుగా.. ప్రలోభమస్తు!   

భారీగా అక్రమ పంపిణీ 
మత్తు మందుల జోరూ అధికమే 
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆగని సొమ్ముల ప్రవాహం 
అంతా బహిరంగ రహస్యం!

నిబంధనావళి కచ్చితంగానే ఉంటుంది. అధికారులు కొరడా ఝుళిపిస్తూనే ఉంటారు. కానీ చాటుమాటుగా కోట్ల నోట్ల కట్టలు.. లక్షల సీసాలు తరలిపోతుంటాయి. చేతులు మారిపోతుంటాయి. మన ప్రజాస్వామ్యానికి, ఎన్నికల క్రతువుకు పెద్ద విఘాతంగా తయారైన ఈ ప్రలోభాల జాడ్యం.. జడలు విప్పుతూనే ఉంది! ఇప్పటి వరకూ భారీగా పట్టుబడిన నగదు, మందే.. ఇందుకు సాక్ష్యం!

ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే... ప్రజలు తమ పాలకులను ఎన్నుకోవడం. దేశ నిర్మాతలు కాంక్షించిందీ అదే. స్వాతంత్య్ర సంగ్రామం జరిగిందీ అందుకే. కానీ... ఇప్పుడు ఎన్నికలంటే- ‘ఓట్ల పండగ’!  ఉద్వేగాలను వండి, రాజకీయాలను ఎగదోసి... డబ్బు, మద్యం, ఆభరణాలు, తాయిలాలు ఎరవేసి... ఓట్లను ఒడిసి పట్టడం ఆనవాయితీగా మారిపోయింది. ఎన్నికల వేళ కోట్లాది రూపాయల సొమ్ములు, మద్యం చిక్కుతుండటమే ఇందుకు నిదర్శనం!

చాటుమాటుగా.. ప్రలోభమస్తు! 
 

2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత... ఇప్పటివరకూ 22 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు అన్నింటిలోనూ పలువురు అభ్యర్థులు, చాలామటుకు రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం పరిపాటిగా మారింది. వీటిపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం... భారీగా నగదు, మద్యం, వస్తువుల అక్రమ పంపిణీని అడ్డుకుంది. కానీ, అంతకు ఎక్కువగానే గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు పంపిణీ జరిగిపోయినట్లు భావిస్తున్నారు. జప్తు చేసిన సొమ్ములను మదింపు చేయగా- 2017లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో అత్యధికంగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు అధికారులు తేల్చారు. ఆ సమయంలో ఏకంగా రూ.193.29 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు లభించడం గమనార్హం. ఇక రెండో స్థానంలో తమిళనాడు ఎన్నికలు, మూడో స్థానంలో కర్ణాటక ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఎన్నికల సంఘం లెక్కలు తేల్చింది. 2013 ఎన్నికలతో పోల్చితే గతసారి కర్ణాటకలో అక్రమాలు, నగదు ప్రవాహం 20% పెరిగినట్లు అధికారులు గుర్తించారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాల అక్రమ రవాణా సుమారు 500% పెరిగినట్లు అప్పట్లో ఆదాయపన్నుశాఖ వెల్లడించింది కూడా.

ఇప్పుడేం జరుగుతోంది? 
ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ మద్యం, మాదక ద్రవ్యాలు, ఆభరణాలు, నగదు, తాయిలాలు పెద్దమొత్తంలో అక్రమంగా పంపిణీ అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోనైతే ఎన్నికల ఆంక్షలు అమల్లోకి వచ్చినప్పట్నుంచీ ఇప్పటివరకూ 22,888 నాన్‌-బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీఎల్‌ కాంతారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,140 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 లక్షలకుపైగా పేలుడు సామగ్రిని వివిధ ఠాణాల పోలీసులు జప్తు చేశారు. 66,568 మంది వ్యక్తుల కదలికలపై నిషేధం విధించారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రచారానికి వాడుకున్నందుకు 14.84 లక్షల కేసులు; ప్రైవేటు ఆస్తుల్ని దుర్వినియోగం చేయడంపై 3.22 లక్షల కేసులు; వాహనాలను దుర్వినియోగం చేసినందుకు 8,569 కేసులు నమోదు చేశారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులే... 
అధికారం కోసం ఆరాట పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులే ఎక్కువగా అక్ర మాలకు పాల్పడుతున్నట్లు ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘నువ్వా-నేనా’ అన్న స్థాయిలో పోటీ ఉత్కంఠగా ఉన్న చోట్ల నగదు ప్రవాహం, ప్రలోభాలు అధికంగా ఉంటున్నాయి. అయితే... ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఆదాయపన్ను శాఖ అధికారులు, పోలీసులు ఎక్కడికక్కడ నిఘా పెడుతుండటం; ఆన్‌లైన్‌లో నగదు పంపిణీకి అవకాశం లేకపోవడంతో... సొమ్ములను ఓటర్లకు అందజేయడం అభ్యర్థులకు కత్తి మీద సాములా తయారైంది.

వారికే ఎక్కువ... 
తమవర్గం వారి కంటే వైరి వర్గానికి చెందినవారి ఓట్లకు గాలం వేసేందుకే అభ్యర్థులు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ‘‘తమకు మద్దతిచ్చే వర్గం ప్రజలకు ఓటుకు రూ.2 వేలు ఇస్తుంటే... ప్రత్యర్థి వర్గానికి చెందినవారికి రూ.3 వేలు, అంతకంటే ఎక్కువ ముట్టజెబుతున్నాం. అయినా వారి ఓట్లు పడతాయో, లేదో గ్యారెంటీ లేదు. కానీ... వారిలో కొంతమంది అయినా మాకు అనుకూలంగా ఓటు వేయక మానరు. స్వల్ప మెజార్టీతోనైనా గట్టెక్కుతామన్న నమ్మకంతోనే ఇంతగా ఖర్చు చేస్తున్నాం’’ అని పలు పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ధనబలం బాగా ఉన్న పలువురు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఖర్చుకు వెనుకాడకుండా ఎన్నికలకు సిద్ధపడుతున్నారు. టికెట్లు ఆశించి భంగపడ్డ రెబల్‌ అభ్యర్థులు, కొందరు స్వతంత్రులు కూడా ఖర్చుకు వెనుకాడకుండా ప్రచారానికి, ప్రలోభాలకు తెరతీస్తున్నారు.

చాటుమాటుగా.. ప్రలోభమస్తు! 
 

 

మధ్యవర్తులు.. కుల, వృత్తి, మహిళా సంఘాల ద్వారా తాయిలాలను ఓటర్లకు  చేరవేస్తున్నారు. మహిళలకు బంగారు ఆభరణాలు, యువతకు సెల్‌ఫోన్లు, క్రికెట్‌ కిట్లు తదితరాలను ఎరగా వేస్తున్నారు.

చాటుమాటుగా.. ప్రలోభమస్తు! 
 

-ఈనాడు ఎన్నికల విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.