close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గందరగోళంలోనూ పెద్ద దేశమే

అమెరికా అంటే... అగ్రరాజ్యం..  శతాబ్దాల తరబడి ప్రజాస్వామ్య వ్యవస్థగల దేశం..లిఖితపూర్వక రాజ్యాంగాలకు మార్గదర్శి... ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు చెప్పుకోవచ్చు. కానీ అధ్యక్ష ఎన్నికలు వచ్చేసరికి అక్కడ ఉన్నంత గందరగోళం ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. 20-20 క్రికెట్‌ను తలపించే పోటీ ఉన్నా చివరికి గెలుపెవరిదో తేల్చడం కష్టం. వ్యవస్థలోనే అడుగడుగునా లోపాలు ఉన్నాయి. ఎక్కువ ఓట్లు వచ్చినా విజేత కాలేని పరిస్థితి ఇక్కడే కనిపిస్తుంది. తమ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక నియోజకవర్గంగా మార్చుకొనే సౌలభ్యమూ ఇక్కడే ఉంది! ‘జెర్రీ మాండరింగ్‌’గా పిలిచే ఈ ఏర్పాటును అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పటికప్పుడు తమకు అనుకూలంగా మలచుకుంటాయి. అక్రమాలకు ఇక్కడే బీజం పడుతుంది. తదుపరి ప్రక్రియల్లోనూ ఇవి కొనసాగుతుంటాయి. ఈ లోపాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే....

జాతీయ స్థాయి నిబంధనలూ లేవు
అధ్యక్ష ఎన్నికల విషయంలో జాతీయ స్థాయి ఏకరూప నిబంధనలు లేవు. ఓట్ల నమోదు, ఎలొక్టరల్‌ కాలేజీ, పోస్టల్‌ బ్యాలెట్‌ తదితర అంశాల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే అన్నట్టుగా నిబంధనలు ఉంటాయి. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రాష్ట్రం నిబంధనల ఆధారంగా తేల్చాలన్నది కష్టంగా మారుతుంది.

గుర్తింపు కార్డులది మరో సమస్య
ఓటు వేసేముందు గుర్తింపు కార్డులు చూపించడం అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో సర్వసాధారణంగా మారింది. ఇందుకు దాదాపుగా ఒకేలాంటి నిబంధనలను పాటిస్తున్నాయి. ఇక్కడ దేన్ని గుర్తింపుకార్డుగా పరిగణిస్తారో, దేన్ని తిరిస్కరిస్తారో తేల్చి చెప్పడం కష్టం.

ఓటేయకుండా అడ్డంకులు
కొన్ని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేయడం, ఓటు ఉన్నా దాన్ని వేయకుండా అడ్డంకులు కలిగించడం ఇక్కడి పార్టీల సాధారణ లక్షణం. స్వేచ్ఛాయుత ఎన్నికలన్న మాటేగానీ కొన్ని వర్గాల వారికి ఓటేసే భాగ్యం దక్కదు.

ఎన్నికల సంఘాలు రాజకీయమయం
రాష్ట్రాల్లోనే ఎన్నికల సంఘాలు ఉంటాయి. మొత్తం 50 రాష్ట్రాలకుగానూ 33 చోట్ల రాజకీయ నాయకులను ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునే వెసులుబాటు ఉంది. వారి వ్యక్తిత్వం ఆధారంగానే ఎన్నికల సంఘాల నిష్పక్షపాత వ్యవహారశైలి ఆధారపడి ఉంటుంది. చాలా చోట్ల ఎన్నికల కమిషనర్లు పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటుండడంతో వివాదాలకు ఆస్కారం కలుగుతోంది.

అధికారాలు లేని అధికార్లు
ఎన్నికలు నిర్వహించే అధికార్లకు పెద్దగా అధికారాలు ఉండవు. ప్రత్యేక సందర్భాల్లో విచణక్షను ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు.

వివాద పరిష్కార మార్గాలూ లేవు
ఎన్నికల వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు లేవు. రాష్ట్రానికొక నిబంధన ఉండడంతో పరిష్కారానికి కూడా రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. వాటి పరిధులు కూడా వేరువేరుగా ఉంటాయి. ఎన్నికల వ్యాజ్యాలపై కోర్టులు చాలా ఆలస్యంగా తీర్పు ఇస్తుంటాయి. వీటిని పరిష్కరించే నైపుణ్యం న్యాయమూర్తుల్లో తక్కువగా ఉంటుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

ఓట్ల లెక్కింపునకూ ఓ పద్ధతి ఉండదా!
ఓట్ల లెక్కింపునకూ ఓ విధానం అంటూ లేదు. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా కూడా రూల్స్‌ మారే సందర్భాలు ఉంటాయి. పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో ఈ  బెడద ఎక్కువగా ఉంది. అందుకే వివాదాలు అధికంగా ఉంటాయి.

ఎన్నికల రోజున సెలవు ఉండదు
అందరూ ఓటేయడానికి వీలుగా ఎన్నికల రోజును సెలవుగా ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆనవాయితీ. కొన్ని దేశాలయితే వారంతపు సెలవుల్లో ఎన్నికలు పెట్టుకుంటాయి. కానీ అమెరికాలో మాత్రం పనిదినమే.

ఎన్నికల కమిషన్‌ లేదు

ఇంత పెద్ద దేశంలో జాతీయ స్థాయి ఎన్నికల కమిషన్‌ లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఫెడరల్‌ వ్యవస్థను పాటించే భారత్‌, కెనడా, మెక్సికోవంటి దేశాల్లో జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ఉంటుంది. ఇక్కడ అధ్యక్ష ఎన్నికలకు బాధ్యత వహించే కమిషన్‌ అంటూ ఉండదు. రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాలే అధ్యక్ష    ఎన్నికలు నిర్వహిస్తాయి.

ఓటరుగా నమోదు చాలా కష్టం

ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జాబితాలో పేరు చేర్పించుకునే బాధ్యత ఓటరుదే. ఇందుకూ నిబంధనలు ఒక్కలా ఉండవు. రాష్ట్రానికొక రూలు. ప్రభుత్వమూ ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయదు. ఈ బాధలు పడలేక పేర్లు నమోదు చేయించుకోవడానికి ఇష్టపడనివారు ఎందరో.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు