close
Updated : 01/07/2021 19:01 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

బగ్స్ కనిపెడుతూ లక్షలు సంపాదిస్తోంది!

ఆ అమ్మాయికి కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పట్టా కూడా లేదు. అయితేనేం ప్రోగ్రామింగ్‌, ఎథికల్‌ హ్యాకింగ్‌లో మంచి పట్టుంది. ఆ నైపుణ్యంతోనే ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌ లాంటి ప్రముఖ సంస్థలకు చెందిన సాఫ్ట్‌వేర్‌లలో లోపాలు (బగ్స్‌) కనిపెట్టి ప్రశంసలు, రివార్డులు అందుకుంది. తాజాగా మరో టెక్‌ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సిస్టంలో బగ్‌ను వెతికి పట్టుకుని ఏకంగా 30 వేల అమెరికన్‌ డాలర్ల (ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ.22 లక్షల) బహుమతిని అందుకుంది. ఆ అమ్మాయే దిల్లీకి చెందిన 20 ఏళ్ల అదితీ సింగ్.

రూ.22 లక్షల నగదు బహుమతి!

సైబర్‌ మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ప్రముఖ టెక్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ ప్రోగ్రాంలను అప్‌డేట్‌ చేస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో వాటిలో లోపాలు తలెత్తుతుంటాయి. అలాంటి వాటిని కనిపెట్టి కంపెనీల దృష్టికి తీసుకువచ్చిన వారికి పెద్ద మొత్తంలో నగదు బహుమతులు కూడా అందజేస్తుంటాయి. ఈ క్రమంలో రెండు నెలల క్రితమే మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌ సిస్టంలో ఆర్‌సీఈ (రిమోట్‌ కోడ్‌ ఎగ్జిక్యూషన్‌)లో బగ్‌ను కనిపెట్టింది అదితి. ఈ లోపాన్ని ఉపయోగించుకుని సైబర్‌ నేరగాళ్లు, హ్యాకర్లు సులభంగా కంపెనీల సమాచారాన్ని దొంగిలించగలరని గుర్తించింది. ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ దృష్టికి కూడా తీసుకెళ్లింది. కానీ ఆ సంస్థ వెంటనే స్పందించలేదు. అయితే ఈ బగ్‌తో కలిగే నష్టాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మైక్రోసాఫ్ట్‌ ఆ లోపాన్ని వెంటనే సరి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బగ్‌ను గుర్తించి తమకు సహకరించినందుకు అదితికి రూ.22 లక్షల రివార్డు అందజేసింది.

ఇది అదితి కనిపెట్టిన రెండవ మేజర్‌ బగ్‌ కావడం విశేషం. కొన్ని నెలల క్రితమే దీనినే పోలిన బగ్‌ను ఫేస్‌బుక్‌లో కనిపెట్టి ఆ సంస్థకు సమాచారమిచ్చిందీ యంగ్‌ సెన్సేషన్‌. ఇందుకు గాను ఫేస్‌బుక్‌ ఆమెకు 7,500 అమెరికన్‌ డాలర్ల (సుమారు ఐదున్నర లక్షలు) నగదు బహుమతిని ప్రకటించింది.

డాక్టరవుదామనుకొని!

బగ్‌ బౌంటీ హంటింగ్‌....ప్రస్తుతం ఇండియాలోని ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఎక్కువగా ఎంచుకుంటున్న కెరీర్‌ ఆప్షన్లలో ఇది కూడా ఒకటి. టెక్‌ కంపెనీలకు తీవ్ర నష్టం కలిగించే బగ్స్‌ను వెతికి కనిపెట్టడమే ఈ వృత్తి ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ఎథికల్‌ హ్యాకర్‌గా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్న అదితి మరీ పెద్ద చదువులేమీ అభ్యసించలేదు. కనీసం కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ లాంటి సాంకేతిక విద్యనూ చదువుకోలేదు. చాలామంది అమ్మాయిల్లాగే ఆమె కూడా డాక్టరవ్వాలనుకుంది. అందుకే పదో తరగతి పూర్తి చేసిన వెంటనే నీట్‌ పరీక్ష కోసం రాజస్థాన్‌లోని కోటాలో ఓ ప్రైవేటు ఇనిస్టిట్యూట్‌లో చేరింది. అయితే మెడికల్‌ ఎంట్రన్స్‌లో సీటు రాకపోవడంతో ఎథికల్‌ హ్యాకింగ్‌పై ఆసక్తి పెంచుకుంది.

అదే నా మొదటి హ్యాకింగ్!

‘నేను ఈ రంగంలోకి ప్రవేశించి సుమారు రెండేళ్లు పూర్తయింది. ఇందులో భాగంగా మొదటిసారి మా పొరుగింటి వారి వైఫై పాస్‌వర్డ్‌ను సక్సెస్‌ఫుల్‌గా హ్యాక్‌ చేశాను. అప్పటి నుంచే ఎథికల్‌ హ్యాకింగ్‌లో నైపుణ్యాలను పెంచుకుంటున్నాను. ఇక నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, మైక్రోసాఫ్ట్‌, మోజిల్లా, పేటీఎం, హెచ్‌పీ వంటి 40 కంపెనీల సాఫ్‌ట్‌వేర్‌లలో బగ్స్‌ కనిపించాయి. ముఖ్యంగా టిక్‌టాక్‌లోని ఓటీపీ బైపాస్‌ బగ్‌ను కనుగొన్న తర్వాత ఎథికల్‌ హ్యాకింగ్‌లో నాపై నాకు నమ్మకాన్ని పెంచింది. దీని గురించి సమాచారమిచ్చినందుకు గాను టిక్‌టాకు నాకు ౧౧ వందల అమెరికన్‌ డాలర్ల (సుమారు రూ.82 వేలు)ను బహూకరించింది. నా మొదటి సంపాదన కూడా అదే.’

కంప్యూటర్‌ డిగ్రీలు అవసరం లేదు!

‘హార్వర్డ్‌, కొలంబియా, స్టాన్‌ఫోర్డ్‌, కాలిఫోర్నియా లాంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు నా పనితీరును గుర్తించి ప్రశంసా పత్రాలు అందజేశాయి. ఎథికల్‌ హ్యాకర్‌గా స్థిరపడాలంటే ఎలాంటి కంప్యూటర్‌ డిగ్రీలు అవసరం లేదు. గూగుల్‌, ట్విట్టర్‌, హ్యాకర్‌ వన్‌లలో దీనికి సంబంధించిన బోలెడు సమాచారముంటుంది. అదేవిధంగా పైతాన్‌, జావా స్ర్కిప్ట్‌ లలో ఏదో ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ మీద పూర్తి పట్టు సాధించాలి. ఓఎస్‌సీపీ సర్టిఫికెట్‌ కోర్సు కూడా చేయాలి. నా విషయానికొస్తే...నేను ఎలాంటి సాంకేతిక విద్యను అభ్యసించకుండానే ఈ స్థాయికి చేరుకున్నాను. నా విద్యార్హతలు తెలుసుకోకుండానే ‘మ్యాప్‌ మై ఇండియా’ సంస్థ నాకు ఉద్యోగం కల్పించింది. ఆ కంపెనీలోని కొన్ని బగ్స్‌ కనిపెట్టినందుకు నన్ను ఆ కంపెనీ సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌గా నియమించుకుంది. ఇక బగ్‌ బౌంటీ ద్వారా వచ్చే ఆదాయంలో చాలా వరకు హ్యాకింగ్‌ టూల్స్ కొనడానికే ఖర్చు చేస్తాను. హ్యాకింగ్‌కు సంబంధించిన కొన్ని సర్టిఫికెట్‌ కోర్సులకు కూడా ఆ మొత్తాన్ని వెచ్చిస్తున్నాను’ అంటూ తన ప్రయాణాన్ని వివరించిందీ యంగ్‌ సెన్సేషన్.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని