ప్రధానాంశాలు

Published : 31/05/2021 19:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL 2021: ఎవరున్నా లేకున్నా ఐపీఎల్‌ ఆగదు

స్పష్టం చేసిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాంతో మిగిలిన మ్యాచ్‌లను ఎలాగైనా సెప్టెంబర్‌లో నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత యూఏఈలో ఆ మ్యాచ్‌లను కొనసాగించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. శనివారం జరిగిన స్పెషల్‌ జనరల్‌ మీటింగ్‌లో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా బీసీసీఐ పేర్కొంది. 

సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 10 మధ్య మిగిలిన 31 మ్యాచ్‌లు పూర్తి చేయాలని భారత క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. అయితే, అక్టోబర్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ కూడా జరగాల్సి ఉండడంతో విదేశీ జట్లు తమ ఆటగాళ్లను మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పంపించేందుకు వెనకాడుతున్నాయి. ఆ సమయంలో ఇంగ్లాండ్‌కు ఇతర జట్లతో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. అలాగే ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లకు తగిన విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై తాజాగా స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా.. సెప్టెంబర్‌లో యూఏఈకి ఎవరొచ్చినా, రాకపోయినా ఐపీఎల్‌ 14వ సీజన్‌ను పూర్తి చేస్తామని చెప్పారు.

‘ఐపీఎల్‌ తిరిగి నిర్వహించినప్పుడు విదేశీ ఆటగాళ్లు వస్తారా లేదా అనే విషయంపై మేం చర్చలు జరిపాం. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన మ్యాచ్‌లను పూర్తిచేయాలనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. ఈ సీజన్‌ను ఇలాగే మధ్యలో వదిలేయలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విదేశీ జట్టు ఆటగాళ్లు వచ్చి ఆడినా ఫర్వాలేదు. అలాగే ఎవరు అందుబాటులో లేకపోయినా మమ్మల్ని టోర్నీ నిర్వహించకుండా ఆపలేరు. మాకు భారత ఆటగాళ్లతో పాటు పలువురు విదేశీ కుర్రాళ్లు కూడా ఉన్నారు. కానీ కొంతమంది విదేశీ ఆటగాళ్లు రాలేకపోతారు. దాంతో ఆయా ఫ్రాంఛైజీలు ఇతర ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. ఎవరు ఆడితే వాళ్లతో టోర్నీని నిర్వహిస్తాం. అదే మా అజెండా’ అని శుక్లా మీడియాకు వివరించారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net