
తాజా వార్తలు
గ్రామ్‌ఫోన్ ‘రికార్డ్ ఆయనది’
నాణేలు, స్టాంపులు సేకరించడం రవి పాడికి ఆసక్తి. 1934 నాటి స్టాంపులు మొదలుకొని.. గాంధీ 150వ జయంతి సందర్భంగా ఇటీవల ప్రధాని మోదీ విడుదల చేసిన తపాలా స్టాంపు, రూ.150 నాణెం వరకు ఎన్నో సేకరించారు. దాదాపు రెండువేల స్టాంపులు రవి దగ్గర ఉన్నాయి.
కోరుకున్న పాట ఫోన్లో వినే రోజులివి. ఆయన ఇంటికి వెళ్తే మాత్రం అవే పాటలు గ్రామ్ఫోన్లో వినొచ్ఛు పదులు కాదు.. వందలు కాదు.. వేలకు వేలు.. 35 వేల గ్రామ్‌ఫోన్ రికార్డులు ఆ ఇంట్లో ఉన్నాయి. వాటిలో హిందుస్థానీ సంగీత వైభవం ఉంది. కర్ణాటక సంగీతం ప్రాభవం ఉంది. ఘంటసాల మాస్టారి గళవిన్యాసం, రఫీసాబ్ స్వర మాధుర్యం ఇలా ఆ పాత మధురాలెన్నో ఉన్నాయక్కడ. అలనాటి గ్రామ్‌ఫోన్ రికార్డులతో అమృతగానాన్ని ఆస్వాదిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన రైల్వే అధికారి రవిప్రసాద్ పాడి.
శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన గ్రామ్‌ఫోన్ రికార్డులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన చిత్రరాజాల అపురూప గీతాలు ఆయన ఇంట్లో పదిలంగా ఉన్నాయి. రికార్డ్ అయి సినిమాలో లేని పాటలు, ఒరిజినల్ ట్రాక్స్, లైవ్ రికార్డింగ్ పాటలు ఇలా అరుదైన సేకరణలను భద్రంగా దాచారు. గాంధీజీ ప్రసంగానికి సంబంధించిన గ్రామ్‌ఫోన్ రికార్డులు, మహాత్ముడి కోసం ఎంఎస్ సుబ్బులక్ష్మి పాడిన ఒరిజినల్ రికార్డులు సేకరించారు రవి పాడి. ఇటీవల కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో ఓ ఫ్లోర్ అంతా రికార్డులకే కేటాయించారు. వీటి ప్రదర్శన కోసం ఇంట్లోనే ఓ మినీ థియేటర్ నిర్మించుకున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత కంపోజర్లు ఎన్మో మోరికాన్, పాల్మారియట్, జాన్‌బెర్రీ తదితరుల పాటలు, ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌లను, వెస్ట్రన్, పాప్ సంగీతానికి సంబంధించిన గ్రామ్‌ఫోన్ రికార్డులు ఆయన దగ్గరున్నాయి. తెలుగు, హిందీ సినీ పరిశ్రమల్లో దాదాపు అందరు సంగీత దర్శకుల్ని, టెక్నీషియన్లను ప్రత్యక్షంగా కలిశారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన దగ్గరున్న కలెక్షన్ కోసం ప్రత్యేకంగా సంప్రదిస్తుండటం విశేషం.
- అభిసాయి ఇట్ట, ఈనాడు డిజిటల్, హైదరాబాద్